ప్రశంసల్ని ఆస్వాదించండి..!

జీవితంలో మనం ఎంత సాధించినా.. వాటిని గుర్తించేవారు, మన గురించి నాలుగు మంచి మాటలు చెప్పేవారు లేకపోతే మంచి పని చేయాలన్న ఉత్సాహం కూడా పోతుంది.

Published : 23 Aug 2023 12:27 IST

జీవితంలో మనం ఎంత సాధించినా.. వాటిని గుర్తించేవారు, మన గురించి నాలుగు మంచి మాటలు చెప్పేవారు లేకపోతే మంచి పని చేయాలన్న ఉత్సాహం కూడా పోతుంది. అందుకే ఎదుటివారు ప్రశంసిస్తున్నప్పుడు వారిని అడ్డుకోవడం, ఆ పొగడ్తలను స్వీకరించే హక్కు లేదన్నట్టుగా వ్యవహరించడం మంచిది కాదు.. మరి, వృత్తి ఉద్యోగాల్లో ఇతరులు మిమ్మల్ని ప్రశంసిస్తున్నప్పుడు ఏం చేయాలో తెలుసా?

థాంక్యూ చెప్పడం మరవద్దు..

'కంగ్రాట్యులేషన్స్.. చాలా గొప్ప పని చేశావు. నీ వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత విజయవంతమైంది..' అని ఎవరైనా మిమ్మల్ని పొగిడితే ఏం చేస్తారు.. దగ్గరివాళ్లయితే 'మునగచెట్టు ఎక్కించకు' అని చెప్పడం.. అదే కాస్త పైఅధికారులతో మాట్లాడుతుంటే దాన్ని దాటవేయడం, లేదా నవ్వి వూరుకోవడం చేస్తుంటారా? అయితే ఇది సరైన పద్ధతి కాదు. ఇలా ఎవరైనా మీపై ప్రశంసల వర్షం కురిపించినప్పుడు దాన్ని ఒప్పుకొని 'థాంక్యూ' చెప్పడం అలవాటు చేసుకోండి. అంతేకాదు.. సదరు పనిని విజయవంతంగా పూర్తి చేయడంలో మీకు సహాయం చేసినవారి గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం మర్చిపోవద్దు. ఫలితంగా వారు కూడా ఆనందంగా ఫీలవుతారు. గుర్తుంచుకోండి.. కష్టపడి పనిచేసినప్పుడు ఎదుటివాళ్లిచ్చే ప్రశంసలను పొందే హక్కు మీకుంది. దాన్ని పూర్తిగా ఆస్వాదించండి.

చక్కటి బాడీలాంగ్వేజ్..

ఎదుటివాళ్లు తమను ప్రశంసిస్తున్నప్పుడు కొందరు ముడుచుకుపోతారు. మరికొందరేమో.. తామే గ్రేట్ అన్నట్లుగా హావభావాలను ప్రదర్శిస్తుంటారు. అయితే ఈ రెండూ సరైనవి కావు. ఎదుటివారు మిమ్మల్ని ప్రశంసిస్తున్నప్పుడు చిరునవ్వుతో, హుందాగా దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. దీనివల్ల అవతలి వ్యక్తికి కూడా మీపై సదభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే ఎదుటివారు మీ గురించి ప్రశంసాపూర్వకమైన మాటలు మాట్లాడుతుంటే కాళ్లు వూపడం, చేతులు నలుపుకోవడం, ఎటో చూస్తుండడం.. వంటివి కూడా చేయకూడదు. వారి కళ్లల్లోకే చూస్తూ ప్రశంసలను స్వీకరించాలి.

టీమ్‌ని మర్చిపోవద్దు..

మిమ్మల్ని పైఅధికారులు ప్రశంసిస్తుంటే బాగానే ఉంటుంది. అయితే మీకింది వారికి అదే అవకాశం దక్కాలని వారూ కోరుకుంటారు. అందుకే మిమ్మల్ని ఎదుటివారు ప్రశంసిస్తుంటే ముందు వారికి ధన్యవాదాలు తెలిపి.. 'నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉందని నా భావన..' అని వివరించాలి. అలాగే ఇందులో మీకు సహాయం చేసిన మీ టీమ్ సేవలను కూడా గుర్తించడం.. అందరిలోనూ వారిని ప్రశంసించడం మర్చిపోవద్దు. నలుగురిలో మాట్లాడేటప్పుడు విజయానికి మీరొక్కరే కారణమని చెప్పకుండా టీమ్ సహకారం గురించి వివరించడం వల్ల వారికీ సంతోషంగా, ప్రోత్సాహకరంగా అనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్