చర్మానికి నాచు, జుట్టుకు బీరు.. ఐరిష్‌ అందాల వెనుక..!

వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇవన్నీ తమ సౌందర్య రహస్యాలని చెబుతున్నారు ఐర్లాండ్ మగువలు. తరతరాలుగా తాము పాటిస్తోన్న ఇలాంటి చిట్కాల వల్లే తమ అందం ద్విగుణీకృతం అవుతోందంటోన్న ఐరిష్ ముద్దుగుమ్మలు.. భవిష్యత్ తరాల వారికీ వీటిని అలవాటు చేస్తామంటున్నారు. మరి, ఐర్లాండ్‌ భామలు....

Published : 04 Sep 2022 14:19 IST

ముఖంపై మొటిమల్ని తొలగించుకోవాలంటే అందుకు బార్లీ వాటర్ చక్కటి పరిష్కారం.

చర్మం బిగుతుగా మారాలంటే సముద్రపు నాచుతో చర్మాన్ని ర్యాప్ చేస్తే సరి.

జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోవాలంటే బీర్ కండిషనింగ్ తప్పనిసరి.

వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇవన్నీ తమ సౌందర్య రహస్యాలని చెబుతున్నారు ఐర్లాండ్ మగువలు. తరతరాలుగా తాము పాటిస్తోన్న ఇలాంటి చిట్కాల వల్లే తమ అందం ద్విగుణీకృతం అవుతోందంటోన్న ఐరిష్ ముద్దుగుమ్మలు.. భవిష్యత్ తరాల వారికీ వీటిని అలవాటు చేస్తామంటున్నారు. మరి, ఐర్లాండ్‌ భామలు ఇంకా ఎలాంటి సౌందర్య చిట్కాల్ని పాటిస్తారో మనమూ తెలుసుకుందాం రండి..

'బార్లీ వాటర్'తో మొటిమలకు చెక్!

మొటిమలు, వాటి తాలూకు మచ్చలు.. వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఎంతోమంది మహిళల్ని ఇబ్బంది పెడుతోన్న ఈ సమస్యల్ని తగ్గించుకోవాలంటే బయట దొరికే ఆహారానికి బదులుగా బార్లీ నీరు తాగమని సూచిస్తున్నారు ఐర్లాండ్ మగువలు. తమ చర్మం అంత ప్రకాశవంతంగా, మొటిమలు, మచ్చలు లేకుండా ఉందంటే.. అందుకు వారు రోజూ గ్లాసు బార్లీ నీరు తాగడం వల్లేనట! ఇందుకోసం.. పావు కప్పు బార్లీ గింజల్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లు వంపేసి.. ఆ గింజల్ని ఒక గిన్నెలో వేసి కొన్ని నీళ్లు పోసి అరగంట పాటు ఉడికించాలి. గింజలు పూర్తిగా ఉడికాక స్టౌ ఆఫ్ చేసి ఆ నీటిని చల్లారనివ్వాలి. ఆఖర్లో ఈ నీటిని గ్లాసులోకి తీసుకొని నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసుకొని తీసుకుంటే సరిపోతుంది. బార్లీ నీరు రోజూ తాగడం వల్ల మొటిమల సమస్య తగ్గడమే కాదు.. శరీరానికి చలువ కూడా చేస్తుంది.

బిగుతైన చర్మానికి సీ-వీడ్!

అధిక బరువును తగ్గించుకునే క్రమంలో చర్మం వదులుగా మారడం చాలామందికి అనుభవమే! మరి, ఈ వదులైన చర్మాన్ని బిగుతుగా మార్చుకోవడానికి రకరకాల క్రీములు వాడడం, చికిత్సలు చేయించుకోవడం.. వంటివి చాలామంది చేసే పని. కానీ వీటివల్ల సత్ఫలితాలు వస్తాయో, లేదో తెలియదు కానీ.. దుష్ప్రభావాల బారిన పడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే ఐర్లాండ్ మగువలు తమ చర్మాన్ని బిగుతుగా మార్చుకోవడానికి కూడా సహజసిద్ధమైన పద్ధతినే అనుసరిస్తుంటారట! అదే.. సీ-వీడ్ బాత్. అక్కడి సముద్రంలో విరివిగా లభించే సముద్రపు నాచుతో స్నానం చేయడం ఐరిష్ మగువలకు అలవాటు. ఈ క్రమంలో రోజూ కొద్దిగా సముద్రపు నాచును వారు స్నానం చేసే నీటిలో వేసుకొని.. కాసేపటి తర్వాత స్నానం చేస్తారు. అదీ కాకపోతే వారికి దగ్గర్లోని పార్లర్స్‌కి, స్పా సెంటర్లకి వెళ్లి. అక్కడ సీ-వీడ్ ర్యాప్ చేయించుకుంటారు. అంటే.. సముద్రపు నాచును శరీరమంతా అప్త్లె చేసుకొని కాసేపు సేదతీరడం అన్నమాట. ఇలా ఈ పద్ధతుల వల్ల సముద్రపు నాచులోని ఖనిజాలు చర్మానికి పోషణను అందించి చర్మం బిగుతుగా మారడంలో సహకరిస్తాయి.

ఓట్‌మీల్‌తో ఫేషియల్..

ఫేషియల్స్ కోసం పార్లర్ల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు చేయడం కంటే ఇంట్లోనే సహజసిద్ధమైన పదార్థాలతో ఫేషియల్ చేసుకొని న్యాచురల్ బ్యూటీస్‌గా మెరిసిపోతుంటారు ఐరిష్‌ మగువలు. ఇందుకోసం 'ఓట్‌మీల్ ఫేస్‌ప్యాక్' వాడుతుంటారు. రెండు చెంచాల ఓట్స్, చెంచా చొప్పున పాలు, తేనె.. ఈ మూడింటినీ కలిపి పేస్ట్‌లాగా చేసుకొని.. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్త్లె చేసుకుంటారు. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటారు. ఈ ప్యాక్ చర్మానికి స్క్రబ్‌గా ఉపయోగపడుతుంది. తద్వారా చర్మంపై ఉండే మొటిమలు తొలగిపోవడంతో పాటు, పొడిబారి నిర్జీవమైన చర్మం కొత్త కళను సంతరించుకుంటుంది.

సంపూర్ణ సౌందర్యానికి 'కాంఫ్రే'!

ఐరిష్ మగువలు తమ అందాన్ని, ఆరోగ్యాన్ని ఏకకాలంలో సంరక్షించుకోవడానికి ఉపయోగించే ఔషధ మూలిక 'కాంఫ్రే' ఆకులు. అక్కడ విరివిగా లభించే ఈ మొక్క ఆకులు, కాండంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. పొడిబారి పొలుసులుగా వూడిపోయే చర్మ సమస్యను పరిష్కరించడం, జుట్టును పట్టుకుచ్చులా మెరిపించడం.. మొదలైన వాటితో పాటు కీళ్లు, కండరాల నొప్పుల్ని తగ్గించే ఔషధ గుణాలు సైతం ఇందులో పుష్కలంగా ఉంటాయి. అందుకే ఐర్లాండ్ మహిళలు ఈ ఆకుల్ని తాము చర్మ సౌందర్యం కోసం ఉపయోగించే ఫేస్‌ప్యాక్‌ల్లో వాడతారు. అలాగే గాయాలు, కీళ్లు-కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఆయా భాగాల్లో ఈ ఆకులతో తయారుచేసిన పేస్ట్‌ని అప్త్లె చేస్తారు. ఐర్లాండ్‌లో విరివిగా పెరిగే ఈ కాంఫ్రే మొక్క.. ఇక్కడ కాంఫ్రే ఎక్స్‌ట్రాక్ట్ రూపంలో ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతుంది. అయితే ఈ ఆకులు అందరికీ పడచ్చు.. పడకపోవచ్చు. కాబట్టి వీటిని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం లేదంటే సౌందర్య, ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

బీర్‌తో కండిషనింగ్!

జుట్టును సిల్కీగా మార్చుకోవడానికి, కేశ సంపదను రెట్టింపు చేసుకోవడానికి చాలామంది పాటించే చిట్కా.. తలస్నానం చేసిన తర్వాత జుట్టును కండిషన్ చేసుకోవడం. ఇందుకోసం బయట రకరకాల హెయిర్ కండిషనర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఐర్లాండ్ మగువలు తమ జుట్టును కండిషన్ చేసుకోవడానికి ఏం ఉపయోగిస్తారో తెలుసా? బీర్. ఇందుకోసం ముందుగా గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేసి.. ఆఖర్లో బీర్‌ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పడేలా పోస్తారు. ఇందులో అధిక మొత్తంలో ఉండే ప్రొటీన్లు జుట్టుకు పోషణను అందించి కేశాలను మృదువుగా, సిల్కీగా, పట్టుకుచ్చులా మార్చుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్