Updated : 05/08/2021 18:24 IST

అమ్మానాన్న దూరమైనా నేను బలమైన అమ్మాయినే..!

(Image for Representation)

ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులు ఒక్క క్షణం పక్కన లేకపోతే అల్లాడిపోతారు చాలామంది పిల్లలు. మరి అలాంటిది అమ్మానాన్నలు ఇంకెప్పుడూ రారని తెలిస్తే... భోపాల్‌కు చెందిన 16 ఏళ్ల వనిశా పాఠక్‌కు మూడు నెలల క్రితం ఇదే పరిస్థితి ఎదురైంది. కరోనా మహమ్మారి ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని బలి తీసుకుంది. తనతో పాటు పదేళ్ల తమ్ముడు వియాన్‌ను ఒంటరిని చేసింది.

భోపాల్‌ టాపర్‌గా!

సాధారణంగా ఇలాంటి విషాదాల నుంచి బయటపడాలంటే ఎంతో మానసిక ధైర్యం ఉండాలి. అది కూడా ఎంత సమయం పడుతుందో చెప్పలేం. అయితే కరోనా మిగిల్చిన చీకట్లను చీల్చుకుంటూ త్వరగానే తేరుకుంది వనిశా. తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు, తమ్ముడి భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో 99.8 శాతం మార్కులు సాధించి భోపాల్‌ టాపర్‌గా నిలిచింది.

కరోనా ఆ కుటుంబాన్ని చిదిమేసింది!

కరోనా రెండో దశ ఉధృతి ఎంతోమంది జీవితాలను అంధకారంలోకి నెట్టింది. అలా మూడు నెలల క్రితం వనిశా కుటుంబాన్ని కరోనా చిదిమేసింది. ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా పనిచేస్తోన్న ఆమె తండ్రి జితేంద్ర కుమార్‌, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోన్న తల్లి సీమా పాఠక్‌ ఈ ఏడాది మేలో కొవిడ్‌తో కన్ను మూశారు. అప్పటి నుంచి తమ్ముడితో కలిసి మేనమామ దగ్గరే ఉంటూ చదువుకుంటోంది వనిశా.

అదే వారిని చివరిసారి చూడడం!

‘మేలో నా స్నేహితులందరూ పుస్తకాలు పట్టుకుని పరీక్షల కోసం ప్రిపేరవుతుంటే నేను మాత్రం విషాదంలో మునిగిపోయాను. అమ్మానాన్నలిద్దరూ పది రోజుల వ్యవధిలో నాకు దూరమయ్యారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. చిన్న చెకప్‌ కోసం వెళుతున్నాం... త్వరగా ఇంటికి వచ్చేస్తామని అమ్మానాన్నలిద్దరూ ఆస్పత్రికి వెళ్లారు. కానీ వారి బదులు వారి మరణవార్తలు ఇంటికొచ్చాయి. నేను మే 2 న అమ్మతో ఫోన్‌లో మాట్లాడాను. అయితే అదే చివరిసారి అని అసలు అనుకోలేదు. మే 4 ఉదయమే ఆమె కన్ను మూసింది. అప్పటికీ నాన్న ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ విషయాలేవీ మాకు తెలియకుండా మా బంధువులు ఎంతో గోప్యంగా ఉంచారు. మే 10న నాన్న నాకు ఫోన్‌ చేసి ‘జాగ్రత్తగా ఉండు తల్లీ’ అని చెప్పారు. మే 15న ఆయన గొంతు కూడా శాశ్వతంగా మూగబోయింది. నాన్న చనిపోయాక కానీ మాకు అసలు విషయం తెలియలేదు. అమ్మ పార్థివ దేహాన్ని కూడా చూడలేకపోయాం’ అని అప్పటి చీకటి రోజులను గుర్తుకు తెచ్చుకుంది వనిశా.

తమ్ముడికి అమ్మగా మారిపోయాను!

ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో ఆమె ఇంగ్లిష్‌, సంస్కృతం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టుల్లో 100 మార్కులు, గణితంలో 100 మార్కులు తెచ్చుకుంది. మరో ఇద్దరితో కలిసి భోపాల్‌ టాపర్‌ స్థానాన్ని పంచుకుంది. ‘అమ్మానాన్నలు లేని లోటు తీర్చలేనిది. వారు దూరమయ్యాక నా చుట్టూ చీకటి అలుముకుంది. జీవితంలో అన్నీ కోల్పోయినట్లు అనిపించింది. అదే సమయంలో వియాన్‌ను చూశాను. త్వరగా ఈ విషాదం నుంచి బయటపడి వాడి కోసం నా వంతు ఏదైనా చేయాలనుకున్నాను. ఈ క్రమంలో నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ తమ్ముడికి అమ్మగా, నాన్నగా మారిపోయాను.’

ఇప్పుడది నా కల!

‘నేను చేసే ప్రతి పనిలో అమ్మానాన్నే కనిస్తున్నారు. వారిని తలచుకోని రోజంటూ లేదు. అమ్మానాన్నలు గుర్తుకు వచ్చినప్పుడల్లా నా భావాలను పద్యాల రూపంలో అక్షరీకరిస్తున్నాను. అదే సమయంలో నా లక్ష్యం వైపు కూడా దృష్టి సారిస్తున్నాను. నాన్న నన్ను ఐఐటీలో చదివించాలనుకున్నారు. యూపీఎస్సీ పరీక్షలు రాసి దేశానికి సేవ చేయాలన్నది ఆయన కల. ఇప్పుడది నా కల కూడా! దీనిని నెరవేర్చడానికి ఎంతైనా కష్టపడతాను. అమ్మానాన్న దూరమైనా నేను బలమైన అమ్మాయినని నిరూపించుకుంటాను’ అంటోందీ చదువుల తల్లి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని