మహిళా సమరయోధుల పార్కు!

దేశం కోసం త్యాగాలు చేసినవాళ్లు... జైలు జీవితం అనుభవించిన వాళ్లు అంటే మనకి టక్కున మగవాళ్లే గుర్తుకువస్తారు. ఆడవాళ్లు గుర్తుకు రారు. కారణం వాళ్ల గురించి మనకు పెద్దగా తెలియదు. అందుకే దేశం కోసం తమ జీవితాలనే ...

Published : 07 Mar 2022 00:14 IST

దేశం కోసం త్యాగాలు చేసినవాళ్లు... జైలు జీవితం అనుభవించిన వాళ్లు అంటే మనకి టక్కున మగవాళ్లే గుర్తుకువస్తారు. ఆడవాళ్లు గుర్తుకు రారు. కారణం వాళ్ల గురించి మనకు పెద్దగా తెలియదు. అందుకే దేశం కోసం తమ జీవితాలనే అంకితం చేసిన 12 మంది మహిళా దేశభక్తుల గురించి తెలిసేలా రాజమహేంద్రవరంలో ఒక పార్కుని నిర్మించారు. ఆ విశేషాలే ఇవి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌ సమీపంలో పాలౌచౌక్‌ పేరుతో నిర్మించిన పార్కుకు వెళ్తే అనేక విశేషాలు తెలుసుకోవచ్చు. 1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభల్లో ప్రవేశ పత్రం లేని కారణంగా జవహర్‌లాల్‌ నెహ్రూనే లోపలకు రాకుండా అడ్డగించిందో అమ్మాయి. ఆమే దుర్గాబాయి దేశ్‌ముఖ్‌. ఇక్కడ ఆమె విగ్రహంతో పాటు మరో పదకొండుమందివీ ఉన్నాయి. వీళ్లలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారే. దువ్వూరి సుబ్బమ్మ... స్వతంత్రోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన తొలి తెలుగు మహిళ ఆమె. సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని 1964లో చనిపోయారు. కాశీభట్ల వెంకట రమణమ్మ శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని కారాగార శిక్ష అనుభవించారు. నిండు గర్భిణిగా ఉద్యమంలో పాల్గొన్న ఆమెను... నెలలు నిండిన తర్వాత అధికారులు విడుదల చేశారు. పెద్దాడ కామేశ్వరమ్మ మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో పట్టభద్రురాలు. ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం అనుభవించారు. గోదావరి జిల్లా యర్నగూడెంలో జన్మించిన గూడూరి నాగరత్నమ్మ ఒకరు. ఈవిడ గాంధీజీ నాయకత్వంలో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని పది నెలలు కారాగార శిక్ష అనుభవించారు. నిడదవోలులో జన్మించిన గుజ్జు నాగరత్నం విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారు. అలివేలమ్మ.. అలహాబాద్‌లో కమలా నెహ్రూతో కలిసి విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమంలో పాల్గొన్నందుకు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. పాలకోడేటి శ్యామలాంబ ఈవిడ మహిళల్లో దేశభక్తిని పెంచి చైతన్యం తీసుకొచ్చారు. 1941లో సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలు పాలయ్యారు. వీరుకాక మద్దూరి వెంకట రమణమ్మ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, సోదెమ్మ, శివరాజు సుబ్బమ్మ వంటి వారి వీర చరిత స్మరించుకునేలా పార్కును ఏర్పాటు చేశారు.

- వై.సూర్యకుమారి, రాజమహేంద్రవరం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్