Gully Girl: ‘మేరా టైమ్‌ ఆయేగా’ అంటూ..!

మీరు ‘గల్లీ బాయ్‌’ సినిమా చూశారా? మురికివాడలో పుట్టిపెరిగిన ఓ కుర్రాడు ర్యాపర్‌గా రాణించాలని ఆశపడతాడు. ఎవరేమన్నా, చుట్టూ ఉన్న వాళ్లు నిరుత్సాహపరిచినా తన లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టడు. ఆఖరికి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అనుకున్నది సాధిస్తాడు. ముంబయిలోని ఓ మురికి వాడకు చెందిన సానియా మిస్త్రీ జీవితం కూడా అచ్చం ఇదే సినిమాను పోలి ఉంటుంది.

Updated : 08 Dec 2022 16:55 IST

(Photo: Instagram)

మీరు ‘గల్లీ బాయ్‌’ సినిమా చూశారా? మురికివాడలో పుట్టిపెరిగిన ఓ కుర్రాడు ర్యాపర్‌గా రాణించాలని ఆశపడతాడు. ఎవరేమన్నా, చుట్టూ ఉన్న వాళ్లు నిరుత్సాహపరిచినా తన లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టడు. ఆఖరికి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అనుకున్నది సాధిస్తాడు. ముంబయిలోని ఓ మురికి వాడకు చెందిన సానియా మిస్త్రీ జీవితం కూడా అచ్చం ఇదే సినిమాను పోలి ఉంటుంది. ఆమెకూ ర్యాప్‌ మ్యూజిక్‌ అంటే ప్రాణం. తన చుట్టూ అలుముకున్న పేదరికాన్ని, కష్టాలనే బాణీలుగా చేసుకొని ర్యాప్‌ పాటలు పాడుతోన్న ఆమె.. ప్రస్తుతం సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. ఇలా తన ప్రతిభతో పేదరికాన్ని జయించి తనను తాను నిరూపించుకుంటోన్న ఈ ‘గల్లీ గర్ల్‌’ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

సానియా మిస్త్రీ.. ముంబయిలోని గోవండీ మురికి వాడలో నివసిస్తుంటుంది. ఆమె తండ్రి రిక్షా డ్రైవర్‌. తల్లి ఇంటింటికీ తిరుగుతూ పాచి పనులు చేస్తుంటుంది. ప్రస్తుతం అక్కడి అంబేద్కర్‌ కళాశాలలో 11వ తరగతి చదువుతోన్న ఈ 15 ఏళ్ల అమ్మాయి చదువులో చాలా చురుగ్గా ఉంటుంది. అంతేకాదు.. సృజనాత్మకంగా ఆలోచించడంలోనూ ఆమె దిట్టే!

ఫ్రెండ్‌ సహకారంతో..!

ముందు నుంచీ ర్యాప్‌ సంగీతమంటే ఇష్టపడే ఆమె.. భవిష్యత్తులో ఓ గొప్ప ర్యాపర్‌ కావాలని కలలు కంది. అయితే నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆమెకు ఇది అందని ద్రాక్షే అని చెప్పాలి. కానీ ‘ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ ఉండద’న్న సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందడుగు వేసింది సానియా. ఈ క్రమంలోనే మూడేళ్లుగా ర్యాప్‌ సంగీతాన్ని సాధన చేస్తోన్న ఆమె.. తన ఫ్రెండ్‌ సహకారంతోనే తొలి ర్యాప్‌ వీడియోను రూపొందించానంటోంది.

‘నేను గత మూడేళ్లుగా ర్యాప్‌ సంగీతాన్ని సాధన చేస్తున్నా. తొలుత నా ఫ్రెండ్‌ నాకు కొన్ని లిరిక్స్‌ చూపించింది. వాటిని చదివి ర్యాప్‌ చేయడం ప్రారంభించా. అయితే ఈ పాటల్ని వీడియో రికార్డ్‌ చేయడానికి కనీసం నా వద్ద మొబైల్‌ కూడా లేదు. ఈ క్రమంలో నా స్నేహితులే నాకు సహకరిస్తుంటారు.. నేను పాడుతుంటే వాళ్లే మొబైల్స్‌లో వాటిని చిత్రీకరిస్తుంటారు. ఆ తర్వాత వాళ్ల ఫోన్ల సహాయంతోనే వాటిని ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లలో అప్‌లోడ్‌ చేస్తున్నా..’ అంటోందీ యంగ్‌ సెన్సేషన్.

అమ్మ అర్థం చేసుకుంది!

తాను ఎదుర్కొంటోన్న పేదరికం, చుట్టూ ఉన్న సమస్యలు, ప్రజల ఇక్కట్లను బాణీలుగా చేసుకొని ర్యాప్‌ పాటలు పాడుతూ.. వీడియోలు రూపొందిస్తోంది సానియా.

‘నా తల్లిదండ్రులకు ఈ ర్యాప్‌ సంగీతం గురించి అస్సలు తెలియదు. కాబట్టి నేనే దీని గురించి వారికి వివరించి.. ఈ మ్యూజిక్‌పై నాకున్న ఇష్టాన్ని తెలియజేశా. అయితే నా నిర్ణయాన్ని ఈ సమాజం ఒప్పుకుంటుందా అని ముందు అమ్మ ఒకటికి రెండుసార్లు ఆలోచించింది. కానీ నా ప్రతిభను, మక్కువను చూశాక నన్ను ఈ దిశగా ప్రోత్సహించడం మొదలుపెట్టింది. అయితే తొలిసారి నేనిచ్చిన స్టేజ్‌ ప్రదర్శన చూశాక తనకు నాపై పూర్తి నమ్మకం కలిగింది.. చాలా సంతోషించింది.. ఇక నాకు భవిష్యత్తులో పెద్ద ర్యాపర్‌ కావాలని ఉంది.. నా కలలు పెద్దవే కావచ్చు. కానీ వాటిని నెరవేర్చుకునే అవకాశం, శక్తి ఆ భగవంతుడు నాకు ప్రసాదిస్తాడన్న నమ్మకం నాకుంది..’ అంటోందీ గల్లీ గర్ల్.

ఈ క్రమంలో సోలోగానే కాదు.. తన ఫ్రెండ్స్‌తో బృందంగా ఏర్పడి.. స్టేజ్‌ షోలు కూడా ఇస్తుంటుంది సానియా. ఇక వీళ్ల వద్ద ఎలాంటి సంగీత వాయిద్య పరికరాలు లేకపోయినా నోటితోనే హమ్మింగ్‌ చేస్తూ ఎంతోమంది యువతను ఆకట్టుకుంటున్నారీ గల్లీ గయ్స్.

ప్రస్తుతం ‘Sania_MQ’ పేరుతో ఇన్‌స్టా పేజీ, యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తోన్న సానియా.. తన ర్యాప్‌ పాటల్ని వీటిలో పోస్ట్‌ చేస్తుంటుంది. ఈ యువ ర్యాపర్‌ను ఇన్‌స్టాలో 1,737 మంది ఫాలో అవుతుండగా, యూట్యూబ్‌లో ఆమెకు 4 వేల మందికి పైగా సబ్‌స్క్రైబర్లున్నారు. తన ప్రతిభను గుర్తించిన పలు స్వచ్ఛంద సంస్థలు.. ప్రస్తుతం వాటి తరఫున పలు కార్యక్రమాల్లో ర్యాప్‌ సాంగ్స్‌ పాడే అవకాశాన్ని సానియాకు అందించి ఆమెను ప్రోత్సహిస్తున్నాయి.

భవిష్యత్తులో ‘మేరా టైమ్‌ ఆయేగా’ అని ధీమా వ్యక్తం చేస్తోన్న ఈ యంగ్‌ సెన్సేషన్ ఆశ, ఆశయం నెరవేరాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం..!

ఆల్‌ ది బెస్ట్‌ సానియా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్