Jasmine Lulla: క్యాన్సర్‌ను జయించి.. కేక్ క్వీన్‌గా ఎదిగింది!
కస్టమైజ్‌డ్ బేకింగ్ నైపుణ్యాలతో బేకింగ్ రంగంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాస్మిన్ స్ఫూర్తి గాథ ఇది!
(Photos: Instagram)
మనసులో ఒక ఆశయం ఉంటే.. మరో దానిపై దృష్టి పెట్టలేం. ఎవరెన్ని చెప్పినా, వద్దని వారించినా దాన్ని సాధించే దాకా వదిలిపెట్టం. ఇండోర్‌కు చెందిన జాస్మిన్ లుల్లా కూడా ఇదే చేసింది. ఆతిథ్య రంగంలోకి రావాలన్న ఆమె ఇష్టాన్ని ఆమె తల్లిదండ్రులు కాదన్నారు. దాంతో కొన్నాళ్ల పాటు మిన్నకుండిపోయిన ఆమె.. పెళ్లి తర్వాత తన భర్త అండతో తన అభిరుచిపై తిరిగి దృష్టి పెట్టింది. అలా వంటింట్లో ప్రారంభమైన తన బేకింగ్ ప్రయాణం.. ఇప్పుడు దేశమంతా విస్తరించింది. ఒకానొక దశలో క్యాన్సర్‌ను, తన భర్త మరణాన్ని తట్టుకొని నిలబడిన ఆమె.. దేశంలోనే ‘ది బెస్ట్ ఉమన్ ఆంత్రప్రెన్యూర్’గా పేరు తెచ్చుకుంది. కస్టమైజ్‌డ్ బేకింగ్ నైపుణ్యాలతో ప్రస్తుతం బేకింగ్ రంగంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాస్మిన్ స్ఫూర్తి గాథ ఇది!
జాస్మిన్ భోపాల్‌లో పెరిగింది. ఆమెకు బేకింగ్ అంటే ప్రాణం. తనకున్న అమితమైన ఆసక్తితో ఖాళీ సమయాల్లో ఇంట్లోనే కేక్స్, ఇతర బేకింగ్ ఉత్పత్తుల్ని తయారుచేసేదామె. భవిష్యత్తులో దీన్నే తన కెరీర్‌గా మలచుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.. హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలోకి అడుగు పెట్టాలనుకుంది. కానీ ఆమె తల్లిదండ్రులు ఇందుకు ససేమిరా అన్నారు. కారణం.. అమ్మాయిలు ఇలాంటి పురుషాధిపత్యం ఉన్న రంగాల్లోకి వెళ్లకూడదన్నది వాళ్ల ఆలోచన. ‘మాది సంప్రదాయ విలువలకు అధిక ప్రాధాన్యమిచ్చే కుటుంబం. అందుకే ఆతిథ్య రంగంలోకి వెళ్లాలన్న నా ఆలోచనను అమ్మానాన్నలు తిరస్కరించారు. అయినా బేకింగ్‌పై నాకున్న మక్కువను మాత్రం వదులుకోలేదు..’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు జాస్మిన్.
భర్త ప్రోత్సాహంతో..!
బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తిచేసిన జాస్మిన్.. ఆ వెంటనే ఇండోర్‌కు చెందిన మనీష్ లుల్లాతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అయితే పెళ్లయ్యాకే భర్త అండతో తన బేకింగ్ అభిరుచిపై తిరిగి దృష్టి పెట్టే అవకాశం దొరికిందంటోందామె.
‘నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు తొలిసారి కేక్ తయారుచేశా. అప్పుడు నా బేకింగ్ నైపుణ్యాలను అందరూ ప్రశంసించారు. ఇక పెళ్లయ్యాక బేకింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం దొరికింది. ఈ క్రమంలో ఇంట్లోనే కేక్స్ తయారీ మొదలుపెట్టా. మొదట తెలిసిన వాళ్లు, ఫ్రెండ్స్ కోరిక మేరకు డిజైనర్ కేక్స్ తయారుచేసి ఇచ్చేదాన్ని. ఆకృతి, డిజైన్ దగ్గర్నుంచి రుచి దాకా ఎక్కడా రాజీ పడకుండా నేను బేక్ చేసిన ఆ కేక్స్ అందరికీ నచ్చేవి. నిజానికి ఆ సమయంలో ఇండోర్‌లో డిజైనర్ కేక్స్ అనేది కొత్త కాన్సెప్ట్. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ‘కేక్స్ అండ్ క్రాఫ్ట్’ పేరుతో బేకరీ ప్రారంభించా.. వినియోగదారుల అభిరుచుల మేరకు కస్టమైజ్‌డ్ కేక్స్ తయారుచేయడమే ముఖ్యోద్దేశంగా బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్తున్నా..’ అంటున్నారు జాస్మిన్.
ఆ కేక్స్‌తో ప్రత్యేక గుర్తింపు!
మినియన్, రెడ్ వెల్వెట్, నటెల్లా.. ఇలా విభిన్న కేక్స్‌ను రూపొందించడంలో పట్టున్న జాస్మిన్.. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా, గాల్లో వేలాడుతున్నట్లుగా ‘గ్రావిటీ డిఫైయింగ్ కేక్స్’ తయారుచేయడంలో సిద్ధహస్తురాలు. ఇలా తన బేకింగ్ నైపుణ్యాలకు క్రమంగా ఆదరణ పెరగడంతో ఇండోర్ వ్యాప్తంగా మరిన్ని స్టోర్స్‌ని తెరిచిన ఆమె.. అనతికాలంలోనే విభిన్న రాష్ట్రాలకూ తన వ్యాపారాన్ని విస్తరించింది.
‘ప్రస్తుతం వినియోగదారుల అభిరుచుల్ని బట్టి విభిన్న రకాల కస్టమైజ్‌డ్ కేక్స్ తయారుచేయడంతో పాటు.. మదర్స్ డే, డాటర్స్ డే, ఇతర పండగలు-ప్రత్యేక సందర్భాల కోసం కేక్స్ తయారుచేస్తున్నాం. అలాగే బ్రౌనీస్, కప్ కేక్స్, మఫిన్స్, కుకీస్, రోల్స్, పేస్ట్రీస్, మ్యాకరూన్స్.. వంటి దాదాపు అన్ని రకాల బేకరీ ఉత్పత్తులు మా వద్ద తయారవుతున్నాయి. అలాగే ఆయా సందర్భాల్లో బహుమతులివ్వడానికి ప్రత్యేకంగా గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా తయారుచేసిస్తున్నాం. ఇక మేం తయారుచేసే గ్రావిటీ డిఫైయింగ్ కేక్స్‌కి ఆదరణ ఎక్కువగా ఉంది. అయితే వీటి తయారీ కోసం వినియోగించే ప్రత్యేక ముడిసరుకుల్ని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.. అంతేకాదు.. మా వద్ద పనిచేసే చెఫ్స్‌కి ప్రత్యేకమైన శిక్షణ కూడా అందిస్తున్నాం..’ అంటున్నారీ కేక్ క్వీన్.
క్యాన్సర్ బారిన పడ్డప్పటికీ..!
ఇంతింతై అన్నట్లుగా.. తన వ్యాపారాన్ని ముంబయి, పుణే, అహ్మదాబాద్, రాయ్‌పూర్.. వంటి ప్రముఖ నగరాలకు విస్తరించారు జాస్మిన్. అయితే ఈ సమయంలోనే ఆమెకు క్యాన్సర్ నిర్ధారణ అయింది. అయినా కీమోథెరపీ, ఇతర చికిత్సలు తీసుకుంటూనే.. మరోవైపు వ్యాపారాన్నీ కొనసాగించానని చెబుతున్నారామె.
‘క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత కీమోథెరపీ చికిత్స తీసుకున్నా. చికిత్స సమయంలో విశ్రాంతి తీసుకున్నప్పటికీ.. మిగతా రోజుల్లో వ్యాపారంపై దృష్టి పెట్టేదాన్ని. ఒక రకంగా చెప్పాలంటే.. నా బేకింగ్ నైపుణ్యాలు ఆ సమయంలో నాకు ఒక థెరపీలా పని చేశాయి.. నన్ను ఒత్తిడి నుంచి బయటపడేశాయి. అలా ఏడాది పాటు అటు చికిత్స చేయించుకుంటూనే ఇటు పనిలోనూ బిజీగా ఉండేదాన్ని. ఆపై క్యాన్సర్ నుంచీ కోలుకున్నా. ప్రస్తుతం సోషల్ మీడియా, వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ ద్వారా.. రోజుకు సుమారు 600లకు పైగా కేక్స్, ఇతర బేకింగ్ ఐటమ్స్‌ని విక్రయిస్తున్నాం. ఇక ఈ రోజుల్లో సాధారణ కేక్స్ కంటే డిజైనర్ కేక్స్‌ని చాలామంది ఇష్టపడుతున్నారు. పైగా మార్కెట్లో వీటికే పోటీ ఎక్కువగా ఉంది. అందుకే మేం కూడా వీటికి మరింత సృజనాత్మకతను జోడిస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాం..’ అంటున్నారీ బేకింగ్ లవర్.
ఆ ధైర్యమే కావాలి!
ఇలా క్యాన్సర్‌ను జయించిన జాస్మిన్‌కు గతేడాది తన భర్త కూడా దూరమయ్యారు.. అయినా ఆ బాధ నుంచీ తేరుకొని వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారామె. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16 ఫ్రాంఛైజీలతో.. కోట్ల రూపాయల వ్యాపారాన్ని కొనసాగిస్తోన్న జాస్మిన్.. భవిష్యత్తులో 100 ఫ్రాంఛైజీలు నెలకొల్పడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
‘జీవితమంటేనే సవాళ్లు.. వీటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే వ్యక్తిగతంగా, కెరీర్‌లో ఎదగగలం. వ్యాపారంలో రాణించాలన్నా ఈ మొండిధైర్యమే కావాలి..’ అంటోన్న ఈ కేక్ క్వీన్.. తన బేకింగ్ నైపుణ్యాలు, వ్యాపార దక్షతకు గుర్తింపుగా.. ‘బెస్ట్ బేకరీ ఇన్ సెంట్రల్ ఇండియా’, ‘ఉత్తమ మహిళా వ్యాపారవేత్త’.. వంటి పలు అవార్డులూ అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.