కొంతమంది మారినా సంతోషమే..!

సాధించాలనే తపన, పట్టుదల ఉండాలేగానీ వయసూ, బాధ్యతలూ ఏవీ అడ్డుకావని నిరూపిస్తున్నారు విశాఖకు చెందిన హర్షిత. అందుకే కష్టమని చాలామంది నిరాశపరిచినా, 14 ఏళ్ల తర్వాత ఎంబీఏ పూర్తిచేశారు.

Published : 10 Mar 2024 01:38 IST

సాధించాలనే తపన, పట్టుదల ఉండాలేగానీ వయసూ, బాధ్యతలూ ఏవీ అడ్డుకావని నిరూపిస్తున్నారు విశాఖకు చెందిన హర్షిత. అందుకే కష్టమని చాలామంది నిరాశపరిచినా, 14 ఏళ్ల తర్వాత ఎంబీఏ పూర్తిచేశారు. అంతేకాదు ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ సంస్థను ఏర్పాటుచేసి పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, మానసిక ఆరోగ్యం వంటి వాటిల్లో శిక్షణా ఇస్తున్నారు. ఆ ప్రయాణాన్ని మనతో పంచుకున్నారిలా...

డిగ్రీ పూర్తయిన వెంటనే నాకు పెళ్లయింది. మావారు విష్ణు లాల్‌చంద్‌. మాకు ఇద్దరమ్మాయిలు తుషిక, నైషా. పిల్లలు కొంచెం పెద్దయ్యాక, తిరిగి చదువుపై దృష్టి పెట్టాలనుకున్నా. అర్హత పరీక్ష రాస్తానంటే.. ‘ఈ వయసులో చదువేంటి?’ అన్న హేళనలు ఎదురయ్యాయి. అయినా ధైర్యం చేసి, కోచింగ్‌ సెంటర్‌కు వెళ్తే అక్కడా అదే అనుభవం. దీంతో నిరాశగా ఇంటికొచ్చేశా. అదే సమయంలో మా చిన్నమ్మాయి పరీక్ష ఉందని భయపడుతుంటే... నేను వెన్నుతట్టి ప్రిపరేషన్‌కు సహకరించా. పరీక్ష బాగా రాసొచ్చి, నాకు కృతజ్ఞతలు చెప్పింది. ‘నీపై నీకు నమ్మకముంటే ఏదైనా చేయగలవు’ అని నేను తనకు ధైర్యమిస్తే... విచిత్రంగా తనూ నాకు అదే సలహా ఇచ్చింది. అప్పుడు మరో కోచింగ్‌ సెంటర్‌లో చేరా. 2016లో ఐసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకొని, ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీఏలో చేరా. తర్వాత సైకాలజీలో ఎమ్మెస్సీ, వివిధ సర్టిఫికేషన్‌ కోర్సులూ పూర్తిచేశా.

ఎంబీఏ మొదటి ఏడాది కాలేజీలో ఓ కార్యక్రమంలో మాట్లాడే అవకాశమొచ్చింది. నాకు ఇచ్చిందేమో బోర్‌ సబ్జెక్టు. అయినా ఆసక్తికరంగా మాట్లాడటంతో అందరికీ బాగా నచ్చింది. దాంతో ఆ ఈవెంట్‌ కో- ఆర్డినేటర్‌ ఫ్యాకల్టీగా చేరమని అడిగారు. ‘నేను చదువుకుంటున్నా’ అని చెప్తే మోటివేషనల్‌ స్పీచ్‌లు ఇమ్మన్నారు. తర్వాత దాన్నే వృత్తిగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నా. 2020లో ఐఐఎం బెంగళూరులో విమెన్‌ స్టార్టప్‌ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యా. వారి సహకారంతో ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అనే అంకుర సంస్థను ఏర్పాటుచేశా. ఇప్పటివరకూ విశాఖ, హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా, భువనేశ్వర్‌ తదితర నగరాల్లో 10 వేల మందికిపైగా శిక్షణ ఇచ్చా. ఆన్‌లైన్‌ సెషన్లూ తీసుకుంటా. ఎల్‌అండ్‌టీ, ఆర్బీఐ, ఇండియన్‌ ఆయిల్‌, ఐఐఎంవీ, జేడబ్ల్యూఎస్‌ తదితర సంస్థలు, పాఠశాలలు, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తరగతులు నిర్వహించా. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ అమ్మాయి మా శిక్షణ ద్వారా ఆ ఆలోచనల నుంచి బయటపడింది. ఉద్యోగం, భవిష్యత్తు గురించి భయపడే విద్యార్థులకు కళాశాలల్లో ‘కార్పొరేట్‌ రెడీనెస్‌’ పేరిట అయిదు రోజుల శిక్షణ ఇస్తున్నా. మోటివేషనల్‌ స్పీచ్‌తోపాటు ఎమోషనల్‌, పర్సనల్‌ డెవలప్‌మెంట్‌, నాయకత్వం, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తా. మా వల్ల ఆత్మవిశ్వాసం పెరిగిందని, మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిందని విద్యార్థులు అంటోంటే చాలా సంతోషంగానూ, గర్వంగానూ అనిపిస్తుంది. వారికి నా అనుభవాలనే ఉదాహరణగా చెబుతుంటా. మా పెద్దమ్మాయి మెంటల్‌ స్పేస్‌ సైకాలజీలో డిప్లొమా పూర్తి చేసింది. సంస్థ కోఫౌండర్‌ కూడా. మా ద్వారా కొంత మందిలో మార్పు వచ్చినా సంతోషమే.

కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, విశాఖపట్నం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్