Updated : 03/11/2021 06:05 IST

వాళ్లను గెలిపించేందుకు...

ఆమె ఓ వ్యాపారవేత్త. తండ్రికి వారసురాలిగా నిలిచి వ్యాపారాన్ని విస్తరించింది. దేశంలోనే ఆరోగ్య రంగంలో తనదైన ముద్ర వేసి, గుర్తింపు తెచ్చుకుంది. చేయగలవా అని ప్రశ్నించిన నోళ్లతోనే నీపై నమ్మకం ఉంది అనిపించుకోగలిగింది. అమీరా షా.. తను మాత్రమే కాదు.. ఆడవాళ్లు వ్యాపార రంగంలోకి వస్తే తమను తాము నిరూపించుకోగలరనుకుంది. వారికి చేయూతనిచ్చేందుకు ఓ సంస్థనూ ప్రారంభించింది. 50 మందికి పైగా మహిళలు వ్యాపార రంగంలోకి ప్రవేశించేలా చేసింది.

అమీరా యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ నుంచి బీబీఏనూ, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఓనర్‌- ప్రెసిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌నూ చేసింది. తండ్రి డాక్టర్‌ సునీల్‌షా పాథాలజిస్ట్‌, తల్లి డాక్టర్‌ దురూ షా గైనకాలజిస్ట్‌. తండ్రికి ముంబయిలో ‘డాక్టర్‌ సునీల్‌ షాస్‌ పాథ్‌ ల్యాబ్‌’ పేరిట వైద్యసేవలతో కూడిన ల్యాబ్‌ ఉంది. తల్లిదండ్రులిద్దరూ వైద్యులవ్వడం, రోగుల కోసం ఒక్కోసారి రాత్రిళ్లూ దూరాలు వెళ్లే వాళ్లిద్దరినీ చూసి ఈ రంగంపై తనకూ ఆసక్తి కలిగిందంటుంది అమీరా.

చదువు పూర్తయ్యాక యూఎస్‌లో మంచి ఉద్యోగావకాశం వచ్చినా తండ్రి ల్యాబ్‌ను నడిపించడానికే ఆసక్తి చూపిందీమె. దేశంపై ప్రేమతోపాటు ఎక్కువమంది జీవితాల్లో ప్రభావం చూపే ఆరోగ్య రంగంలో పనిచేయాలన్న చిన్ననాటి కలా అందుకు కారణమంటుంది. కానీ ఈమెకు వైద్య సంబంధ పరిజ్ఞానమేమీ లేదు. మెడికల్‌ టెర్మినాలజీ, ల్యాబొరేటరీ కాన్సెప్టుల గురించి తెలుసుకుంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు ఇన్వెస్టర్లు ‘అమ్మాయివి నువ్వే చేయగలవు?’, ‘పెళ్లి అయిపోతే తర్వాత ఎవరు చూసుకుంటారు?’ వంటి ప్రశ్నలేసేవారు. 2001లో ప్రైవేటు బ్యాంకు నుంచి లోన్‌ తీసుకుని తండ్రి ల్యాబ్‌ను ‘మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌’గా మార్చింది. అప్పటికి ఆమె వయసు 22 ఏళ్లే. యువతకు ప్రాధాన్యమివ్వడం, కంప్యూటరీకరణ వంటి వాటిని ప్రవేశపెట్టింది. కొన్ని చిన్న ల్యాబ్‌లను కొనుగోలు చేయడం, కొన్నింటితో కలిసి పనిచేయడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించింది. మొదట ముంబయి, తర్వాత దేశవ్యాప్తంగా శాఖలను ఏర్పాటు చేసి, లిస్టెడ్‌ కంపెనీ స్థాయికి తెచ్చింది. అంతర్జాతీయంగా నాణ్యమైన పరీక్షలను అందించే అతి కొద్ది ల్యాబ్‌ల్లో మెట్రోపాలిస్‌ ఒకటిగా నిలిచేలా చేసింది. విదేశీ, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలను వ్యాధినిర్ధారణ కోసం అందరి కంటే ముందే అందుబాటులో ఉంచేది. దాదాపుగా 4000 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను అందుబాటులో ఉంచింది. మారిషస్‌, శ్రీలంక, ఘనా, జాంబియా, కెన్యాల్లోనూ 125 సంస్థ శాఖలున్నాయి. అలా ఆరోగ్య రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది.

తనతోపాటు ఇంకొందరూ.. తన వ్యాపార ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో అమీరాకు ఓ ఆలోచన వచ్చింది. ఆమెకు మహిళా నాయకత్వం మీద నమ్మకం ఎక్కువ. వ్యాపార ఆలోచనలున్నవారికి కొంత సాయమందిస్తే మంచి వ్యాపారవేత్తలను తయారు చేయొచ్చన్నది ఆమె ఆలోచన. దీంతో 2017లో అమీరా ‘ఎంపవరెస్‌’ పేరిట ఒక లాభాపేక్షలేని సంస్థను ప్రారంభించింది. దీని ద్వారా వారికి పెట్టుబడితోపాటు దిశానిర్దేశం కూడా చేస్తుంది. ఇప్పటివరకూ 50మందికిపైగా వ్యాపారం ప్రారంభించడంలో సాయమందించింది.

మహిళా సాధికారత మీద ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద ప్రసంగించి ఫిక్కీ, , ఐఐఎం, టెడ్‌ఎక్స్‌, సీఐఐ, ట్విటర్‌తోపాటు తను చదివిన హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లోనూ ప్రసంగాలనిచ్చింది. అమ్మాయిలను తమ ఆలోచనలకు రూపమివ్వమని ప్రోత్సహిస్తుంటుంది. 5లక్షలకుపైగా ఉచితంగా ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లనూ అందించింది. 42 ఏళ్ల అమీరాకి టెన్నిస్‌ ఆడటం, పర్వతారోహణ చాలా ఇష్టం. కథక్‌ డ్యాన్సర్‌ కూడా.

అవార్డులెన్నో.. ఈమె ఆధ్వర్యంలో మెట్రోపొలిస్‌ 2004లో ఎన్‌ఏబీఎల్‌, 2005లో ద కాలేజ్‌ ఆఫ్‌ అమెరికన్‌ పాథాలజిస్ట్‌ల గుర్తింపు పొందింది. గ్లోబల్‌ గోల్డ్‌ స్టాండర్డ్‌ లెబోరేటరీ గుర్తింపుతోపాటు సీఎల్‌ఐఏ సర్టిఫికేషన్‌నూ దక్కించుకుంది. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ మెట్రోపాలిస్‌కు దేశంలోనే ఉత్తమ డయాగ్నస్టిక్‌ ల్యాబొరేటరీ అవార్డును అందించింది. ఈక్రమంలో అమీరా ఎన్నో అవార్డులనూ అందుకుంది. 2011లో ఆంత్రప్రెన్యూర్‌ ఇండియా నుంచి యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌, సీఎంఓ ఆసియా నుంచి యంగ్‌ అచీవర్‌ అవార్డులను అందుకుంది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ నుంచి యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌ అవార్డునూ అందుకుంది. ఫార్చ్యూన్‌ ఇండియా 2017, 18, 19ల్లో దేశంలో ప్రభావవంతమైన మహిళగా పేర్కొంది. ఫోర్బ్స్‌ ఇండియా టైకూన్‌ ఆఫ్‌ టుమారో జాబితాలో చేర్చింది. 2021లో హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌, ఫీల్డ్స్‌ ఆఫ్‌ విమెన్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ల్లో ‘వీర్నీ’ అవార్డునూ గెల్చుకుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని