కొలీగ్స్‌తో ఫ్రెండ్లీగా ఉంటున్నారా?

మనం ఇంట్లో ఎంత సమయం గడుపుతామో..ఆఫీస్‌లోనూ దాదాపు అంతే సమయం వెచ్చిస్తుంటాం. కార్యాలయంలో మనం గడిపే 8-10 గంటల సమయంలో సహోద్యోగులు, మన బృంద సభ్యులతో ఎంత స్నేహంగా ఉంటే.. అంత ఉత్సాహంగా పనులు పూర్తిచేసుకోవచ్చని, పైగా ఆఫీసుకు వెళ్లాలన్న ఉత్సాహం కూడా పెరుగుతుందంటున్నారు నిపుణులు....

Published : 14 Aug 2023 18:13 IST

ఇంట్లో కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని పెంచుకున్నప్పుడే హ్యాపీగా, అరమరికల్లేకుండా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించచ్చు. ఈ సూత్రం ఆఫీస్‌కీ వర్తిస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే రోజులో మనం ఇంట్లో ఎంత సమయం గడుపుతామో..ఆఫీస్‌లోనూ దాదాపు అంతే సమయం వెచ్చిస్తుంటాం. కార్యాలయంలో మనం గడిపే 8-10 గంటల సమయంలో సహోద్యోగులు, మన బృంద సభ్యులతో ఎంత స్నేహంగా ఉంటే.. అంత ఉత్సాహంగా పనులు పూర్తిచేసుకోవచ్చని, పైగా ఆఫీసుకు వెళ్లాలన్న ఉత్సాహం కూడా పెరుగుతుందంటున్నారు. ఇది చక్కటి ఉత్పాదకత రూపంలో అటు సంస్థకూ మేలు చేస్తుంది.. ఇటు కెరీర్‌ పరంగా మీ అభివృద్ధికీ దోహదం చేస్తుంది. మరి, కొలీగ్స్‌తో అనుబంధం పెంచుకోవడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం రండి..

సృజనాత్మకత పెరుగుతుంది!
మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత చురుగ్గా పనిచేస్తుంది. ఇలాంటప్పుడే కొత్త కొత్త ఆలోచనలొస్తుంటాయి. ఇలాంటి క్రియేటివిటీ మనం చేసే పనికి అవసరం! కాబట్టి మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే బృంద సభ్యులతో స్నేహంగా మెలగాలి. వాళ్లతో కలిసిపోవడం, కలుపుగోలుగా మాట్లాడడం వల్ల.. వాళ్ల మనసులో ఉన్న ఆలోచనలు కూడా అంతే ఫ్రీగా పంచుకోగలుగుతారు. దీనివల్ల మన మనసులో మరిన్ని కొత్త ఆలోచనలు పుట్టుకు రావచ్చు. వీటిని ఆచరణలో పెడితే మనలోని నైపుణ్యాలు, ప్రత్యేకతలతో.. ఉత్పాదకతను మరింత పెంచుకోగలుగుతాం. ఇది అంతిమంగా మన కెరీర్‌ అభ్యున్నతికి దోహదం చేస్తుంది.

పోటీ ఉండాలి.. కానీ!
కొలీగ్స్‌తో స్నేహంగా ఉంటూనే వారి కంటే మరింత మెరుగ్గా పని చేయాలన్న పోటీతత్వాన్ని పని ప్రదేశంలో పెంచుకుంటే చక్కటి అవుట్‌పుట్‌ను సంస్థకు అందించచ్చు. అయితే ‘నా కంటే వాళ్లు బాగా చేస్తున్నార’న్న అసూయ, ద్వేషాలకు తావు లేకుండా.. అవతలి వారిని ప్రశంసిస్తూ, మీ బెస్ట్‌ మీరు నిరూపించుకోవడం వల్ల పని ప్రదేశంలో ఆరోగ్యకరమైన పోటీతత్వం నెలకొంటుంది. ఇది ఇటు మీకు, అటు మీ బృందానికి-సంస్థకు మేలు చేస్తుంది.

ఒత్తిడి.. హుష్‌కాకి!
ఉద్యోగం ఏదైనా.. ఆయా పనులు పూర్తిచేయడం అంత సులభం కాదు.. ఎందులో ఉండే ఒత్తిళ్లు అందులో ఉంటాయి. దీన్ని అధిగమించినప్పుడే పని ప్రదేశంలో ఎంత కష్టమైన పనైనా సులభంగా పూర్తి చేయగలుగుతాం. మరి, ఇది సాధ్యం కావాలంటే.. బృంద సభ్యులతో స్నేహం పెంచుకోవడం, పని ప్రదేశంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటుచేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ కొలీగ్స్‌ పనిలో పొరపాటు చేసినప్పుడు అందులోని లోపాల్ని ఎత్తిచూపడం, బాగా చేస్తే ప్రశంసించడం.. వంటివి ఎలాగైతే చేస్తారో; అదే విధంగా అవతలి వారు మిమ్మల్ని ప్రశంసించినా, మీ పనిలో లోపాల్ని సరిచేసుకోమని చెప్పినా.. పాజిటివ్‌గా వాటిని స్వీకరించాలి. అప్పుడే ఎలాంటి ఒత్తిడి లేకుండా పని పూర్తిచేయగలుగుతాం.. సంస్థకు చక్కటి ఉత్పాదకతనూ అందించగలుగుతాం.

సంస్థలూ కృషి చేయాలి!
ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు నెలకొనాలంటే సంస్థలూ తమ వంతుగా కృషి చేయాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొలీగ్స్‌ మధ్య చెలిమి పెంచడానికి డిబేట్స్‌, టీమ్‌ లంచ్‌, సృజనాత్మకత పెరిగేలా కొన్ని ఆటలు.. వంటివి ప్లాన్‌ చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్