Updated : 22/01/2022 06:38 IST

శెభాష్‌ సైన్స్‌ టీచరమ్మ!

పొలం పనులకు వెళ్లి చదివించే తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్నారామె. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాతా చదువు తోడుని వదల్లేదు. ఉపాధ్యాయినిగా పిల్లలు సైన్స్‌లో అద్భుతాలు చేసేలా వాళ్లని సానబెట్టారు. మట్టిలో మాణిక్యాలని వెలికితీశారు. ఆ కృషికే తాజాగా విక్రంసారాభాయ్‌ టీచర్‌ సైంటిస్ట్‌ అవార్డుకు ఎంపికయ్యారు సూర్యాపేట్‌కు చెందిన మారం పవిత్ర...  

చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. అమ్మానాన్నలకి మేం ఇద్దరం ఆడపిల్లలం. మమ్మల్ని చదివించేందుకు అమ్మ కళమ్మ వ్యవసాయ పనులకు వెళ్లేది. ఆమె కష్టాన్ని కళ్లారా చూసిన మేం చదువుకుని మంచి స్థాయికి వెళ్లాలనుకున్నాం. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో ఇంటర్‌, డిగ్రీల్లో తక్కువ ఫీజుతో చదివించడానికి కొన్ని ప్రయివేటు కళాశాలలు ముందుకొచ్చాయి. అక్కడా అన్నింట్లో ప్రథమస్థానంలో ఉండేవాళ్లం. నాకు డిగ్రీ రెండో సంవత్సరంలోనే వివాహం అయ్యింది. మావారు నాతాల మన్మథరెడ్డి పోలీస్‌ కానిస్టేబుల్‌. ఆయన ప్రోత్సాహంతోనే డిగ్రీ అయ్యాక బీఈడీ, డీఈడీ కూడా పూర్తిచేశా. నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్ల ఆలనాపాలనా చూసుకుంటూనే స్కూల్‌ అసిస్టెంట్ ఉద్యోగం సంపాదించాను. నాకీ ఉద్యోగం రావడానికి ప్రధాన కారణం నేను చదివిన స్కూల్లోని సైన్స్‌ మాస్టార్లే. వాళ్లిచ్చిన స్ఫూర్తితోనే రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ఎన్నో అవార్డులు అందుకున్నా. నా గురువులు నాకు అందించిన ప్రోత్సాహాన్నే నేనూ నా విద్యార్థులకు అందించాలనుకున్నా. హైస్కూల్‌ పిల్లలకు గైడ్‌గా ఉంటూ సైన్స్‌ఎగ్జిబిషన్లలో వాళ్లు ప్రతిభ చాటేందుకు నావంతు తోడ్పాటు అందించేదాన్ని. అలా మా పిల్లలు చేసిన ప్రయోగాలకు జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో గుర్తింపు, అవార్డులు వచ్చాయి. అగస్త్య విజ్ఞాన, అగస్త్య అన్వేషణ వంటి పోటీల్లో మా విద్యార్థులు 30 మంది జాతీయస్థాయి అవార్డులను అందుకున్నారు. వాళ్ల విజయం నన్ను మరింత ముందుకు నడిపించింది.

యూట్యూబ్‌ సాయంతో...
గత సంవత్సరం ఉపాధ్యాయులకు ఉపయోగపడే అవగాహన తరగతులని యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అందించాను. ఐదేళ్లుగా స్టేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ సాయంతో సైన్స్‌ పాఠాలని బోధిస్తున్నా. అవే ఏటా డీడీ యాదగిరి విద్యాఛానల్‌లో ప్రసారం అవుతూ ఎంతోమంది పిల్లలకు చేరువవుతున్నాయి. తెలంగాణలో ఆరు నుంచి పదో తరగతి జీవశాస్త్రం పుస్తకాలలో క్యూఆర్‌కోడ్‌ ద్వారా అందించేందుకు కావాల్సిన కంటెంట్ని 60 వీడియోల రూపంలో తయారు చేశా.దూరవిద్యలో పదోతరగతి చదివే వారి కోసం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, హోమ్‌సైన్స్‌ పాఠ్యాంశాలు రాశాను. కొవిడ్‌ సమయంలో పిల్లలు చదువులకు దూరమవుతున్నారనిపించింది. అందుకే వాళ్లకు తేలిగ్గా అర్థమయ్యేలా 50 సైన్స్‌ వీడియోలను రూపొందించి వాట్సప్‌ ద్వారా అందించా. విద్యార్థుల్లో సైన్స్‌పై భయం లేకుండా, ఇష్టపడి చదివేలా చేయాలన్నదే నా కల.  

టెక్‌మహేంద్రా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం నిర్వహించిన సైన్స్‌ ఉపాధ్యాయుల పోటీలో ట్రాన్స్‌ఫార్మింగ్‌ అవార్డునీ, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డులనీ అందుకున్నా. 2018లో బాలల దినోత్సవం రోజున రాష్ట్రపతిని కలిసే అవకాశం లభించింది. తాజాగా విజ్ఞాన ప్రసార్‌ నెట్వర్క్‌, డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీల ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఇచ్చే విక్రం సారాభాయ్‌ టీచర్‌ సైంటిస్ట్‌ అవార్డుకు ఎంపికయ్యా. ఇందుకోసం మూడు వడపోతలు దాటి ఈ పురస్కారానికి ఎంపికయ్యా. ఫిబ్రవరి 28న ఈ అవార్డును అందుకోనున్నా.

- కొణతం సైదిరెడ్డి. న్యూస్‌టుడే గరిడేపల్లి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని