మనమెందుకు వెనకబడ్డామో చెప్పారామె!

చిన్నప్పుడు పురావస్తు శాస్త్రం చదవాలనుకున్నారు.. కాస్త పెద్దయ్యాక బ్యాక్టీరియాలజీలో పట్టు తెచ్చుకోవాలనుకున్నారు. సమాజ మనుగడ ఆర్థిక అంశాలపైనే ఆధారపడి ఉంటుందని అర్థమయ్యాక ఆర్థికవేత్త అవ్వడాన్నే లక్ష్యంగా చేసుకున్నారు.

Updated : 10 Oct 2023 07:29 IST

చిన్నప్పుడు పురావస్తు శాస్త్రం చదవాలనుకున్నారు.. కాస్త పెద్దయ్యాక బ్యాక్టీరియాలజీలో పట్టు తెచ్చుకోవాలనుకున్నారు. సమాజ మనుగడ ఆర్థిక అంశాలపైనే ఆధారపడి ఉంటుందని అర్థమయ్యాక ఆర్థికవేత్త అవ్వడాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. స్త్రీ సాధికారత సాధ్యమవ్వాలంటే... దాని వెనకున్న చారిత్రక పరిణామాన్ని తెలుసుకోవాలనుకున్నారు. ఈ ప్రయత్నంతోనే అర్థశాస్త్ర చరిత్రకారిణిగా మారారు అమెరికాకు చెందిన క్లాడియా గోల్డిన్‌. ఈ రంగంలో చేసిన పరిశోధనకు గాను 2023 సంవత్సరానికి ఆమెను నోబెల్‌ వరించింది.

క్లాడియా గోల్డిన్‌ ప్రస్తుతం హార్వర్డ్‌ యూనివర్సిటీలో హెన్రీలీ ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. శతాబ్దాలుగా కార్మిక మార్కెట్‌లో మహిళల చారిత్రక, సమకాలీన పాత్రలపై సమగ్ర పరిశోధన చేసినందుకే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఈ రంగంలో అవార్డు అందుకున్న మూడో మహిళగానే కాకుండా 1989లో హార్వర్డ్‌ ఆర్థిక శాస్త్ర విభాగంలో పదవి పొందిన మొదటి మహిళగానూ గుర్తింపు పొందారీమె.

బ్యాక్టీరియాలజీ చదివి...

1946లో న్యూయార్క్‌ నగరంలోని ఓ యూదు కుటుంబంలో జన్మించారు క్లాడియా. చిన్నతనంలో పురావస్తు శాస్త్రవేత్త కావాలనుకున్నారు. కానీ, హైస్కూల్లో ఉన్నప్పుడు ‘ది మైక్రోబ్‌ హంటర్స్‌’ అనే పుస్తకం చదివాక బ్యాక్టీరియాలజీకి ఆకర్షితురాలయ్యారు. కార్నెల్‌ విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేషన్‌లో చేరారు. రెండో ఏడాదిలో ఉన్నప్పుడు ఓ రోజు ప్రముఖ ఆర్థిక వేత్త ఆల్ఫ్రెడ్‌ కాన్‌ పాఠం విన్నారట. అది మొదలు పారిశ్రామిక రంగం గురించి తెలుసుకోవాలనే కోరిక మొదలయ్యిందామెకు. దాంతో డిగ్రీ పూర్తవ్వగానే షికాగో యూనివర్సిటీలో ఇండస్ట్రియల్‌ ఆర్గనైజేషన్‌లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకున్నారు. పరిశోధన సాగుతోన్న సమయంలోనే ఓ రోజు నోబెల్‌ గ్రహీత గ్యారీ బెకర్‌ షికాగోకి వచ్చారు. ఆయన మాటలు విన్నాక క్లాడియాకి కార్మిక అర్థశాస్త్రంపై మనసు మళ్లింది. ఆపై యూఎస్‌ యాంటబెల్లమ్‌ నగరాల్లోని కార్మిక బానిసత్వంపైనా అధ్యయనం చేశారు. పీహెచ్‌డీ పట్టా అందుకున్నాక విస్కాన్సిన్‌-మాడిసన్‌ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా కెరియర్‌ ప్రారంభించారు. అది మొదలు ఐదు దశాబ్దాలుగా ఆర్థిక శాస్త్ర బోధనారంగంలో కొనసాగుతూనే ఉన్నారు.

తరాల జీవితం తెలుసుకోవాలని..

‘స్త్రీ సాధికారత మాటల్లోనే మిగిలిపోతోంది. శతాబ్దాలుగా శ్రామిక శక్తిలో మహిళల పాత్ర ఎంత కీలకమైనా పెద్దగా ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు సరికదా తక్కువగా అంచనా వేశారు. భవిష్యత్తు వారిది కావాలంటే మూలాలు వెతకాలనుకున్నా. అందుకోసమే ఈ రంగంపై దృష్టిపెట్టి...మహిళల ఆర్థిక స్థితిగతుల వెనక ఉన్న చారిత్రక పోకడల్ని అర్థం చేసుకోవాలనుకున్నా’ అని చెబుతారామె. ఇందుకు కారణమైన సామాజిక అంశాలెన్నో వెలుగులోకి తెచ్చారు. ఆర్థిక వ్యవస్థలో లింగ అసమానతల తీరుని తెలుసుకోవడానికి 200 సంవత్సరాల అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన డేటాను సేకరించారు. కొలంబియా యూనివర్సిటీలో 120 ఏళ్ల కాలంలో చదువుకున్న ఐదు తరాల మహిళల జీవితాలను తరచి చూశారు. వారి ఉద్యోగాలు, కెరియర్‌, కుటుంబాల మధ్య ఉన్న పోటీని తెలుసుకున్నారు. అంతేకాదు, కొవిడ్‌-19 మహిళల ఉత్పాదకత, ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపించిందో వెల్లడించారు. సంపాదనలో తేడాలు, ప్రమోషన్‌లు, పని-వ్యక్తిగత జీవితాల్లో సాంకేతికత పాత్ర, కెరియర్‌లో ఎదిగేందుకు వాడిన గర్భనిరోధక మాత్రల పాత్రతో సహా ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలను వెల్లడించారు. వీటి గురించి తన తాజా పుస్తకం కెరియర్‌ అండ్‌ ఫ్యామిలీ: విమెన్స్‌ సెంచరీ-లాంగ్‌ జర్నీ టువర్డ్‌ ఈక్విటీలో రాశారు. క్లాడియా తోటి హార్వర్డ్‌ ఆర్థికవేత్త లారెన్స్‌ ఎఫ్‌. కాట్జ్‌ను వివాహం చేసుకున్నారు.


నోబెల్‌.. మన ప్రస్థానం!

  • నోబెల్‌ది 122 ఏళ్ల చరిత్ర. 1901లో ఈ బహుమతుల ప్రధానం మొదలవ్వగా ఇప్పటివరకూ 65సార్లు మహిళలు దీన్ని అందుకున్నారు. మొత్తంగా ఈ శాతం 6 మాత్రమే! ఈ పురస్కారం గెలుచుకున్న తొలి మహిళ మరియా సలోమియా స్కోడోవ్స్కా క్యూరీ.మేరీ క్యూరీగా సుపరిచితురాలైన ఈవిడ రెండుసార్లు నోబెల్‌ గెలుచుకున్న తొలి, ఏకైక మహిళ కూడా. అదీ రెండు శాస్త్రీయ రంగాల్లో అందుకున్న ఏకైక వ్యక్తి. 1903లో ఫిజిక్స్‌లో, 1911లో కెమిస్ట్రీలో నోబెల్‌ గ్రహించారీమె.
  • శరీరధర్మశాస్త్రం లేదా మెడిసిన్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, లిటరేచర్‌, శాంతి, ఎకనామిక్‌ సైన్సెస్‌ కేటగిరీల్లో మహిళలు ఎక్కువగా నోబెల్‌ శాంతి బహుమతిని (19) గెలుచుకున్నారు. తర్వాతి స్థానం లిటరేచర్‌ది. దీన్ని 17 మంది అందుకున్నారు.
  • అత్యధిక సంఖ్యలో మహిళలకు నోబెల్‌ దక్కింది 2009లో! ఆ ఏడాది నాలుగు కేటగిరీల్లో అయిదుగురు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పటివరకూ అమెరికాకు చెందిన మహిళలు అత్యధికంగా 17 నోబెల్‌ పురస్కారాలు అందుకున్నారు.
  • నోబెల్‌ అందుకున్న అతి పిన్న వయస్కురాలు పాకిస్థాన్‌కి చెందిన మలాలా యూసఫ్‌ జాయ్‌. మహిళల్లో అతి పెద్ద వయసులో డోరిస్‌ లెస్సింగ్‌ నోబెల్‌ గెలుచుకున్నారు.
  • ఎకనామిక్స్‌లో నోబెల్‌ ఖాతా తెరవడానికి  మనకి ఏకంగా 108 ఏళ్లు పట్టింది. 2009లో ఎలినార్‌ అస్ట్రోమ్‌ ఈ ఘనత సాధించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్