Updated : 13/10/2021 06:12 IST

ఆశయం కోసం తన సంస్థనే అమ్మేసింది

కొనడం.. అమ్మడం మాత్రమే తెలిసిన వ్యాపారవేత్తలకు మనసు కూడా ఉంటుందా? ఉంటుందనే నిరూపించింది 72 ఏళ్ల జయశ్రీరావు. గ్రామీణుల కష్టాలని చూసి చలించిన ఆమె వాళ్లకు సాయం చేయడానికి సొంత సంస్థనే అమ్మేసింది. ఆ త్యాగం ఈ రోజు లక్షలమంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహారాష్ట్రలోని 200 గ్రామాల ప్రజలకు మేలు చేసిన ఆమె స్ఫూర్తి కథనమిది..

బెంగళూరుకు చెందిన జయశ్రీ చిన్నతనం నుంచీ పేదలకు సేవలందించడానికి ముందుండేవారు. గ్రామీణ పేదల సామాజిక, ఆర్థికపరిస్థితులు మార్చాలని కలలు కనేవారు. డిగ్రీని మధ్యలోనే ఆపేసి, ఓ ఎన్జీవోతో కలిసి గ్రామాల్లో పనిచేశారీమె. భర్తతో కలిసి లండన్‌ వెళ్లిన జయశ్రీ ఆరేళ్లకు తిరిగి ఇండియా చేరుకున్నారు. తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని సొంతంగా ‘జేఆర్‌ రావు అండ్‌ కంపెనీ’ పేరుతో ఇంజినీరింగ్‌ టూల్స్‌ సేల్స్‌ వ్యాపారం ప్రారంభించారు. ఆ సంస్థ లాభాల బాట పట్టింది. కానీ అనుకోకుండా జరిగిన ఓ సంఘటన తన జీవితాన్ని మలుపు తిప్పింది. కూరగాయల మార్కెట్‌లో రూ.5 దగ్గర బేరమాడుతున్న జయశ్రీతో ఆ రైతు చెప్పిన మాటలు ఆమెని కదిలించాయి. వర్షాభావంతో వ్యవసాయం కుంటుపడటం, తాగునీటి కోసం ఇబ్బందులు వంటివన్నీ విన్న జయశ్రీ ఆ ప్రాంతాలను ఏదోవిధంగా అభివృద్ధిపథంలో నడిపించాలని అనుకున్నారు. అక్కడి మహిళలకు సాధికారత, ప్రభుత్వపథకాలపై అవగాహన, వర్షపునీటి నిల్వ వంటివాటిపై శిక్షణ ఇప్పించాలనుకున్నారు. అందుకు కావాల్సిన డబ్బుకోసం 2007లో సంస్థను విక్రయించి పాంచ్‌గనిలోని ఆఖేగని గ్రామానికి చేరుకున్నారు.

‘గ్రామపరి’ పేరుతో...  ‘గ్రామపరి’ పేరుతో పర్యావరణ కేంద్రాన్ని ప్రారంభించారు జయశ్రీ. గ్రామప్రజలకి ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగించడం మొదలుపెట్టారు. బిహార్‌లోని ఓ గ్రామం ప్రభుత్వ పథకాలన్నింటినీ వినియోగించుకుని అభివృద్ధి చెందిన విధానాన్ని పత్రికలో చదివిన ఆమె ఆఖేగని గ్రామాన్ని అలా మార్చాలని ఆశయంగా పెట్టుకున్నారు. కానీ ప్రజల సహకారం అందేది కాదు. దాంతో ముందుగా అక్కడి మహిళలకు ఆర్థికభరోసాను అందించాలనుకుని మట్టి ప్రమిదల తయారీలో శిక్షణనిప్పించారు. అలా తయారైన ఉత్పత్తులను స్థానికంగా అమ్మేవారు. అలాగే వర్షపునీటిని నిల్వ చేసుకొనే విధానాన్ని శిక్షణనిప్పించి అందరూ పాటించేలా చేశారు. అలా నిల్వ ఉంచిన నీరు తాగడానికి, సేద్యానికి ఉపయోగపడేది. ఒక ఊళ్లో మొదలైన ఈ ప్రయత్నాలను పొరుగు గ్రామాలూ అనుసరించడం మొదలుపెట్టాయి.

ఈ అభివృద్ధి 14 ఏళ్లలో 200 గ్రామాలకు వ్యాపించింది. మహిళలకు హస్తకళలు, చేతివృత్తుల్లో శిక్షణతోపాటు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం వంటి అంశాల్లోనూ అవగాహన కలిగించారామె. ‘అక్కడి చిన్నారులను డయేరియా వంటి వ్యాధులబారి నుంచి తప్పించడానికి ‘టిప్పీ టాప్‌’ ప్రాజెక్టును ప్రారంభించా. ప్రతి గ్రామంలోని పాఠశాలలో శుభ్రత పట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహించా. దీంతో 162 పాఠశాలలు తమ విద్యార్థులకు చేతుల పరిశుభ్రతకు సబ్బు, నీటి సౌకర్యాన్ని అందించాయి. ఇప్పటివరకు 1.22 లక్షలమంది మేం అందించిన శిక్షణా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందారు. ఏ అభివృద్ధి అయినా వెంటనే కనిపించదు. శాశ్వత ప్రయోజనాలను పొందాలంటే ముందుగా విత్తనాలు వేయాలి. నేనూ అదే చేశా’ అంటారు జయశ్రీ వినమ్రంగా.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని