Updated : 28/12/2021 20:07 IST

బ్రా ఎంచుకునే ముందు ఇవి గమనిస్తున్నారా?

నా ఎద ఆకృతి, పరిమాణానికి తగ్గట్లుగా ఏ సైజు బ్రా ఎంచుకోవాలి?

చనుమొనల చుట్టూ అవాంఛిత రోమాలున్నాయి.. వాటిని తొలగించుకోవడమెలా?

నా వక్షోజాల పరిమాణం చిన్నగా ఉంది.. పెద్దగా కనిపించాలంటే ఏం చేయాలి?

ఇలా ఒకటా, రెండా.. తమ వక్షోజాలకు సంబంధించిన ప్రశ్నలు అమ్మాయిల మదిలో ఎన్నో ఉంటాయి. అయితే వాటి గురించి ఇతరులను అడగాలంటే సిగ్గు, బిడియం! దీంతో తమకు తెలిసిన చిట్కాలనే పాటించడం అలవాటుగా మార్చుకుంటారు. అయితే ఇలాంటి అలవాట్లు అప్పటికప్పుడు సమస్యల్ని తెచ్చిపెట్టకపోయినా.. కొన్నేళ్ల తర్వాత మాత్రం రొమ్ముల్లో నొప్పి, గడ్డలు, వక్షోజాలు సాగిపోవడం.. వంటి పలు రకాల సమస్యలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఫలితంగా ఇటు వాటి అందం, అటు ఆరోగ్యం దెబ్బతింటుంది. అదే.. మనకొచ్చిన సందేహాల్ని నిర్మొహమాటంగా నిపుణుల్ని అడిగి నివృత్తి చేసుకుంటే ఏ సమస్యా ఉండదు. మరి, ఇంతకీ వక్షోజాల విషయంలో అమ్మాయిలు చేసే సాధారణ పొరపాట్లేంటి? అవి ఎలాంటి సమస్యలకు దారి తీస్తాయి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

ఏదో ఒక ‘సైజు’లే.. అనుకోవద్దు!

ఎద అందాన్ని ఇనుమడింపజేయడంలో బ్రాదీ కీలక పాత్రే! అయితే వీటిని ఎంచుకునే విషయంలో కొంతమంది అమ్మాయిలు నిర్లక్ష్యం చేస్తుంటారు. పైకి కనిపించదు కదా ఏదో ఒకటి ఎంచుకుంటే సరిపోతుంది అనుకుంటుంటారు. నిజానికి రొమ్ములకు సరిగ్గా సరిపోయే బ్రాను ధరించినప్పుడే సౌకర్యవంతంగా ఉంటుంది.. అప్పుడే అందం ఇనుమడిస్తుంది. అదే కాస్త వదులుగా ఉన్న బ్రాను ధరిస్తే స్తనాలు సాగిపోవడం, బిగుతుగా ఉండేది ధరిస్తే రొమ్ముల్లో నొప్పి, ఛాతీ పట్టేయడం.. వంటి సమస్యల్ని ఎదుర్కోక తప్పదు.

అయితే సరిగ్గా సరిపోయే బ్రాను ఎంచుకోవడానికీ ఓ పద్ధతుంది. ఇందుకోసం ముందుగా రొమ్ముల కింది భాగాన్ని టేపుతో కొలవాల్సి ఉంటుంది. ఇదే బ్రా సైజ్. ఆపై రొమ్ములు ఎత్తుగా ఉన్న భాగంలో (నిపుల్స్‌ దగ్గర) చుట్టుకొలత తీసుకోవాలి. దీన్నుంచి కింది భాగం చుట్టుకొలత (బ్రా సైజ్) తీసివేస్తే అది కప్‌ సైజ్‌ని నిర్ణయిస్తుంది.

ఉదాహరణకు.. రొమ్ముల కింది భాగం 28 ఉందనుకోండి.. అది బ్రా కొలతగా పరిగణించాలి. నిపుల్స్‌ వద్ద కొలిచినప్పుడు 30 వస్తే.. దీన్నుంచి రొమ్ముల కింది భాగం కొలతను తీసివేయాలి.. అంటే 30-28 = 2.. ఇది కప్‌ సైజ్‌ అన్నమాట! ఇలా సరిగ్గా కొలత చూసుకొని నాణ్యమైన బ్రాని ఎంచుకుంటే ఇక ఎలాంటి అసౌకర్యం కలగదు.. స్తనాల ఆరోగ్యమూ దెబ్బతినదు.

‘వ్యాక్సింగ్‌’ సరికాదు!

కొంతమంది అమ్మాయిలకు స్తనాల వద్ద, నిపుల్స్‌ చుట్టూ అవాంఛిత రోమాలుంటాయి. నిజానికి వీటి గురించి బయటికి చెప్పుకోవడానికి వీరు మొహమాటపడుతుంటారు. దీంతో వారికి తెలిసిన వ్యాక్సింగ్‌ పద్ధతిని అనుసరించడం, అవాంఛిత రోమాల్ని తొలగించే క్రీమ్స్‌, ఫోమ్స్‌ ఉపయోగించడం.. వంటివి చేస్తుంటారు. నిజానికి ఆ రోమాల్ని తొలగించుకోవడానికి ఇవేవీ సురక్షితమైన పద్ధతులు కావు. ఇంకా చెప్పాలంటే ఇలా చేయడం వల్ల ఆ భాగంలో వాపు, ఇన్ఫెక్షన్‌ రావడం.. క్రీమ్స్‌/ఫోమ్స్‌లోని రసాయనాల వల్ల స్తనాల ఆరోగ్యం దెబ్బతినడం తప్ప మరే ప్రయోజనం లేదంటున్నారు నిపుణులు. అలాగని రేజర్‌తో తొలగించుకోవడం కూడా కరక్ట్‌ కాదని చెబుతోంది ఓ అధ్యయనం! అందుకే ఈ విషయాన్ని మీలోనే దాచుకోకుండా సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తే.. వక్షోజాల ఆరోగ్యం దెబ్బతినకుండా, ఈ అవాంఛిత రోమాలు తొలగించుకునే మార్గాలు వారు సూచిస్తారు.. అలాగే నిపుణుల సలహా మేరకు ఇంటి చిట్కాలు కూడా ప్రయత్నించచ్చు.

అప్పుడు సాధారణ బ్రా వద్దు!

వ్యాయామాలు చేసేటప్పుడు సరైన బ్రాను ఎంచుకోకపోవడం వల్ల కూడా రొమ్ముల ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సాధారణ బ్రా లేదంటే మరీ వదులుగా/బిగుతుగా ఉన్న బ్రాలను ఎంచుకుంటే వక్షోజాలు సాగిపోవడం, నొప్పి పుట్టడం, వెన్ను-భుజాల్లో నొప్పి.. వంటి సమస్యలు తప్పవంటున్నారు. అందుకే వర్కవుట్‌ చేసే సమయంలో స్పోర్ట్స్‌ బ్రానే చక్కటి ఎంపిక అంటున్నారు. ఇది రొమ్ములకు చక్కటి సపోర్ట్‌ అందిస్తూనే, సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి ఉండే స్ట్రాప్స్‌ కూడా వెడల్పుగా ఉంటాయి కాబట్టి అవి కూడా వ్యాయామాలు చేసేటప్పుడు వక్షోజాలు అటూ ఇటూ కదలకుండా స్టిఫ్‌గా ఉంచుతాయి. అయితే ఇలా మనం ఎంచుకునే స్పోర్ట్స్‌ బ్రాలోనూ కాటన్‌ తరహావి ఎంచుకోవడం వల్ల సౌకర్యవంతంగా వ్యాయామం చేసుకోవచ్చు. అలాగే ఇవి మరీ బిగుతుగా/వదులుగా లేకుండా చూసుకోవడమూ ముఖ్యమే!

అది ‘క్యాన్సర్‌’కూ దారితీయచ్చట!

కాస్త బిగుతుగా ఉండే బ్రాలైతేనే స్తనాలకు చక్కటి సపోర్ట్‌ ఉంటుందని భావిస్తుంటారు చాలామంది అమ్మాయిలు. నిజానికి ఇలాంటి బ్రాల వల్ల రొమ్ముల చర్మానికి గాలి తగలక పలు ఇన్ఫెక్షన్లు, అలర్జీలు వచ్చే అవకాశాలెక్కువ! అంతేకాదు.. రొమ్ముల్లోని విషతుల్యాలను తొలగించే లింఫ్‌ ద్రావణంపై కూడా ఈ బిగుతైన బ్రా ప్రతికూల ప్రభావం చూపుతుందట! దీంతో విషతుల్యాలన్నీ వక్షోజాల్లో అలాగే పేరుకుపోయి ఒక దశలో ఇది క్యాన్సర్‌కు దారితీయచ్చంటున్నారు నిపుణులు. మరో విషయం ఏంటంటే.. బిగుతైన బ్రా కారణంగా శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులు కూడా పడిపోతాయట! మరి, ఈ సమస్యలన్నీ రాకూడదంటే.. మనం చేయాల్సిందల్లా సరైన సైజు బ్రాను ఎంచుకోవడమే!

ప్యాడెడ్‌ బ్రా అయితే ఇలా!

వక్షోజాల ఆకృతి, సపోర్ట్‌ బాగుంటుందన్న ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ప్యాడెడ్‌ బ్రాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా స్తనాల పరిమాణం చిన్నగా ఉండే వారు వీటిని ఎంచుకొని అందంగా మెరిసిపోతున్నారు. నిజానికి ఇవి కూడా శరీరానికి మరీ బిగుతుగా లేకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే ఇవి రొమ్ముల్లో రక్తప్రసరణ సాఫీగా జరగకుండా చేయడంతో పాటు రొమ్ముల్లోని విషతుల్యాలను తొలగించే లింఫ్‌ ద్రావణాన్ని అడ్డుకుంటాయి. తద్వారా వక్షోజాల్లో గడ్డలు, నొప్పి.. వంటి అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

సో.. ఇలా మనకు తెలియకుండానే మనం చేసే పొరపాట్లు, మన అలవాట్లు రొమ్ముల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నమాట! కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకుంటూనే.. నిపుణుల సలహాలు, సూచనలు పాటిద్దాం..! ఆరోగ్యవంతమైన ఎద సంపదతో అందంగా మెరిసిపోదాం!


Advertisement

మరిన్ని