ఒక్క కాల్‌... ప్రాణం నిలబెడుతుంది!

రాత్రి 2.30 గంటల సమయంలో వచ్చిందా కాల్‌... ‘మేడమ్‌.. నేనిప్పుడు ట్యాంక్‌బండ్‌ మీదున్నా, దూకేస్తున్నా. చివరిగా మీరిచ్చిన ఫోన్‌ నంబర్‌కి కాల్‌ చేయాలనిపించి చేస్తున్నా!’ ఆ తర్వాత అతను ఏమయ్యాడు? అసలెందుకు చనిపోవాలనుకున్నాడు.

Updated : 14 Mar 2024 07:21 IST

హెల్ప్‌లైన్‌ నంబర్‌ 7893078930

రాత్రి 2.30 గంటల సమయంలో వచ్చిందా కాల్‌... ‘మేడమ్‌.. నేనిప్పుడు ట్యాంక్‌బండ్‌ మీదున్నా, దూకేస్తున్నా. చివరిగా మీరిచ్చిన ఫోన్‌ నంబర్‌కి కాల్‌ చేయాలనిపించి చేస్తున్నా!’ ఆ తర్వాత అతను ఏమయ్యాడు? అసలెందుకు చనిపోవాలనుకున్నాడు. ‘నేనొక అబ్బాయిని ఇష్టపడ్డాను. శారీరకంగానూ దగ్గరయ్యాం.. నేను ప్రెగ్నెంట్‌. ఇంట్లో వాళ్లకి ఆ విషయం చెప్పలేక నిద్రమాత్రలు మింగేశా...’ కాల్‌ కట్‌!  ఇప్పుడు ఆ అమ్మాయి బతికి ఉందా? ఆ విషయాలు తెలుసుకోవాలంటే వన్‌ లైఫ్‌ మహిళా వాలంటీర్లని అడగాల్సిందే... 

‘వన్‌ లైఫ్... ఆత్మహత్య ఆలోచనల్ని అడ్డుకొనే హెల్ప్‌లైన్‌ ఇది. కుంగుబాటు, ఆత్మహత్య ఆలోచనలతో బాధపడేవారిలో ధైర్యం నింపుతూ తిరిగి వారిలో సానుకూల ఆలోచనలు పెంచుతున్న ఈ సంస్థ హైదరాబాద్‌ కేంద్రంగా... దేశవ్యాప్తంగా సేవలందిస్తోంది. ఏడాదికి పద్దెనిమిది వేలమందిని ఆత్మహత్య ఆలోచనల నుంచి దూరం చేస్తోంది. 2014లో హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సంస్థలో 140 మంది వాలంటీర్లుంటే, వారిలో 80 మంది మహిళలే కావడం విశేషం. వీళ్లలో డాక్టర్లు, సైకాలజిస్టులు, చైల్డ్‌ థెరపిస్టులు, టీచర్లు, కళాకారులు, గృహిణులు, యోగా నిపుణులు ఇలా వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నారు.

అలా పరిష్కరించాం...

‘రాత్రి రెండున్నరకి ఒకాయన మా హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేసి నేను ట్యాంక్‌ బండ్‌ మీదున్నా, దూకేస్తున్నా అన్నాడు. కారణం ఏంటి అని అడిగితే... ‘తెలుసుకుని ఏం చేస్తారు? మీరు పరిష్కరించగలరా?’ అంటూ ఎదురు ప్రశ్న! సరే ముందు మీరు ఆ రెయిలింగ్‌ దిగి బయటకు రండి అని అతన్ని ఒప్పించాం. కాసేపటికి మనసు మార్చుకుని, ఆత్మహత్య ఆలోచన వాయిదా వేసుకున్నాడు. తర్వాత రోజు మా వాలంటీరు అతన్ని కలిశాడు. ఆరాతీస్తే.. అతనికి ఏ ఆర్థిక ఇబ్బందులూ లేవు. రూ.లక్షన్నర జీతం. సమస్యల్లా ఆఫీసు నుంచి రాగానే ఇంట్లో అత్తాకోడళ్లు ఒకళ్లపై ఒకరు చెప్పుకొనే చాడీలతో విసిగిపోయాడట. దాంతో కుటుంబం మొత్తానికి కౌన్సెలింగ్‌ ఇస్తే నెమ్మదిగా సమస్య పరిష్కారం అయ్యింది. ఇప్పుడు అంతా కలిసి సంతోషంగా ఉంటున్నారు. అలాగే... ఓ రోజు నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏడుస్తూ ఒక అమ్మాయి కనిపించింది. మా వాలంటీర్‌ ఆరాతీస్తే ‘ఇల్లు వదిలి వచ్చేశా. చావు తప్ప మరో దారి లేద’ంది. విషయం అడిగితే... కొత్తగా పెళ్లయ్యిందట. ఆ అమ్మాయి భర్తకు చెప్పకుండా 2000 రూపాయల చెప్పులు కొందట. అంత ఖరీదైనవి ఎలా కొంటావ్‌ అని ఆయన.. ఇప్పుడే ఇన్ని లెక్కలైతే జీవితమంతా ఎలా అని ఆమె. దానికే చనిపోవాలనుకుంది. అప్పుడు మా వాలంటీర్‌ ‘నువ్వు చనిపోవడమే దీనికి పరిష్కారమా? ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసిన మీ అమ్మానాన్నలు ఎంత బాధపడతారు? చుట్టుపక్కల వాళ్లు నీ జీవితంపై లేనిపోని కథలల్లుతూ కొన్నిరోజులు కాలక్షేపం చేస్తారు. ఇదేనా నువ్వు కోరుకుంది అంటూ నచ్చచెప్పి ఆ అమ్మాయిని భర్త దగ్గరకు పంపారు..’ ఇలా తమకెదురైన కొన్ని అనుభవాలని వివరించారు ఈ సంస్థ ఫౌండర్స్‌లో ఒకరైన కళా జయలక్ష్మి. నిజానికి ఈ సేవా ఆలోచనకి కారణం... జయలక్ష్మి అత్తగారి మరణమే. ఆమె ఓ యాక్సిడెంట్‌లో చనిపోయినప్పుడు భర్త, కొడుకు కలిసి ఆవిడ జ్ఞాపకంగా అవసరంలో ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు అందించేవారు. ఆ క్రమంలోనే వన్‌లైఫ్‌ ప్రాణం పోసుకుంది.

మీరూ ఒక ప్రాణాన్ని బతికించొచ్చు... 

‘ఒక్కసారి ఆత్మహత్య ఆలోచనని దూరం చేశామా... మళ్లీ అంత త్వరగా రాదు. ఒక అమ్మాయి రాత్రి పదకొండుకి బంజారాహిల్స్‌ నుంచి కాల్‌ చేసింది. మాట ముద్దగా ఉంది. తనో అబ్బాయిని ప్రేమించాననీ, శారీరకంగా దగ్గరయ్యామనీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారనీ చెప్పింది. స్నేహితులతో పంచుకుంటే ఎక్కడ తనని జడ్జ్‌ చేస్తారో అన్న భయంతో, అమ్మానాన్నల్లేని సమయం చూసి నిద్రమాత్రలు మింగేసిందట. పక్కింటివాళ్ల నంబర్‌ సంపాదించి ఆటో అతని సాయంతో ఆమెను ఆసుపత్రికి చేర్చి, బతికించాం. వాళ్ల తల్లిదండ్రులకీ కౌన్సెలింగ్‌ ఇచ్చాం. ఇప్పుడామె పెద్ద డాక్టర్‌..’అంటారు వన్‌లైఫ్‌ సంస్థలో కౌనెల్సింగ్‌ సైకాలజిస్ట్‌, వాలంటీర్లకి మెంటర్‌గా సేవలందిస్తున్న రెబెక్కా మారియా. మరోపక్క ఆమె షీటీమ్స్‌తోనూ కలిసి పనిచేస్తున్నారు. మొత్తం పదహారు భాషల్లో వన్‌లైఫ్‌ వాలంటీర్లు సేవలందిస్తున్నారు. ‘మహిళలకి ఓపిగ్గా సమస్యల్ని వినే శక్తి ఉంది. ఒక్క ఓదార్పు మాట చాలు ఒక ప్రాణాన్ని కాపాడటానికి. ఆసక్తి ఉన్నవారు మా వాలంటీర్‌గా చేరొచ్చు. రోజులో తీరిక ఉన్నప్పుడు రెండు గంటల సమయాన్ని కేటాయిస్తే చాలు. మేం వారికి వాలంటీర్‌గా శిక్షణ ఇస్తాం. వారాంతాల్లో, సెలవుల్లో... డిప్రెషన్‌, నెగెటివ్‌ ఆలోచనలతో సతమతమయ్యేవారి కాల్స్‌ మాకు ఎక్కువగా వస్తుంటాయి. మానసిక సమస్యలతో బాధపడేవారి సంఖ్యా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా వాలంటీర్ల సంఖ్యని పెంచాలన్నది మా లక్ష్యం. ఆసక్తి ఉన్నవారు ఫండింగ్‌నీ అందించవచ్చు అంటున్నారు’ సంస్థ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న శిరీష.


తొలి మహిళ...

ఆరతీ సాహా... 1959లో ఇంగ్లీష్‌ చానల్‌ను ఫ్రాన్స్‌ నుంచి ఇంగ్లాండ్‌కు కేవలం 16గంటల ఇరవై నిమిషాల్లోనే ఈది, ఆ ఘనత సాధించిన తొలి ఆసియన్‌ మహిళగా రికార్డులకెక్కారు. 1960లో దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని పొంది, ఆ గౌరవం అందుకున్న తొలి స్పోర్ట్స్‌ ఉమెన్‌గానూ పేరొందారు. సాహా గౌరవార్థం 1999లో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ స్టాంప్‌ను విడుదలచేస్తే, గూగుల్‌ సంస్థ ఈమె 80వ పుట్టిన రోజు సందర్భంగా గూగుల్‌ డూడుల్‌నే క్రియేట్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్