Nehu Thakur : ఈ అందగత్తె.. ట్రక్‌ డ్రైవర్‌ కూడా..!

సరుకు రవాణా చేసే ట్రక్కులు, లారీల్లో డ్రైవర్లుగా పురుషులే కనిపిస్తుంటారు. ఈ వృత్తిలో ఒక్కోసారి రాత్రుళ్లూ ప్రయాణం చేయాల్సి రావచ్చు.. రాష్ట్రాలూ దాటాల్సి రావచ్చు.. అందుకే భారీ వాహనాల్లో ఇలాంటి సాహసోపేతమైన ప్రయాణాలు మహిళలకు అంత సురక్షితం కాదన్నది చాలామంది భావన.

Updated : 30 Dec 2023 21:59 IST

(Photos: Instagram)

సరుకు రవాణా చేసే ట్రక్కులు, లారీల్లో డ్రైవర్లుగా పురుషులే కనిపిస్తుంటారు. ఈ వృత్తిలో ఒక్కోసారి రాత్రుళ్లూ ప్రయాణం చేయాల్సి రావచ్చు.. రాష్ట్రాలూ దాటాల్సి రావచ్చు.. అందుకే భారీ వాహనాల్లో ఇలాంటి సాహసోపేతమైన ప్రయాణాలు మహిళలకు అంత సురక్షితం కాదన్నది చాలామంది భావన! అయితే ఈ ఆలోచనను పూర్తిగా తుడిచిపెట్టింది హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన నేహూ ఠాకూర్‌. తన 22వ ఏటే ట్రక్కు డ్రైవర్‌గా మారిన ఆమె.. ఈ వ్యాపారంలో తన తండ్రికి చేదోడువాదోడుగా ఉంటోంది. ‘కెరీర్‌ ఎంపికలో ఆడ-మగ అన్న తేడాలేవీ ఉండవని.. నచ్చిన వృత్తిని ఎంచుకున్నప్పుడే మనమేంటో నిరూపించుకోగలుగుతామం’టోన్న ఈ లేడీ ట్రక్‌ డ్రైవర్‌ కథ ఎంతోమంది యువతులకు స్ఫూర్తిదాయకం!

నేహూది హిమాచల్‌ ప్రదేశ్‌ మండి జిల్లాలోని ఖుడ్లా అనే గ్రామం. ఆమె తండ్రి సరుకులు రవాణా చేసే ట్రక్‌ డ్రైవర్‌. ఈ క్రమంలోనే సొంతంగా రెండు ట్రక్కులు కొనుక్కొని వాటిని నడుపుతోన్న తన తండ్రిని చూస్తూ పెరిగిన నేహూ.. తాను కూడా పెద్దయ్యాక నాన్న లాగే ట్రక్కు డ్రైవర్‌గా స్థిరపడాలనుకుంది. ‘అమ్మాయిలు ఇలాంటి లక్ష్యాలు పెట్టుకోవడమేంట’ని నలుగురూ అన్నా.. తన కుటుంబం మాత్రం ఈ విషయంలో తనకు పూర్తి మద్దతిచ్చిందంటోంది నేహూ.


వద్దన్నా వినలేదు!

చిన్న వయసు నుంచే డ్రైవింగ్‌ను ఇష్టపడిన నేహూ.. బైక్స్‌, కార్లు.. వంటి చిన్న వాహనాలే కాదు.. ట్రక్కులు, లారీలు, ట్రాక్టర్లు తదితర భారీ వాహనాల్ని సైతం నడపడం నేర్చుకుంది. ఇలా ఓవైపు డ్రైవింగ్‌లో శిక్షణ పొందుతూనే.. మరోవైపు చదువుపైనా దృష్టి పెట్టిందామె. అయితే ఎయిర్‌హోస్టెస్‌ కావాలనేది ఆమె మరో ఆశయం. ఈ క్రమంలోనే ఎయిర్‌హోస్టెస్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకున్న ఆమె.. ఆపై ఓ ప్రైవేటు ఉద్యోగంలో చేరింది. అయితే కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో.. ఇంటికి చేరిన నేహూ.. అంతిమంగా తన చిన్ననాటి లక్ష్యంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది.

‘డ్రైవింగ్‌ నా రక్తంలోనే ఉంది. నాన్న ప్రోత్సాహంతో చిన్న వయసులోనే అన్ని రకాల వాహనాలు నడపడం నేర్చుకున్నా. ఇంట్లో వాళ్లు నా నిర్ణయానికి మద్దతిచ్చినా.. ఇరుగుపొరుగు వాళ్లు మాత్రం ఆడపిల్లలకు ఈ కెరీర్‌ సరిపడదు.. అని నిరుత్సాహ పరిచేవారు. అయినా నేను నా లక్ష్యంపైనే దృష్టి పెట్టా. ఈ రంగంలో నేను రాణించడమే కాదు.. తోటి అమ్మాయిల్నీ ప్రోత్సహించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నా. ఈ ఆలోచనతోనే నాన్నతో పాటే ట్రక్కు స్టీరింగ్‌ పట్టుకున్నా..’ అంటోంది నేహూ.


మహిళలకు సవాళ్లెన్నో!

ప్రస్తుతం తమకున్న రెండు ట్రక్కుల్లో ఒకదాని స్టీరింగ్‌ పట్టుకున్న నేహూ.. తన తండ్రి వ్యాపార వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.

‘ప్రస్తుతం మన దేశంలో సరుకు రవాణా చేసే ట్రక్కు/లారీ డ్రైవర్లుగా మహిళలున్నా.. వారు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు లేవు. కొన్ని చోట్ల టాయిలెట్‌ సదుపాయాలకు ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది.. మరికొన్ని ప్రదేశాలకు వెళ్లడం సురక్షితం కాకపోవచ్చు.. అందుకే ప్రస్తుతం స్థానికంగా, రాష్ట్రవ్యాప్తంగానే సరుకు రవాణా చేస్తున్నా. భవిష్యత్తులో మాత్రం ఈ సవాళ్లన్నీ అధిగమించి రాష్ట్ర బోర్డర్‌ దాటాలన్న కోరిక ఉంది. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు, మహిళలకు భారీ వాహనాలు నడపాలని ఉన్నా.. సామాజిక అసమానతలు, సవాళ్ల రీత్యా తమ కలను నెరవేర్చుకోలేకపోతున్నారు. కానీ తాము ఇష్టపడిన కెరీర్‌ ఏదైనా సరే.. సవాళ్లను, విమర్శల్ని అధిగమించినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం.. మనమేంటో నిరూపించుకోగలుగుతాం..’ అంటోందీ ట్రక్‌ గర్ల్‌.


అందగత్తె.. సోషల్‌ స్టార్‌!

సాధారణంగా లారీలు, ట్రక్కులు వంటి భారీ వాహనాలు నడిపే వారు మోటుగా ఉంటారన్నది చాలామంది భావన. నేహూ కూడా అలాగే ఉంటుందనుకుంటే పొరపాటే! ఎందుకంటే ట్రక్కు డ్రైవరే అయినా.. చాలా ఫెయిర్‌గా, అందంగా ఉంటుందీ అమ్మాయి. దీనికి తోడు ఈ ట్రక్‌ గర్ల్‌కి ఫ్యాషన్‌ సెన్స్‌ కూడా ఎక్కువేనండోయ్‌! సందర్భాన్ని బట్టి ట్రెడిషనల్‌గా, ఫ్యాషనబుల్‌గా ముస్తాబై దిగిన ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది నేహూ. అంతేకాదు.. తాను ట్రక్‌ నడుపుతోన్న వీడియోల్ని సైతం పంచుకుంటుంటుంది. అందుకే ప్రస్తుతం ట్రక్‌ డ్రైవింగ్‌ నైపుణ్యాలతో రాష్ట్రవ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగానూ పాపులారిటీ సంపాదించుకున్న నేహూకు సామాజిక మాధ్యమాల్లోనూ ఫాలోయింగ్‌ ఎక్కువే! ఈ క్రమంలోనే ప్రస్తుతం 7 లక్షల మందికి పైగా ఫాలోవర్లతో దూసుకుపోతోందీ సోషల్‌ స్టార్‌.



Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్