బావకి.. బాధ్యత లేదా?

మా అక్కది ప్రేమ వివాహం. అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుంచీ తన కొడుకు బాధ్యత మా అమ్మానాన్నలదే.

Updated : 02 Jan 2024 13:00 IST

మా అక్కది ప్రేమ వివాహం. అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుంచీ తన కొడుకు బాధ్యత మా అమ్మానాన్నలదే. ఇప్పుడు బాబుకు ఐదేళ్లు. బావ మరో పెళ్లి చేసుకున్నాడు. తండ్రి ఆస్తిలో కొడుక్కి వాటా ఇవ్వమని పెద్దమనుషులతో మాట్లాడించినా ఫలితం లేదు. కోర్టులో కేసు వేస్తే తీర్పు మాకు అనుకూలంగా వస్తుందా?

ఓ సోదరి

మీ అక్కది ప్రేమ వివాహమైనా హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిందా? మీ బావగారి ఆస్తి ఆయన సొంతంగా సంపాదించిందా లేక పిత్రార్జితమా అన్న వివరాలు తెలియాలి. అప్పుడే కోర్టులో కేసు వేస్తే మీరు గెలుస్తారో లేదో చెప్పగలం. కన్న బిడ్డలకు సహజ సంరక్షకుడు తండ్రి. వారికి మెయింటెనెన్స్‌ ఇవ్వాల్సిన బాధ్యత అతడికి ఉంటుంది. మీ అక్క బలవంతపు మరణానికి మీ బావే బాధ్యుడని కేసు పెట్టలేదా? ఆత్మహత్య చేసుకునేలా ఆమెను ప్రేరేపించినందుకు ఐపీసీ సెక్షన్‌-306 ప్రకారం అత్తింటి వారిపైన క్రిమినల్‌ కేసు పెట్టి ఉంటారు కదా! దాన్నుంచి మీ బావ బయటకు వచ్చారా? ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా సరే, హిందూ అడాప్షన్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌ ప్రకారం మేజర్‌ అయ్యేవరకూ కొడుకును పోషించాల్సిన బాధ్యత అతనిదే. అయితే, ఈ చట్టంలోని సెక్షన్‌-23 ప్రకారం ఆ వ్యక్తికి సంపాదించే సామర్థ్యం ఎంత? ఆస్తులెన్ని ఉన్నాయి? వంటివన్నీ పరిగణనలోకి తీసుకుని ఆ మొత్తాన్ని నిర్ణయిస్తారు. అందులో పిల్లాడి చదువుకి అయ్యే ఖర్చులు కూడా ఉంటాయి. అమ్మమ్మ, తాతయ్యలకు ఆ బాబుని చూడాల్సిన బాధ్యత లేకపోయినా చూస్తున్నారు. కాబట్టి వాళ్ల ఆస్తులను పరిగణనలోకి తీసుకోరు. ఇక, గృహహింస చట్టంలోని సెక్షన్‌-22 కింద ఆ అబ్బాయికి పరిహారం ఇప్పించమని అడగొచ్చు. అలానే సీఆర్‌పీసీలోని సెక్షన్‌-125 ప్రకారం నెలకు ఇంత అని మెయింటెనెన్స్‌ ఖర్చులు తీసుకోవచ్చు. అయితే, నిజానికి ఇవన్నీ ఆ తండ్రికి తెలియాల్సిన బాధ్యతలు. లాయర్‌ని సంప్రదించి ముందడుగు వేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్