‘బాత్‌టబ్‌’ను ఇలా శుభ్రం చేద్దాం!

అసలే వర్షాకాలం. ఇంట్లో మూలమూలను పొడిగా, పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. అయితే ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బాత్‌రూమ్‌ను మాత్రం చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు.

Published : 07 Sep 2023 19:50 IST

అసలే వర్షాకాలం. ఇంట్లో మూలమూలను పొడిగా, పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. అయితే ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బాత్‌రూమ్‌ను మాత్రం చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అందులోనూ బాత్‌టబ్‌ను వినియోగించే వారు.. దాన్ని శుభ్రం చేయాలన్న విషయాన్నే విస్మరిస్తుంటారు. బాత్‌టబ్‌లో సేదదీరే క్రమంలో మన శరీరంలోని మురికికి తోడు బాత్‌రూమ్‌లోని తేమ కారణంగా.. దాని గోడలపై ఫంగస్‌ ఏర్పడుతుంది. తిరిగి అదే బాత్‌టబ్‌ని ఉపయోగిస్తే.. మన ఆరోగ్యానికే నష్టం. మరోవైపు దాని డ్రెయిన్‌ కూడా మూసుకుపోయే అవకాశాలెక్కువ! మరి, అలా జరగకుండా ఉండాలంటే దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని ఇంటి చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు.

వేడి నీళ్లలో కొద్దిగా వైట్‌ వెనిగర్‌ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాత్‌టబ్‌పై చల్లి అరగంట అలాగే వదిలేయాలి. ఆపై బ్రష్‌తో టబ్‌, డ్రెయినర్‌ని రుద్ది, ఆపై శుభ్రమైన నీటితో కడిగేస్తే బాత్‌టబ్‌ మెరిసిపోతుంది.

వెనిగర్‌, బేకింగ్‌ సోడా.. ఈ రెండింటినీ కలుపుతూ పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక స్పాంజి సహాయంతో ఈ మిశ్రమాన్ని టబ్‌ మొత్తం పూయాలి. ఇలా గంటయ్యాక రుద్ది కడిగేస్తే.. బాత్‌టబ్‌ శుభ్రపడుతుంది. దానిపై ఉన్న మొండి మరకల్ని సైతం ఈ మిశ్రమం వదలగొడుతుంది.

ముందుగా బాత్‌టబ్‌ను పావు భాగం వేడి నీళ్లతో నింపాలి. ఇందులో టేబుల్‌స్పూన్‌ బ్లీచింగ్‌ పౌడర్‌ వేయాలి. పది నిమిషాలయ్యాక టబ్‌ జెట్స్‌ (నీటిని బబుల్స్, గుండ్రంగా, వెదజల్లుతున్నట్లుగా విడుదల చేస్తాయివి) ఆన్‌ చేసి పూర్తిగా నింపాలి. ఫలితంగా బ్లీచ్‌ మిశ్రమం టబ్‌ గోడలకు బలంగా తగులుతూ, రుద్దినట్లుగా మర్దన చేస్తూ దాని గోడలకున్న మురికి, జిడ్డును వదలగొడుతుంది. ఆపై శుభ్రమైన నీటితో మరోసారి క్లీన్‌ చేస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ వల్ల బాత్‌టబ్‌ డ్రెయిన్‌ కూడా శుభ్రపడుతుంది.

లిక్విడ్‌ డిటర్జెంట్‌ లేదంటే డిటర్జెంట్‌ పౌడర్‌తోనూ బాత్‌టబ్‌ను శుభ్రం చేయచ్చు. ఈ క్రమంలో బాత్‌టబ్‌ను వేడి నీటితో నింపి.. అందులో రెండు టేబుల్‌స్పూన్ల లిక్విడ్‌ డిటర్జెంట్‌/డిటర్జెంట్‌ పౌడర్‌ వేయాలి. అరగంటయ్యాక బ్రష్‌తో రుద్దుతూ క్లీన్‌ చేస్తే టబ్‌లో పేరుకున్న మురికీ వదిలిపోతుంది.. తళతళా మెరిసిపోతుంది కూడా!

బాత్‌టబ్‌లో వేడి నీటిని నింపి.. అందులో టీస్పూన్‌ చొప్పున కాస్టిక్‌ సోడా, లిక్విడ్‌ డిటర్జెంట్‌ వేయాలి. పావుగంటయ్యాక టబ్‌ను ఖాళీ చేసి.. బ్రష్/స్క్రబ్బర్‌తో చుట్టూ రుద్దుతూ శుభ్రం చేస్తే సరిపోతుంది. ఆపై మరోసారి శుభ్రమైన నీటితో కడిగేస్తే బాత్‌టబ్‌ తళతళలాడుతుంది.

నిమ్మరసం, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని బాత్‌టబ్‌లో చల్లడం లేదంటే వేడి నీళ్లు నింపిన బాత్‌టబ్‌లో ఈ మిశ్రమాన్ని పోసి.. పావుగంటయ్యాక టబ్‌ను స్క్రబ్బర్‌తో రుద్దుతూ శుభ్రం చేస్తే.. దాని మురికి వదిలిపోతుంది. నిమ్మరసం వాడకం వల్ల సువాసనలూ వెదజల్లుతాయి.

బాత్‌టబ్‌లోనే కాదు.. దాని జాయింట్స్‌ దగ్గర ఎక్కువ మురికి పేరుకుపోతుంటుంది. ఇందుకోసం బేకింగ్‌సోడా, నీళ్లు కలిపి తయారుచేసిన పేస్ట్‌ని ఆ ప్రదేశంలో పూసి.. కాసేపయ్యాక బ్రష్‌తో రుద్ది శుభ్రం చేస్తే సరిపోతుంది.

బాత్‌టబ్‌లో స్నానం చేసే క్రమంలో మన చర్మంపై ఉండే మురికి, జిడ్డుదనం, సబ్బు నీరు, ఇతర అవశేషాలు.. దాని డ్రెయిన్‌ను బ్లాక్‌ చేస్తుంటాయి. ఇలాంటప్పుడు అరకప్పు బేకింగ్‌ సోడా, అరకప్పు వైట్‌ వెనిగర్‌ను మిశ్రమంలా చేసి డ్రెయిన్‌పై పోయాలి. కొన్ని నిమిషాలయ్యాక వేడి నీళ్లు పోస్తే.. అక్కడ పేరుకున్న మురికి తొలగిపోతుంది.. తద్వారా బ్లాక్స్‌ తెరుచుకుంటాయి.

బాత్‌టబ్‌ను శుభ్రం చేయడానికి.. సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన క్లీనింగ్‌ స్ప్రేలు మార్కెట్లో దొరుకుతాయి. వాటిని ఉపయోగించినా ఫలితం ఉంటుంది.

గమనిక : బాత్‌టబ్‌ను ఒక్కరు వాడినా.. ఇంట్లో వాళ్లందరూ వాడినా.. వారానికోసారి కచ్చితంగా శుభ్రం చేయాలంటున్నారు నిపుణులు. అలాగే అవసరం ఉన్నప్పుడే అందులో నీళ్లు నింపడం, ఆపై పని పూర్తయ్యాక దాన్ని ఖాళీ చేసేయడం వల్ల.. అందులో మురికి పేరుకుపోకుండా, ఫంగస్‌ వృద్ధి చెందకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే బాత్‌టబ్‌ను శుభ్రం చేసే ప్రతిసారీ చేతులకు గ్లౌజులు, ముక్కు-నోరు కవరయ్యేలా మాస్క్‌ ధరించడం మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్