Micro Cheating: ‘జస్ట్‌ ఫ్రెండ్..’ అంటూనే మోసం చేస్తారు.. జాగ్రత్త!

మనం అంతగా పట్టించుకోం కానీ.. కొన్నిసార్లు భాగస్వామి ప్రవర్తన వింతగా, కొత్తగా అనిపిస్తుంటుంది. కొత్త స్నేహాలు, గంటల తరబడి మొబైల్‌లో చాటింగ్‌లు, మాటిమాటికీ అబద్ధాలు/తడబాటు, సందర్భం ఉన్నా లేకపోయినా మూడో వ్యక్తి....

Updated : 06 Jul 2023 18:12 IST

మనం అంతగా పట్టించుకోం కానీ.. కొన్నిసార్లు భాగస్వామి ప్రవర్తన వింతగా, కొత్తగా అనిపిస్తుంటుంది. కొత్త స్నేహాలు, గంటల తరబడి మొబైల్‌లో చాటింగ్‌లు, మాటిమాటికీ అబద్ధాలు/తడబాటు, సందర్భం ఉన్నా లేకపోయినా మూడో వ్యక్తి గురించి ప్రస్తావన, ఎవరని అడిగితే ఫ్రెండ్‌ అంటూ దాటవేయడం.. ఇవన్నీ చూసి ‘ఈయనేంటి ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నాడు..?’ అనుకుంటాం.. ‘ఫ్రెండే కదా!’ అని చూసీచూడనట్లుగా ఉండిపోతాం.. నిజానికి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మీరు మీ భాగస్వామి చేతిలో మోసపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇలా చిన్న చిన్న విషయాలతో భాగస్వామిని మోసం చేయడాన్నే ‘మైక్రో చీటింగ్‌’గా పిలుస్తారు. అయితే ఇదిలాగే కొనసాగినా, వారి విషయంలో అలసత్వం ప్రదర్శించినా దాంపత్య బంధానికే ముప్పు వాటిల్లచ్చు. అందుకే ఆదిలోనే వారి ఈ మోసపూరిత ధోరణికి కళ్లెం వేయడం ముఖ్యం. అదెలాగో తెలుసుకుందాం రండి..

దాంపత్య బంధం శాశ్వతమవ్వాలంటే ప్రతి విషయంలోనూ ఒకరిపై ఒకరికి నమ్మకముండాలి. ఈ నమ్మకంతోనే భాగస్వామికి సంబంధించిన చాలా విషయాల్లో వారికి ప్రైవసీ ఇస్తాం.. అయితే దీన్ని అలుసుగా తీసుకునే వారు.. ఈ అతి స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని భాగస్వామిని మోసం చేయడానికీ వెనకాడరు.. అంతేకాదు.. వాళ్ల ప్రవర్తన ఎక్కడా బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు కూడా! ‘మైక్రో చీటింగ్‌’గా పిలిచే ఈ తరహా మోసాలు ఈ కాలపు జంటల్లో పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇవి శాశ్వతమైన వైవాహిక బంధంలో చిచ్చు పెట్టకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

ప్రవర్తన ద్వారా పసిగట్టచ్చు!

ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తుంటారు కొందరు. మైక్రో చీటింగ్‌కి పాల్పడే వారూ ఇలాగే ప్రవర్తిస్తారంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే వారి ప్రవర్తనను సునిశితంగా పరిశీలించి.. వారు చేసే మోసాన్ని ఇట్టే పసిగట్టచ్చంటున్నారు.

అప్పటిదాకా బాగానే ఉంటారు.. అన్ని విషయాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తుంటారు. కానీ ఉన్నట్లుండి మొబైల్‌లో రహస్య పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం, ఎప్పుడూ ఫోన్‌ను వెంటే ఉంచుకోవడం, ఒకవేళ ఇంట్లో మర్చిపోయినా కంగారు పడిపోవడం, వాళ్ల ఎదుట కాల్‌ వచ్చినా ఆదుర్దా పడడం.. వంటివి చేస్తున్నారంటే.. వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారనడానికి దీన్నో సంకేతంగా పరిగణించాలంటున్నారు నిపుణులు.

సరదాగా అబద్ధాలాడుతూ భాగస్వామిని ఆటపట్టించడంలో తప్పు లేదు. కానీ కొంతమంది తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రతి విషయంలోనూ అబద్ధాలాడుతుంటారు. తాము ఎక్కడున్నారు?, ఏం చేస్తున్నారు?, ఎవరితో ఉన్నారు?.. అన్న విషయాలన్నీ రహస్యంగా ఉంచుతారు. ఇలాంటి వారి పైనా ఓ కన్నేసి ఉంచమంటున్నారు నిపుణులు.

అప్పటిదాకా అన్నింట్లోనూ ప్రశంసించిన వ్యక్తే.. ఒక్కసారిగా విమర్శించడం, ఇతరులతో మనల్ని పోల్చడం జీర్ణించుకోలేం. కానీ ‘మైక్రో చీటింగ్‌’కు పాల్పడే జీవిత భాగస్వామిలో ఇలాంటి ప్రవర్తన సహజం అంటున్నారు నిపుణులు. కాబట్టి మీ విషయంలో మీ భాగస్వామి ఇలా ప్రవర్తిస్తున్నట్లయితే.. మరో వ్యక్తి వారి జీవితంలోకొచ్చారని, తద్వారా మీరు మోసపోతున్నారని అర్థం చేసుకోండి.

ఈ కాలపు జంటల మధ్య విభేదాలు రావడానికి, వారు విడిపోవడానికి సోషల్‌ మీడియా కూడా ఓ కారణం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ భాగస్వామి ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాల్లో గడపడం, వారికి నచ్చిన వ్యక్తుల పోస్టులకు మిస్సవ్వకుండా కామెంట్లు పెట్టడం, లైక్‌లు కొట్టడం.. ఇలా ఇంతకుముందు కంటే ప్రవర్తన భిన్నంగా అనిపిస్తే మాత్రం దీన్ని మైక్రో చీటింగ్‌గా అనుమానించడంలో తప్పు లేదంటున్నారు.

‘కొత్త వింత పాత రోత’ అన్నట్లుగా.. కొత్త వ్యక్తి దగ్గరవుతున్న కొద్దీ.. జీవిత భాగస్వామిని దూరం చేస్తుంటారు కొందరు. ఈ క్రమంలో తమ భావోద్వేగాల్నీ వారితోనే పంచుకుంటుంటారు. ఇలా శారీరకంగా, మానసికంగా మీ భాగస్వామి మిమ్మల్ని దూరం పెడుతున్నారంటే.. మీరు వారి చేతిలో మోసపోతున్నట్లే లెక్క!

ఒకవేళ భాగస్వామి ప్రవర్తనపై అనుమానం వచ్చి.. అసలు విషయం ఆరా తీద్దామనుకున్నా.. ‘జస్ట్‌ ఫ్రెండ్‌’ అంటూ ఆ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు అబద్ధాలాడతారు. కాబట్టి ఇలా ప్రవర్తించే వారి పైనా నిఘా పెట్టమంటున్నారు నిపుణులు.

మిమ్మల్ని మోసం చేస్తూ.. అవతలి వారిని ఆకట్టుకోవడానికి.. అందంగా ముస్తాబవడం, హుందాగా కనిపించడం.. వంటి వాటి పైనా అతిగా శ్రద్ధ పెడుతుంటారట!

మీతో ఇంట్లో గడపడానికి అనాసక్తి చూపడమే కాదు.. మిమ్మల్ని పార్టీలు, ఫంక్షన్లకు తీసుకెళ్లడానికీ నిరాకరిస్తుంటారు. ఈ క్రమంలో వారు ఒక్కరే వెళ్లడం, లేదంటే వారి జీవితంలోకొచ్చిన కొత్త వ్యక్తిని తీసుకెళ్లడం.. వంటివి చేస్తుంటారు. ఇలా ఈ విషయంలోనూ మీరు మీ భాగస్వామి చేతిలో మోసపోయే అవకాశం ఎక్కువ!

తిరిగి దగ్గరవ్వాలంటే..

తమ భాగస్వామి మోసం చేస్తున్నారని తెలిస్తే ఎవరూ తట్టుకోలేరు. పైగా వారిపై ప్రేమ కూడా క్రమంగా తగ్గిపోతుంటుంది. నిజానికి మీరూ వారిని దూరం పెడితే అది మీ ఇద్దరిని శాశ్వతంగా దూరం చేస్తుంది. కాబట్టి వారిని క్షమించి తిరిగి వారికి దగ్గరవడానికి ప్రయత్నించమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

మీ భాగస్వామి చేసిన మోసం గురించి తెలుసుకొని వారిపై కోపగించుకోవడం కాకుండా.. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి. ఈ క్రమంలో వారు ఎందుకిలా చేస్తున్నారో కారణం కనుక్కునే ప్రయత్నం చేయండి. వారిలో ఈ మార్పు రావడానికి మీరు చేసిన పొరపాట్లేంటో గ్రహించి సరిదిద్దుకోండి. ఫలితంగా వారు తిరిగి మీ దారిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి.

ప్రేమతో ఎలాంటి మనస్తత్వాన్నైనా మార్చచ్చంటారు. ఇదే ప్రేమను మీ భాగస్వామికి అందించి చూడండి.. ఈ క్రమంలో వారు మిమ్మల్ని ఓ మాట అన్నా, దూరం పెట్టాలని చూసినా.. ఓపికతో సహించి ముందుకు సాగితే తప్పకుండా సానుకూల ఫలితం వస్తుందంటున్నారు నిపుణులు.

భాగస్వామికి ప్రతి విషయంలో అతి స్వేచ్ఛనివ్వడం, వారి ప్రైవసీని హరించడం కూడా సరికాదు. కాబట్టి భార్యాభర్తలిద్దరూ ఏ విషయంలోనైనా హద్దులు పెట్టుకోవడం, అవి దాటకుండా ఉండేలా ఒకరికొకరు నమ్మకం కలిగించడం వల్ల కూడా దాంపత్య బంధాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవచ్చు.

‘ఎంతసేపూ నా మాటే వినాలి.. నేను చెప్పిందే చేయాలి..’ అన్నట్లుగా తమ భాగస్వామికి లేనిపోని ఆంక్షలు పెడుతుంటారు కొందరు. దీనివల్ల కూడా అవతలి వారు విసుగుచెంది.. కొత్త దారి వెతుక్కోవడం, మిమ్మల్ని మోసం చేయడం.. వంటివి జరుగుతాయి. కాబట్టి భాగస్వామిపై అజమాయిషీ చెలాయించడం కాకుండా.. వారి ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యమివ్వడం, వారికి ఆసక్తి ఉన్న అంశాల్లో ప్రోత్సహించడం.. వంటివి చేస్తే.. ఇద్దరి మధ్యకు మూడో వ్యక్తి వచ్చే ఆస్కారమే ఉండదు.

ఇంటి బాధ్యతలు, ఆఫీస్‌ పనులతో.. ఈ కాలపు దంపతులకు కాస్త సమయం కేటాయించుకునే అవకాశమే దొరకట్లేదు. ఈ నిర్లక్ష్యం కూడా మైక్రో చీటింగ్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆలుమగలు తమ రోజువారీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. కాస్త సమయం గడపడం, వెకేషన్లకు వెళ్లడం తప్పనిసరి! ఇది ఇద్దరి మధ్య అన్యోన్యతను పెంచుతుంది.
అయితే ఇన్ని చేసినా మీ భాగస్వామిలో మార్పు కనిపించకపోతే మాత్రం నిపుణుల సహాయం తీసుకోవడం తప్పనిసరి! ఈ క్రమంలో కౌన్సెలింగ్‌, ఇతర థెరపీల ద్వారా వారిలో మార్పును తీసుకురావచ్చు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్