గుడ్డు పెంకులు సులభంగా రావాలంటే..!

పూర్తిగా ఉడికిందో లేదోనని మరో ఐదు పది నిమిషాల పాటు గుడ్డును అలాగే ఉడికించడం మనలో చాలామందికి అలవాటు! అయితే ఇలా మరీ ఎక్కువ సేపు ఉడికించినా దానిపై పెంకుల్ని తొలగించడం కష్టమే.

Published : 23 Sep 2023 19:53 IST

పూర్తిగా ఉడికిందో లేదోనని మరో ఐదు పది నిమిషాల పాటు గుడ్డును అలాగే ఉడికించడం మనలో చాలామందికి అలవాటు! అయితే ఇలా మరీ ఎక్కువ సేపు ఉడికించినా దానిపై పెంకుల్ని తొలగించడం కష్టమే! అలాంటప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.

ఉడికించిన గుడ్డును చాపింగ్‌ బోర్డుపై ఉంచి అరచేత్తో గుడ్రంగా దొర్లించాలి. ఇలా కాసేపు చేస్తే దాని పెంకులు సులువుగా వచ్చేస్తాయి.

వేడివేడిగా ఉండే గుడ్లపై పెంకులు తొలగించలేం. అలాంటప్పుడు వాటిని చల్లటి నీళ్లలో వేసి గాలి చొరబడకుండా మూత పెట్టేయాలి. ఇప్పుడు ఈ గిన్నెను రెండు చేతులతో పట్టుకొని కలియబెట్టినట్లుగా కాసేపు తిప్పాలి. తద్వారా గుడ్లు త్వరగా చల్లబడడంతో పాటు వాటి పెంకులు కూడా సులభంగా వచ్చేస్తాయి.

గుడ్లను ఉడికించే నీటిలో చిటికెడు బేకింగ్‌ సోడా వేసినా ఫలితం ఉంటుంది.

ఒక్కోసారి గుడ్డుపై పెంకులు తొలగించే క్రమంలో తెలుపు రంగు లేయర్‌ ఒకటి దానికే అంటుకుపోతుంది. అలా జరగకుండా పెంకులతో పాటు అదీ సులభంగా తొలగించాలంటే.. ఉడికించిన గుడ్లను నేరుగా కుళాయి నుంచి వచ్చే నీళ్ల కింద ఉంచి పొట్టు తొలగిస్తే సరి!

ఒక గ్లాస్‌లో నీళ్లు తీసుకొని అందులో ఉడికించిన గుడ్డు వేసి షేక్‌ చేయాలి. తద్వారా దాని పెంకులు సులభంగా ఊడొస్తాయి.

గుడ్డును నీళ్లలో ఉడికించడం కంటే ఆవిరిపై ఉడికించడం వల్ల దాని పెంకులు మరింత సులభంగా వచ్చేస్తాయట! అయితే ఇక్కడా ఉడికించే సమయానికి ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. అంటే.. కాస్త మృదువుగా కావాలనుకునే వారు 6-8 నిమిషాలు, ఇంకాస్త ఎక్కువగా ఉడికించుకోవాలనుకునే వారు 10-12 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది.

తాజా గుడ్డు కంటే కొన్ని రోజుల వయసున్న గుడ్డుపై పెంకుల్ని తొలగించడం సులువంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. తాజా గుడ్డులో పీహెచ్‌ స్థాయులు తక్కువగా ఉండడం వల్ల ఆమ్లత్వం కలిగి ఉంటుంది. తద్వారా గుడ్డులోని తెల్లసొనకు, పెంకుకు మధ్య బంధం దృఢంగా ఉంటుంది. అదే రోజులు గడిచే కొద్దీ పీహెచ్‌ స్థాయులు పెరిగి తెల్లసొన, పెంకు మధ్య దృఢత్వం తగ్గిపోతూ ఉంటుంది. ఫలితంగా ఉడికించినప్పుడు పెంకులు సులభంగా వచ్చేస్తాయట! అలాగని మరీ ఎక్కువ రోజుల వయసున్న గుడ్డు తినడం కూడా మంచిది కాదన్న విషయం దృష్టిలో పెట్టుకోండి.

ఇక ప్రస్తుతం వివిధ రకాల ఎగ్‌ పీలింగ్‌ గ్యాడ్జెట్స్‌ కూడా మార్కెట్లో అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. వీలుంటే వాటిని సైతం కొనుగోలు చేయచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్