నగలు తాకట్టు పెట్టి శిక్షణ...

అమ్మాయిలు ఫుట్‌బాల్‌ క్రీడల్లో రాణించడమే అరుదు. అలాంటిది గిరిజా కుమారి ఏకంగా కోచ్‌గా మారి, సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడే పిల్లలకి శిక్షణనిస్తోంది.. వాళ్లని విజయాలవైపు నడిపిస్తోంది.

Published : 14 Mar 2024 01:13 IST

అమ్మాయిలు ఫుట్‌బాల్‌ క్రీడల్లో రాణించడమే అరుదు. అలాంటిది గిరిజా కుమారి ఏకంగా కోచ్‌గా మారి, సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడే పిల్లలకి శిక్షణనిస్తోంది.. వాళ్లని విజయాలవైపు నడిపిస్తోంది. ఆమె కథ ఏంటో తెలుసుకుందాం..

గిరిజ స్వస్థలం కేరళలోని అలప్పుజ. చిన్నతనం నుంచి ఫుట్‌బాల్‌ అంటే ఇష్టం. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా దానిని కొనసాగించలేకపోయింది. రెండేళ్ల పాటు నర్స్‌గా చేసి, పెళ్లయ్యాక భర్తతో కలిసి టైలరింగ్‌ షాపూ నిర్వహించేది. ఆటపై ఉన్న మక్కువతో తన ఇద్దరి కుమారుల్లో ఒకరిని ఫుట్‌బాల్‌ అకాడెమీలో చేర్పించింది. అక్కడ తను కూడా కొడుకుతో ఆడేది. ఒకసారి అక్కడుండే కోచ్‌ మానేయడంతో తనే కోచ్‌ కావాలని నిర్ణయించుకుంది. ఓ అకాడెమీలో చేరి సర్టిఫికెట్‌నూ అందుకుంది. తన శిక్షణతో ఏటా 500 మంది గ్రామీణ పిల్లలకు ఫుట్‌బాల్‌ శిక్షణ ఇచ్చేది. అలా వారిలో చాలామంది రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ఎంపికై పతకాలు సాధించారు.

వారి కోసమే చేయాలని...

ఓరోజు అక్కడ సెరిబ్రల్‌ పాల్సీ(సీపీ) అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు నేతృత్వం వహిస్తున్న కవితా సురేష్‌ను కలుసుకుంది. అక్కడ సీపీతో బాధపడుతున్న పిల్లలను చూసి గిరిజ వాళ్లకి తన వంతు సాయంగా ఫుట్‌బాల్‌ నేర్పించాలి అనుకుంది. ‘నిజం చెప్పాలంటే సీపీ ఉన్న వారిలో కండరాల పనితీరు బలహీనంగా ఉంటుంది. వారు ఫుట్‌బాల్‌ ఆడటం కష్టమే. అయినా వాళ్లకి నేర్పించాలనుకున్నా. డాక్టర్ల సలహాలు తీసుకుని శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టా. వారికి శారీరక శ్రమతో పాటు పౌష్టికాహారం కూడా అందించేవాళ్లం’ అంటోంది గిరిజ. కేరళలో ఆ పిల్లల కోసం ప్రత్యేకంగా ‘సెరిబ్రల్‌ పాల్సీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌’ను ఏర్పాటు చేసి, అందులో శిక్షణ ఇస్తోంది గిరిజ. అలా దాదాపు 250 మంది పిల్లలను ఖేలో ఇండియా పారా గేమ్స్‌, ఐదు జాతీయ స్థాయి పోటీలకు చేరుకునేలా చేశారు. వారి సౌకర్యాల కోసం తన బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ సంస్థను నడిపిస్తోందామె. ‘సెరిబ్రల్‌్ పాల్సీ పిల్లలు అంటేనే ఇష్టపడని వ్యక్తులు ఉంటారు. నేను కోచ్‌గా కాకుండా తల్లిగా ఆలోచించి వారిని ముందుకు నడిపించాలి అనుకున్నా. ఎవరిలోనైనా నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉంటే, ఎలాంటి వైకల్యమూ విజయానికి అడ్డు రాదు’ అంటోంది గిరిజ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్