అమ్మాయిలకు లెక్కలు రావని ఎవరన్నారు?

ఆదిత్య- ఎల్‌1, చంద్రయాన్‌-3... మహిళలు కీలకంగా ఉన్న ప్రయోగాలివి. అమ్మాయిలకు లెక్కలు రావు. సైన్స్‌ తెలియదు.. అన్నవాళ్లకి చెంపపెట్టులాంటి సమాధానం ఈ ప్రాజెక్ట్‌లు. అంతమాత్రాన మనమంతా సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ రంగాల్లో దూసుకుపోతున్నామా?

Updated : 05 Mar 2024 12:32 IST

అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా...

ఆదిత్య- ఎల్‌1, చంద్రయాన్‌-3... మహిళలు కీలకంగా ఉన్న ప్రయోగాలివి. అమ్మాయిలకు లెక్కలు రావు. సైన్స్‌ తెలియదు.. అన్నవాళ్లకి చెంపపెట్టులాంటి సమాధానం ఈ ప్రాజెక్ట్‌లు. అంతమాత్రాన మనమంతా సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ రంగాల్లో దూసుకుపోతున్నామా?

15 ఏళ్లకే పెళ్లి... ఇంకా ఆ పెళ్లి ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉండగానే బాలవితంతువు అయ్యిందామె. తీరని ఆ బాధ నుంచి బయటపడేందుకు ధైర్యం చేసి ఆ అమ్మాయి వేసిన అడుగే... మన దేశానికి తొలి మహిళా ఇంజినీర్‌ని అందించింది. ఆమె ఎవరో కాదు. మన తెలుగింటి ఆడపడుచు అయ్యలసోమయాజుల లలిత. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేసి దేశానికి ఆమె చేసిన సేవ తక్కువేం కాదు. ప్రతిష్ఠాత్మక బాక్రానంగల్‌ ప్రాజెక్ట్‌ డిజైన్‌లో ఆమె పాత్ర కీలకం. అలా 1944లో అమ్మాయిలు ఇంజినీరింగ్‌లో తొలిసారి అడుగుపెట్టిన నాటికీ... ఇప్పటికీ సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో వచ్చిన మార్పులని గమనిద్దాం.

ఇస్రో నుంచి ఆర్థిక సేవల వరకూ...

మొన్నటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో... చంద్రయాన్‌-3లో పాల్గొన్న ఎనిమిది మంది మహిళా శాస్త్రవేత్తలతో పాటు ఇస్రోలో పనిచేస్తున్న 220 మంది మహిళల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇస్రోలో సుదీర్ఘకాలం పనిచేసి పది ఉపగ్రహాలను రూపొందించి... ప్రస్తుతం ఓషన్‌శాట్‌కోసం పనిచేస్తున్న తేన్‌మొళి సెల్వి, కల్పనా కాళహస్తి వంటివారు ఈ బృందంలో ఉన్నారు. ఇది సైన్స్‌లో మహిళలు సాధించిన అభివృద్ధికి ఒక ఉదాహరణ. మరోపక్క... ఐఐటీ కాన్పూర్‌ విద్యార్థిని సోనమ్‌ శ్రీవాత్సవ స్థాపించిన రైట్‌ రిసెర్చ్‌ దేశంలోని బడా వ్యాపారులకు ఏఐ సాయంతో పెట్టుబడులను విశ్లేషణ చేస్తోంది. ఈ సంస్థని పాతికమంది అమ్మాయిలు నాయకత్వ హోదాల్లో ఉండి నడిపిస్తున్నారు. ‘అమ్మాయిలకి లెక్కలు రావు. ఇక వాళ్లకి పెట్టుబడుల గురించి ఏం తెలుస్తాయ్‌?’ అనే వారికి ఇదో జవాబు. రైట్‌ సంస్థ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్స్‌, టెక్నాలజీ రంగాల్లో సేవలు అందిస్తున్న ఫైసెర్వ్‌, నాట్‌వెస్ట్‌ గ్రూప్‌, వేఫెయిర్‌, ఇన్‌టూఇట్‌, జేపీమోర్గాన్‌ ఛేజ్‌లు తమ సంస్థల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. తమిళనాడులోని ఓలా ఎలక్ట్రికల్స్‌ 3,000 మంది మహిళలకు ఉద్యోగావకాశాలు ఇచ్చింది. మరో పదివేలమందికి ఇవ్వడానికి సిద్ధమవుతోంది. టాటామోటార్స్‌లో 6000 మంది మహిళా టెక్నీషియన్లు ఉన్నారు. ఈ సంస్థ పుణెలో ఆల్‌ విమెన్‌ టీమ్‌తో కార్లని తయారుచేస్తోంది. అమెజాన్‌ ఇండియా కూడా ఈ దిశగా అడుగులు వేసి మహిళా ప్రాధాన్యం పెంచుతోంది. మరైతే అంతా బాగానే ఉంది కదా! అమ్మాయిలకు ఈ రంగంలో ఎదురేలేదు అనుకొంటే పొరపాటు.

నాణేనికి మరోవైపు...

సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌లని కలిపి స్టెమ్‌ రంగాలని పిలుస్తున్నారు. 2023 గ్లోబల్‌ జెండర్‌ రిపోర్ట్‌ ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా స్టెమ్‌ రంగాల్లో అమ్మాయిలు సుమారుగా 29 శాతం ఉంటే, మన దేశంలో 14 శాతం మాత్రమే ఉన్నారు. ఈ వెనకబాటుకి కారణం అమ్మాయిలు స్టెమ్‌ రంగాల్లో రాణించలేరనే ఒక రకం సంప్రదాయ భావన. టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, లెక్కలు... ఇవి ఆడపిల్లల బుర్రలకు ఎక్కవులే అనే చిన్నచూపే ‘స్టెమ్‌ గ్యాప్‌’ అంతకంతకూ పెరగడానికి కారణం అయ్యింది. దాంతోపాటు ‘సివియర్‌ ఇంపోస్టర్‌ సిండ్రోమ్‌’ అనే సమస్య అమ్మాయిల్లోనే ఎక్కువట. అంటే ‘అమ్మో రిస్క్‌ నిర్ణయాలు నేను తీసుకోలేనేమో’ అనే భయంతో వెనక్కి తగ్గడం ఈ సమస్య లక్షణం. సవాళ్లని ప్రేమించడం మొదలుపెడితే ఆడవాళ్లూ ఐటీ, టెక్‌ రంగాల్లో దూసుకుపోవడం తేలికే అంటారు ఫైసెర్వ్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్న ఉమా రుద్రాన్‌. మన ఆలోచనల్లో మార్పు రావాలే కానీ రాకెట్‌ సైన్స్‌ కూడా తేలికే. అది నిరూపించడానికే 750 మంది గ్రామీణ బాలికలతో అజాదీశాట్‌ ఉపగ్రహాన్ని రూపొందించామని అంటారు స్పేస్‌ కిడ్జ్‌ ఏరోస్పేస్‌ స్టార్టప్‌ను నడుపుతున్న శ్రీమతి కేశన్‌.

ప్రపంచాన్ని ఏఐ శాసిస్తోంది. ప్రపంచ జనాభాలో సగం ఉన్న మనం... ఏఐ అభివృద్ధిలో లేకపోతే ఎలా అంటారు గ్లోబల్‌ చీఫ్‌ ప్రైవసీ, ఏఐ గవర్నెన్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఇవానా బార్టోలెట్టీ. ఈ దిశగా అమ్మాయిలను ప్రోత్సహించేందుకు మొదలైన అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజినీరింగ్‌ స్కాలర్‌షిప్స్‌ వంటి వాటివల్ల 2030 నాటికల్లా స్టెమ్‌ రంగాల్లో అమ్మాయిలు 30 శాతానికి పెరగొచ్చు అనేది మనం సంతోషించదగ్గ వార్త.


ప్రసూతి ప్రయోజనాల హక్కు

‘మెటర్నిటీ బెనిఫిట్‌ యాక్ట్‌-1961’... పదిమందికి మించి ఉద్యోగులున్న ప్రతి సంస్థలోనూ ఇది అమలవుతుంది. 2017 వరకూ పన్నెండు వారాల ప్రసూతి సెలవుల్ని తీసుకునే వీలుండేది. ఆ ఏడాది జరిగిన సవరణల అనంతరం అది 26 వారాలకు పెరిగింది. అంతేకాదు, ఏ సంస్థా గర్భిణిని ఉద్యోగం నుంచి ఉన్నపళంగా తీసేయకూడదు. అలా చేస్తే గరిష్ఠంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదు, పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు కూడా 12 వారాల ప్రసూతి సెలవులు పొందే వెసులుబాటు ఉంది.


ప్రస్తుతం మీ ముందున్న లక్ష్యంపైనే పూర్తి శ్రద్ధ ఉంచండి. అదే రేపటి మీ పచ్చని భవిష్యత్తుకి అంకురం వేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్