‘నువ్వెప్పటికీ హాకీ స్టిక్‌ పట్టుకోలేవు’ అన్నారు!

పేరులో ‘రాణి’ ఉన్నా బాల్యంలో ఆమెకు సొంత ఇల్లు లేదు. తోపుడు బండి లాగే తండ్రి... పది ఇళ్లల్లో పని చేసే తల్లి... అందరూ రెక్కల కష్టం చేస్తే కానీ ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేవి కావు.. వీటికి తోడు హాకీ స్టిక్‌ పట్టుకుంటే సొంత బంధువుల నుంచే చీదరింపులు, ఛీత్కారాలు.. ఇలా ఎన్నో ఇబ్బందులు, అవమానాలను ధైర్యంగా ఎదుర్కొని 15 ఏళ్ల ప్రాయంలోనే జాతీయ మహిళల జట్టులోకి అడుగుపెట్టింది భారత మహిళల హాకీ క్వీన్‌ రాణీ రాంపాల్‌.

Updated : 08 Sep 2022 15:42 IST

Photo: Instagram

పేరులో ‘రాణి’ ఉన్నా బాల్యంలో ఆమెకు సొంత ఇల్లు లేదు. తోపుడు బండి లాగే తండ్రి... పది ఇళ్లల్లో పని చేసే తల్లి... అందరూ రెక్కల కష్టం చేస్తే కానీ ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేవి కావు.. వీటికి తోడు హాకీ స్టిక్‌ పట్టుకుంటే సొంత బంధువుల నుంచే చీదరింపులు, ఛీత్కారాలు.. ఇలా ఎన్నో ఇబ్బందులు, అవమానాలను ధైర్యంగా ఎదుర్కొని 15 ఏళ్ల ప్రాయంలోనే జాతీయ మహిళల జట్టులోకి అడుగుపెట్టింది భారత మహిళల హాకీ క్వీన్‌ రాణీ రాంపాల్‌. ‘నువ్వెప్పటికీ హాకీ స్టిక్‌ పట్టుకోలేవు’ అని వెక్కిరించిన వారికి ఏకంగా భారత మహిళల హాకీ జట్టుకు కెప్టెన్‌ అయి తనేంటో నిరూపించుకుంది.

క్రీడాకారిణిగా, కెప్టెన్‌గా వందలాది గోల్స్ సాధించి భారత మహిళల హాకీ జట్టుకు మరపురాని విజయాలు అందించింది రాణి. తన ఆటతీరుకు గుర్తింపుగా రాజీవ్‌ ఖేల్‌ రత్న, పద్మశ్రీ పురస్కారాలు అందుకుంది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత మహిళల జట్టును ముందుండి నడిపిస్తోంది. ఈ క్రమంలో ఇన్ని పేరు ప్రఖ్యాతులు, విజయాలను సాధించేందుకు తాను పడిన కఠోర శ్రమను ఓ సోషల్‌ మీడియా బ్లాగ్‌ ద్వారా మరోసారి గుర్తుకు చేసుకుందీ హాకీ క్వీన్‌.

రోజుకు ఒక్కపూటే భోజనం!

‘చాలామందికి నేను భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గానే తెలుసు.. కానీ చిన్నతనం నుంచి నేనెన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. విద్యుత్‌ సరఫరా అంతంతమాత్రంగానే ఉన్న ఓ చిన్న ఇల్లు.. చెవిలో జోరీగల్లా నిత్యం వినిపించే దోమల శబ్దం మధ్యే నా బాల్యం గడిచింది. హరియాణాలోని షాహాబాద్‌ మా సొంతూరు. నాన్న తోపుడు బండి లాగేవారు. రోజంతా కష్టపడితే కేవలం 80 రూపాయలు మాత్రమే చేతికందేవి. అమ్మ కూడా కొందరి ఇళ్లల్లో పాచి పనులు చేసేది. ఇద్దరు అన్నయ్యలు చిన్నాచితకా పనులకు వెళ్లేవారు. ఇలా ఇంట్లో అందరూ కష్టపడితే కానీ ఒక్క పూట పొట్ట నింపుకోని పరిస్థితి మాది. పండగకో, పబ్బానికో మాత్రమే రెండు పూటలా భోజనం చేసేవాళ్లం. ఈ కష్టాలు కాదన్నట్లు అప్పుడప్పుడూ వరదలు కూడా మమ్మల్ని పలకరిస్తుండేవి.’

శిక్షణ ఇవ్వడానికి నిరాకరించారు!

‘మా ఇంటికి సమీపంలో ఓ హాకీ అకాడమీ ఉండేది. గంటల కొద్దీ అక్కడే గడుపుతూ క్రీడాకారుల్ని, వారి ఆటను సునిశితంగా గమనించేదాన్ని. అలా క్రమంగా నాక్కూడా ఆటపై ఆసక్తి పెరిగింది. ఎలాగైనా హాకీ నేర్చుకోవాలనిపించింది. కానీ హాకీ స్టిక్‌ కొనిచ్చేంత స్తోమత మా అమ్మానాన్నలకు లేదు. అయితే నేను మాత్రం హాకీ అకాడమీకి వెళ్లడం మానలేదు. ఒకరోజు ధైర్యం చేసి అక్కడున్న కోచ్‌ను ‘నాకు కూడా హాకీలో శిక్షణ ఇప్పించండి.. నేర్చుకుంటాను’ అని అడిగాను. ‘హాకీ అనేది ఎక్కువ గంటల పాటు ఆడే ఆట. ఇందులో ఆడగలిగే శక్తి సామర్థ్యాలు నీలో లేవు.. నువ్వెప్పటికీ హాకీ స్టిక్‌ పట్టుకోలేవు..’ అంటూ వారు నాకు శిక్షణ ఇవ్వడానికి నిరాకరించారు. నాకు సరైన తిండి లేక తక్కువ బరువున్నందుకే వారు నన్ను తిరస్కరించారని నాకు అర్థమైంది. వారి మాటలతో కొంచెం నిరాశకు గురయినా ఆటపై ప్రేమను మాత్రం వదులుకోలేకపోయాను. గ్రౌండ్‌కు వెళ్లి విరిగిన హాకీ స్టిక్‌ సహాయంతో ప్రాక్టీస్‌ చేసేదాన్ని. క్రీడాకారులందరూ స్పోర్ట్స్ డ్రస్సుల్లో సాధన చేస్తుంటే నేను మాత్రం సల్వార్‌ కమీజ్‌ ధరించి ప్రాక్టీస్‌ చేసేదాన్ని. అలా కొద్దిరోజుల తర్వాత ఆటపై నాకున్న అంకితభావాన్ని కోచ్‌లు అర్థం చేసుకున్నారు. హాకీలో శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు.’

స్కర్ట్స్‌ వేసుకుని ఆడడం ఇష్టం లేదన్నారు!

ఈ విషయం తెలిసి మా కుటుంబ సభ్యులు ‘నువ్వు పొట్టి పొట్టి స్కర్ట్స్‌ వేసుకుని మైదానంలో ఆడడం మాకు ఇష్టం లేదు’ అంటూ నన్ను మందలించారు. దీనికి ఇరుగుపొరుగు వాళ్లు, బంధువులు వంత పాడారు. అలాగని నేను నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ‘దయచేసి నన్ను ఆపకండి. ఒకవేళ ఈ ఆటలో నేను రాణించకపోతే మీరు చెప్పినట్లే వింటాను. కానీ ఇప్పుడు మాత్రం శిక్షణకు అనుమతివ్వండి’ అని కోరాను. ఎట్టకేలకు వారు నన్ను అకాడమీకి పంపేందుకు అంగీకరించారు.

పాలల్లో నీళ్లు కలుపుకొని వెళ్లేదాన్ని!

‘అకాడమీలో రోజూ తెల్లవారుజామునే నా ట్రైనింగ్‌ ప్రారంభమయ్యేది. అయితే ఇంట్లో గడియారం ఉండేది కాదు. దీంతో అమ్మ ఆకాశాన్ని చూసి సమయాన్ని సరిగ్గా అంచనా వేసి నన్ను నిద్రలేపేది. అకాడమీలో శిక్షణ పొందే వారంతా కచ్చితంగా ఇంటి నుంచి 500మిల్లీ లీటర్ల పాలు తెచ్చుకోవాలి. శిక్షణ మధ్యలో వాటిని తాగాల్సి ఉంటుంది. అయితే నాకు అంత స్థోమత ఉండేది కాదు. కేవలం 200మిల్లీ లీటర్ల పాలు తీసుకుని.. మిగతావి నీళ్లు కలుపుకొని అకాడమీకి తీసుకెళ్లేదాన్ని. ఇక శిక్షణలో నాకు కోచ్‌ అండగా నిలిచారు. ట్రైనింగ్‌కు అవసరమైన కిట్స్‌, షూస్‌ ఆయనే కొనిచ్చారు. నా డైట్‌ వ్యవహారాలను కూడా దగ్గరుండి చూసుకున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే నేను ఒక్కరోజు కూడా ప్రాక్టీస్‌ మిస్‌ అవ్వలేదు.’

నాన్న చేతుల్లో 500 రూపాయలు పెట్టాను!

‘శిక్షణ పూర్తయిన తర్వాత ఓ టోర్నమెంట్లో గెలిచినందుకు నాకు 500 రూపాయలు బహుమతిగా వచ్చాయి. దీనిని తీసుకెళ్లి నేరుగా మా నాన్నకు ఇచ్చాను. అప్పటివరకు ఆయన చేతుల్లో అంత పెద్ద మొత్తాన్ని నేను చూడలేదు. అమ్మానాన్నల కోసం ఓ సొంత ఇల్లు నిర్మించాలన్నది నా మొదటి కోరిక. ఆ దిశగానే నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటడంతో 15 ఏళ్ల వయసులో నాకు జాతీయ జట్టు నుంచి పిలుపువచ్చింది. అప్పటికి కూడా మా బంధువుల్లో కొందరు ‘పెళ్లెప్పుడు చేసుకుంటావు?’ అని నన్ను అడిగేవారు. అప్పుడు నాన్న ‘నా కూతురు తనకు ఇష్టమైనన్ని రోజులు హాకీ ఆడుతుంది. ఇందులో ఎవరి జోక్యం ఉండదు’ అని నాకు మద్దతుగా నిలిచారు. అలా నా కోచ్‌, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మొదట ప్లేయర్‌గా జాతీయ మహిళల జట్టులోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత కెప్టెన్‌ అయ్యాను.’

వారి రుణం తీర్చుకోలేనిది!

‘జాతీయ జట్టుకు నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల తర్వాత నాన్న స్నేహితుడొకరు తన మనవరాలితో మా ఇంటికొచ్చారు. ‘నా మనవరాలికి నువ్వంటే చాలా ఇష్టం. నిన్నే స్ఫూర్తిగా తీసుకుంది. భవిష్యత్‌లో హాకీ ప్లేయర్‌ అవుదామనుకుంటోంది’ అని నాతో చెప్పారు. ఆ మాటలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి. 2017లో నా తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. రెండంతస్తుల భవనాన్ని కొని వారికి బహుమతిగా అందించాను. అప్పుడు మేం ఒకరికొకరు హత్తుకుంటూ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాం. అయితే ఇక్కడితో అంతా ముగియలేదు. నా తల్లిదండ్రులు, కోచ్‌లకు ఇంకా ఎంతో రుణపడి ఉన్నాను.  అందులో మొదటిది టోక్యో పతకం. ఎలాగైనా దీనిని గెల్చుకుని వారికి కానుకగా అందివ్వాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది రాణీ రాంపాల్‌.

ఇలా ఈ హాకీ క్వీన్‌ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను చూసి ఎంతోమంది చలించిపోతున్నారు.. ఒకింత భావోద్వేగానికి గురవుతున్నారు.. ‘హ్యాట్సాఫ్‌ రాణి.. నువ్వు ఎంతోమందికి స్ఫూర్తి!’ అంటూ ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్