రికార్డుల కోసమే పుట్టిందేమో..!

జడ వేసుకునేటప్పుడు ఓ వెంట్రుక లాగినట్లనిపిస్తేనే ఓర్చుకోలేం. అలాంటిది జుట్టుతో కిలోలకు కిలోలు బరువులెత్తే సాహసం చేయగలమా?! కానీ పంజాబ్‌కు చెందిన ఆశా రాణి మాత్రం ఒళ్లు గగుర్పొడిచే ఇలాంటి విన్యాసమే చేసింది. తన జుట్టుతో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 12 వేల కిలోలకు పైగా బరువున్న డబుల్‌ డెక్కర్‌ బస్సును అలవోకగా లాగింది..

Updated : 16 Nov 2023 14:34 IST

(Photo: Screengrab)

జడ వేసుకునేటప్పుడు ఓ వెంట్రుక లాగినట్లనిపిస్తేనే ఓర్చుకోలేం. అలాంటిది జుట్టుతో కిలోలకు కిలోలు బరువులెత్తే సాహసం చేయగలమా?! కానీ పంజాబ్‌కు చెందిన ఆశా రాణి మాత్రం ఒళ్లు గగుర్పొడిచే ఇలాంటి విన్యాసమే చేసింది. తన జుట్టుతో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 12 వేల కిలోలకు పైగా బరువున్న డబుల్‌ డెక్కర్‌ బస్సును అలవోకగా లాగింది.. ఫలితంగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. అయితే ఇది 2016 నాటి రికార్డే అయినా.. ఈ ఫీట్‌కి సంబంధించిన వీడియోను తాజాగా గిన్నిస్‌ అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

పంజాబ్‌కు చెందిన ఆశా రాణి తన వెయిట్‌ లిఫ్టింగ్‌ నైపుణ్యాలు, శారీరక సత్తువతో ‘ది ఐరన్‌ క్వీన్‌’గా పేరు తెచ్చుకుంది. ఆమెకు చిన్నతనం నుంచి సాహసాలు చేయడమంటే మక్కువ. ఈ క్రమంలోనే అరుదైన రికార్డులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందామె. ఇందులో భాగంగానే ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు చేస్తూ ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాలన్న ఆశయంతో కోచ్‌/మెంటర్‌ మంజిత్‌ సింగ్‌ దగ్గర శిక్షణలో చేరింది. ‘స్ట్రాంగ్‌ మ్యాన్’గా పేరుపొందిన ఆయన ఖాతాలో ఇప్పటివరకు 30కి పైగా గిన్నిస్‌ రికార్డులున్నాయి. ఆయన శిశ్యురాలిగా తానూ అదే దారిలో నడవాలని ఆశయంగా పెట్టుకుంది ఆశ.

నాటి రికార్డు.. నేడు వైరల్!

పాత రికార్డులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తరచూ గిన్నిస్‌ బుక్‌ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ అవుతూ.. ఎంతోమందిని అబ్బుర పరుస్తుంటాయి. తాజాగా పోస్ట్‌ అయిన ఆశా రాణి గత రికార్డు వీడియో కూడా అలాంటిదే! అమ్మాయిలంతా ఎంతో అపురూపంగా చూసుకునే జుట్టుతో ఏకంగా ఓ డబుల్‌ డెక్కర్‌ బస్సునే లాగి పడేసింది ఆశ. సుమారు 12,216 కిలోల బరువున్న బస్సుకు అనుసంధానించిన తాడును తన రెండు జడలకు ముడేసుకొని కొన్ని మీటర్ల దూరం లాగింది. తద్వారా ‘జుట్టుతో అతి భారీ వాహనాన్ని లాగిన మహిళ’గా 2016లో గిన్నిస్‌ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ అరుదైన ఫీట్‌కు ఇటలీ మిలాన్‌లోని ‘Lo Show dei Record’ సెట్‌ వేదికగా నిలిచింది. ఇలా రికార్డు సృష్టించి గిన్నిస్ ప్రశంసా పత్రం అందుకునే క్రమంలో ఒకింత భావోద్వేగానికి లోనైందామె. ఇక ఈ ఫీట్‌కు సంబంధించిన వీడియోను గిన్నిస్‌ తన ఇన్‌స్టా పేజీలో పంచుకోగా.. అది పలువురిని ఆకట్టుకుంటోంది. చాలామంది ఆశ సాహసాన్ని చూసి నివ్వెరపోవడమే కాదు.. ‘మీ దృఢమైన జుట్టు రహస్యమేంట’ని ప్రశ్నిస్తున్నారు కూడా!

అరుదైన రికార్డులెన్నో!

ఇదనే కాదు.. ఇలాంటి అరుదైన రికార్డులు సృష్టించడానికే పుట్టిందేమో అనిపిస్తుంది గతంలో ఆశ చేసిన కొన్ని విన్యాసాలు పరిశీలిస్తే! ముందు నుంచీ బరువులెత్తడం, శారీరక సత్తువను పెంచుకోవడం పైనే దృష్టి పెట్టిన ఆమె.. గతంలోనూ పలు ప్రపంచ రికార్డులు తన ఖాతాలో వేసుకుంది.

* 2013లో యూకేలోని Leicestershire వేదికగా 1700 కిలోల వ్యాన్‌ను చెవులతో లాగి గిన్నిస్ కెక్కింది ఆశ.

* ఓ భారీ వాహనాన్ని దంతాలతో అత్యంత వేగంగా లాగినందుకు గాను  మరో రికార్డు తన వశమైంది. ఈ క్రమంలో 22.16 సెకన్లలో ఆ వాహనాన్ని 25 మీటర్లు లాగి తనకెదురులేదనిపించిందీ పంజాబీ కుడీ.

* 2014లో తన చెవులతో (Ear Clamps సహాయంతో) 34.9 కిలోల బరువును అలవోకగా ఎత్తి.. ‘చెవులతో అత్యధిక బరువు ఎత్తిన మహిళ’గా గిన్నిస్‌ రికార్డు సృష్టించింది ఆశ.

* మరో రికార్డులో భాగంగా 55.6 కిలోల బరువును జుట్టుతో ఎత్తి తద్వారా ఈ ఘనత సాధించిన మహిళగా ప్రపంచ రికార్డును కైవసం చేసుకుందీ పంజాబీ అమ్మాయి.

అంతేకాదు.. గతంలో ‘బ్రిటన్స్‌ గాట్‌ ట్యాలెంట్‌’ షోకు హాజరైన ఆశ.. ఆ షో వ్యాఖ్యాత అమండాను చెవులతో (Ear Clamps సహాయంతో) ఎత్తి ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. ఇలా తన రికార్డులతో, శారీరక సత్తువతో, సాహసాలతో ఎంతోమందిని కట్టిపడేస్తున్న ఈ పంజాబీ.. తలచుకుంటే సాధ్యం కానిదేదీ లేదని తన విజయాలతో చెప్పకనే చెబుతుంది.

గమనిక:

ఇలా రికార్డు కోసం జుట్టు, చెవులు.. వంటి సున్నితమైన శరీర భాగాలతో బరువులు ఎత్తడం, లాగడానికి ఔత్సాహికులు ముందు నుంచే ఎంతో కఠోర పరిశ్రమ చేస్తారు. తద్వారా దీనికి అలవాటు పడతారు. అంతేకానీ.. వీళ్లను చూసి సరదాకో, సాహసానికో ఇలాంటి విన్యాసాలు చేయడం తగదంటున్నారు నిపుణులు. తద్వారా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుందని హెచ్చరిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్