Published : 05/05/2022 01:58 IST

ఓ కోయిల... ఓ నెమలి

పేద కుటుంబంలో పుట్టినందుకు నిరాశ చెందలేదామె. పదిహేడేళ్లకే పెళ్లయితే ఇంకేముంది జీవితం అనుకోలేదు. అడ్డంకులకు బాధపడలేదు, అవరోధాలకు కుంగిపోలేదు. ఆశల అడుగులు వేసుకుంటూ ఆశయాల గమ్యాలను నిర్దేశించుకుంటూ సాగుతోంది ఆమె పయనం... రాజస్థాన్‌కు చెందిన వీణ స్ఫూర్తిగాథ ఇది...

వీణా మోదానికి ఆరుగురు అక్కచెల్లెళ్లు, ఒక సోదరుడు. ఇంట్లో డబ్బుకు కటకటగా ఉండటాన చదువు ఆపేసింది. అమ్మ ఏ పని చెప్పినా పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా చేసేది. ఆమె పాటలు విని పిల్లలూ పెద్దలూ చప్పట్లు కొట్టేవారు. వీణ ఓ కోయిల, ఓ నెమలి.. తనెక్కడా ఏదీ నేర్చుకోలేదు. సినిమాల్లో చూసినదానికి తన  పరిజ్ఞానాన్ని జోడించి అద్భుతంగా పాడేది... నర్తించేది. అయినా గురువుదగ్గర సంగీత నృత్యాలు నేర్చుకోవాలన్న వీణ కోరిక ఇంట్లో హాస్యాస్పదంగా తోచింది. పదిహేడేళ్లకే పెళ్లి చేసి పంపేశారు.

వీణ అత్తగారింట్లో తన అభిరుచి గురించి చెప్పింది. వాళ్లు విచిత్రంగా చూశారు. ఆమె అంతటితో ఆపేయక, అవి లేకుంటే తన జీవితం అసమగ్రమేనంది. తను అప్పటి వరకూ స్వయంకృషితో నేర్చుకున్న విద్యను చుట్టుపక్కల పిల్లలకు నేర్పేందుకు అత్తింటివారు ఒప్పుకొన్నారు. అప్పుడామె డ్యాన్స్‌ అకాడెమీ ప్రారంభించింది.

ఆశా భోంస్లే ఆఫ్‌ రాజస్థాన్‌...

ఏడేళ్ల క్రితం వీణా మోదాని వేదిక మీద ఆలపించినప్పుడు గ్రామీ అవార్డు గ్రహీత పండిట్‌ విశ్వమోహన్‌ భట్‌, ప్రముఖ ఫ్లూట్‌ కళాకారుడు రోనూ మజుందార్‌లు - ఈమె ప్రతిభా పాటవాలను ఆకాశానికి ఎత్తేశారు. లతామంగేష్కర్‌ గొంతులో మాధుర్యం, ఆశా భోంస్లే గళంలో మత్తు వీణలో కలగలసి ప్రవహిస్తున్నాయని, ఆమె స్వరం త్రివేణీ సంగమం- అని ప్రశంసించారు. అక్కడి వాళ్లు వీణను ‘ఆశా భోంస్లే ఆఫ్‌ రాజస్థాన్‌’ అంటారు.

పిల్లల్లో ప్రతిభ, నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడు పేదరికం అడ్డంకి కాకూడదని పేదపిల్లలకు ఉచితంగానే నేర్పిస్తోంది. 60 మంది దివ్యాంగులకు సంగీత నృత్యాల్లో శిక్షణ ఇవ్వమని ఒక ఎన్‌జీవో అడిగింది. అందుకామె సంతోషంగా ఒప్పుకుని ఉచితంగానే నేర్పిస్తోంది. వీళ్ల శరీర పరిస్థితి ఎలా ఉన్నా శక్తిసామర్థ్యాలు అపారమని, ఇలాంటి కళలు నేర్చుకుంటే వారు తమ బాధలన్నీ మర్చిపోతారని- అంటుంది.

వీణ వద్ద అభ్యసించిన నిఖిల్‌, ‘మునుపు నాకు డ్యాన్స్‌ బొత్తిగా రాదు, ఇప్పుడలా కాదు. మేమెంతో సాధించగలమన్న నమ్మకం కలుగుతోంది’ అంటే... ఆరేళ్లుగా పాటలు పాడుతున్న విక్రమ్‌, ‘మొదట్లో తప్పులు దొర్లేవి. కానీ వీణక్క ఇచ్చిన సలహాలూ సూచనలతో చాలా మెరుగయ్యాను. ఆమె స్థాయిలో గాయకుడు కావాలని ఉంది’ అంటాడు. కాజల్‌, ప్రియాంక, తరుణ్‌దేవేశ్‌ - ఇలా ఎవరిని కదిలించినా. వీణ ప్రతిభను వేనోళ్ల ప్రశంసిస్తుంటారు. వీణ పిల్లలకే పరిమితం కాలేదు. వృద్ధాశ్రమాల్లోనూ సంగీత కచేరీలు, నృత్య కార్యక్రమాలూ ఏర్పాటు చేస్తుంది.

సంగీతం జబ్బులను తగ్గిస్తుంది...

‘చాలామంది తమ సమస్యలను అధిగమించేందుకు సంగీతం, నృత్యం నేర్చుకోవాలని నా దగ్గరికి వస్తుంటారు. సంగీతం ఉల్లాసాన్నిస్తుంది. మనసులో ఉన్న గందరగోళాన్ని పోగొడుతుంది. దీనికి జబ్బులను నయం చేసే గుణమూ ఉంది. ఈ కళల్లో మునిగితే తమ వ్యాధుల గురించి మర్చిపోతారు కూడా. కనుకనే క్యాన్సర్‌ రోగులెందరో నా దగ్గరికి వస్తుంటారు’ అంటుందామె. లాక్‌డౌన్‌ కాలంలో వీణ ఆన్‌లైన్‌ క్లాసులూ నిర్వహించింది. ఆమె వద్ద నేర్చుకున్న విద్యార్థులెందరో ఒత్తిడి, భయం, ఒంటరితనాల నుంచి ఊరట పొందామని చెబుతుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని