Published : 20/11/2021 18:42 IST

ఇంటి చిట్కాలతోనే ఇంత అందం!

(Photo: Instagram)

తెరపై, తెర వెనుక ఎన్నో హెయిర్‌స్టైల్స్‌ ప్రయత్నిస్తుంటారు ముద్దుగుమ్మలు. జుట్టును తీరైన ఆకృతిలో తీర్చిదిద్దుకోవడానికి వివిధ రకాల కేశ సంబంధిత ఉత్పత్తుల్ని ఉపయోగిస్తుంటారు. నిజానికి వీటిలో ఉండే హానికారక రసాయనాలు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తన జుట్టును సంరక్షించుకోవడానికి తాను ఎక్కువగా ఇంటి చిట్కాలవైపే మొగ్గు చూపుతానంటోంది బాలీవుడ్‌ అందాల తార కృతీ సనన్‌. షాంపూ, కండిషనర్‌లను ఎంచుకునే విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తానంటోంది. అంతేకాదు.. తాను పాటించే చర్మ సౌందర్య రహస్యాలనూ పలు సందర్భాల్లో పంచుకుందీ బాలీవుడ్‌ బ్యూటీ.

హెయిర్‌ స్పా.. ఆయిల్‌ మసాజ్‌!

అందరు హీరోయిన్లలాగే కృతి కూడా తాను పాటించే ఆరోగ్య, ఫిట్‌నెస్‌, సౌందర్య రహస్యాలను తన ఫ్యాన్స్‌తో తరచూ పంచుకుంటుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఓ సందర్భంలో భాగంగా తన హెయిర్‌కేర్‌ టిప్స్‌ని పంచుకుందీ ముద్దుగుమ్మ.
‘అందాన్ని, జుట్టును సంరక్షించుకునే క్రమంలో నేను ఇంటి చిట్కాలకే అధిక ప్రాధాన్యమిస్తాను. నిజానికి ఇందుకు కాస్త ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే కుదరనప్పుడు ఇతర ఉత్పత్తుల్నీ వాడుతుంటాను. అందులోనూ సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన వాటినే ఎంచుకుంటా. అవకాడో, ఎర్ర ఉల్లిపాయలు, గ్రీన్‌ టీ, మునగాకు నూనె.. వాటిలో కొన్ని! ఇక జుట్టు సంరక్షణలో భాగంగా షాంపూ, కండిషనర్లను ఎంచుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. సల్ఫేట్లు, పారాబెన్‌.. వంటి హానికారక రసాయనాలు లేనివి వాడుతుంటా. ఇంట్లో తరచూ హెయిర్‌ స్పా ట్రీట్‌మెంట్లూ ప్రయత్నిస్తా. కొబ్బరి నూనెతో కురుల్ని, కుదుళ్లను మర్దన చేసుకోవడం మాత్రం మానను..’

అదే నా మేకప్‌ రిమూవర్‌!

మనం ఎంత అలసిపోయినా రాత్రుళ్లు ఇంటికొచ్చాక మేకప్‌ తొలగించుకోవడం తప్పనిసరి! నేనూ ఈ విషయంలో కచ్చితంగా ఉంటా. ఈ క్రమంలో గాఢత తక్కువగా ఉండే క్లెన్సర్‌ని ఉపయోగిస్తా. దీంతో ముఖానికి వేసుకున్న మేకప్‌ దగ్గర్నుంచి లిప్‌స్టిక్‌, కంటి మేకప్‌ దాకా.. ఇలా పూర్తిగా తొలగించుకొని.. మరోసారి ముఖాన్ని శుభ్రం చేసుకుంటా. అలాగే సన్‌స్క్రీన్‌ రాసుకోకుండా బయటికి కదలను. ఇది చర్మానికి రక్షణ కవచంలా పనిచేసి ఎండ ప్రభావం మనపై పడకుండా కాపాడుతుంది.

చర్మం పొడిబారకుండా..!

బయటి వాతావరణం వల్ల కావచ్చు.. లేదంటే ఎక్కువ సేపు ఏసీలో కూర్చోవడం వల్ల కావచ్చు.. ఇలా కారణమేదైనా చర్మం పొడిబారిపోయి నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి నేను పాటించే బ్యూటీ మంత్రం.. తరచూ మాయిశ్చరైజర్‌ రాసుకోవడం. కేవలం ముఖానికే కాదు.. బయటికి కనిపించే శరీర భాగాల్లోనూ మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకుంటా. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం, కాయగూరలతో చేసిన జ్యూసులు తాగడం నాకు అలవాటు. ఇవీ నా చర్మాన్ని ఎప్పుడూ తేమగా, తాజాగా కనిపించేలా చేస్తున్నాయి.

‘అమ్మ’ చిట్కా!

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి మా అమ్మ చెప్పిన చిట్కానే వాడుతున్నా. అదేంటంటే.. శెనగపిండి, పసుపు, బాదంపప్పులు, క్రీమ్‌, పప్పులు.. ఇవన్నీ ఉపయోగించి తను నా కోసం ప్రత్యేకంగా ఓ ఫేస్‌ప్యాక్‌ తయారుచేస్తుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇదే నా చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.

ఆహారం-వ్యాయామం!

నూనె పదార్థాలు, మసాలాలకు దూరంగా ఉంటా. సీజనల్‌ పండ్లు, సలాడ్స్‌, డ్రైఫ్రూట్స్‌, ప్రొటీన్లు అధికంగా ఉండే పదార్థాలు, ఆకుకూరలు.. వంటివి ఎక్కువగా తీసుకుంటా. మన శరీరానికి అవసరమైన రోజువారీ పోషకాలు అందినప్పుడే చర్మ ఆరోగ్యం ఇనుమడిస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో అస్సలు రాజీ పడను.

ఇక రోజూ వ్యాయామాలు నా రొటీన్‌లో ఉండాల్సిందే! ఈ క్రమంలో యోగా, ధ్యానం, డ్యాన్స్‌, కార్డియో.. వంటి వర్కవుట్లకు ప్రాధాన్యమిస్తా. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. ఫలితంగా చర్మం తాజాగా, నవయవ్వనంగా కనిపిస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని