అందుకే 8 నెలల గర్భంతో ఇలా..! 

కడుపులో నలుసు పడిందని తెలియగానే సున్నితంగా మారిపోతుంటారు కొందరు మహిళలు. కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమోనని చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా భయపడిపోతుంటారు. అయితే కొంతమంది మాత్రం నెలలు నిండుతున్న కొద్దీ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంటారు. ఇంటినీ- పనినీ సమర్థంగా బ్యాలన్స్‌ చేస్తుంటారు.

Updated : 27 Aug 2021 18:18 IST

కడుపులో నలుసు పడిందని తెలియగానే సున్నితంగా మారిపోతుంటారు కొందరు మహిళలు. కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమోనని చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా భయపడిపోతుంటారు. అయితే కొంతమంది మాత్రం నెలలు నిండుతున్న కొద్దీ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంటారు. ఇంటినీ- పనినీ సమర్థంగా బ్యాలన్స్‌ చేస్తుంటారు. రోజువారీ కూలి పనులు చేసే గర్భిణుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా ఎంతోమంది నిండు గర్భంతోనే తమ పనులు కొనసాగించడం మనం చూస్తూనే ఉన్నాం.

8 నెలల గర్భంతో షూటింగ్స్‌కి..!

తాజాగా బాలీవుడ్‌ నటి నేహా ధూపియా కూడా అదే చేసింది. త్వరలో రెండోసారి అమ్మ కాబోతున్న ఈ ముద్దుగుమ్మ...ఎనిమిది నెలల గర్భంతో సినిమా షూటింగ్స్‌కి హాజరవుతోంది...అదీ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో. ఈ నేపథ్యంలో నేటితో (ఆగస్టు 27) 41వ వసంతంలోకి అడుగుపెడుతోన్న ఈ అందాల తార తన గర్భం, మూడేళ్ల కూతురు మెహ్ర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

అందుకే ఇలా చేస్తున్నాను!

2018లో నటుడు అంగద్‌ బేడీని ప్రేమ వివాహం చేసుకున్న నేహ అదే ఏడాది మెహ్ర్‌ అనే ముద్దుల పాపాయికి జన్మనిచ్చింది. ఇక ఈ ఏడాది జులైలో రెండోసారి గర్భం దాల్చినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. గతంలో బ్రెస్ట్‌ ఫీడింగ్, బాడీ షేమింగ్‌ విషయాల్లో మహిళలకు స్ఫూర్తినిచ్చే సందేశాలిచ్చిన ఈ సూపర్‌ మామ్ ప్రస్తుతం 8 నెలల గర్భంతో ఉంది. అయినా నటనకు విరామం ఇవ్వకుండా ఉత్సాహంగా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటోంది.

‘కొవిడ్‌ ప్రతికూల పరిస్థితుల్లో సినిమా చిత్రీకరణలకు హాజరవ్వడం ఇబ్బందిగానే ఉంటోంది. పైగా నేను మూడో త్రైమాసికంలో ఉన్నాను. చాలా అలసటగా అనిపిస్తోంది. అయితే నేను నా విధులు సమర్థంగా నిర్వర్తించగలిగితే నన్ను చూసి మరికొంతమంది మహిళలు స్ఫూర్తి పొందుతారు. అందుకే ఇలా నిర్విరామంగా షూటింగ్స్‌కి హాజరవుతున్నాను.’

నేను అలా ఖాళీగా కూర్చోలేను!

‘మహిళలు ఇంటి బాధ్యతలతో పాటు వృత్తిగత పనులను కూడా సమర్థంగా నిర్వహించుకోగలరు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల చాలామంది మహిళలు పర్సనల్‌ /ప్రొఫెషనల్‌ లైఫ్‌లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి వస్తోంది. దాదాపు నా పరిస్థితి కూడా ఇదే. అయితే నేను నా పనిని, ప్రైవేట్‌ లైఫ్‌ను సమర్థంగా సమన్వయం చేసుకుంటే ఇండస్ట్రీలో మహిళలపై ఉన్న దృక్పథం మారిపోతుంది. ముఖ్యంగా గర్భిణులకు సినిమా ఇండస్ట్రీలో మరిన్ని మంచి అవకాశాలు, పాత్రలు వస్తాయనుకుంటున్నాను. ఇక గర్భంతో ఉన్న మహిళలు ఇంటికే పరిమితమవ్వాలన్న భావనలకు నేను పూర్తిగా వ్యతిరేకం. అసలు మేం అలా ఎందుకు ఇంట్లోనే ఉండాలి? ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితులు, పనులతో పోల్చుకుంటే నాకు ఎంతో విశ్రాంతి కావాలి. కానీ నేను అలా ఖాళీగా కూర్చోలేను. మీరు కూడా అలా చేయద్దు. కడుపుతో ఉన్నంత మాత్రాన మహిళ తన కెరీర్‌, ఆశలను కోల్పోకూడదు. ఇందుకు నేను ఉదాహరణగా నిలవాలని అనుకుంటున్నాను. మరికొంతమంది నా దారిలో నడుస్తారని ఆకాంక్షిస్తున్నాను.’

నేను సూపర్‌ ప్రెగ్నెంట్‌ని!

‘ఇక నా పుట్టిన రోజు ప్రణాళికలంటూ పెద్దగా ఏమీ లేవు. సరదాగా గడిపేందుకు మా ఫ్యామిలీ అంతా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నాం. మరీ దూరం కాకుండా ఓ 2-3 గంటల ప్రయాణం చేద్దామనుకుంటున్నాం. ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితుల్లో ఇంతకు మించి ఎక్కువ ప్రయాణం చేయకూడదు. సాధారణంగా నా పుట్టిన రోజు అంటే ఎక్కడైనా లాంగ్‌ వెకేషన్స్‌కి వెళ్లేవాళ్లం. అయితే గత రెండేళ్లుగా ఆ అవకాశం రావడం లేదు. గతేడాది కరోనా కారణంగా ముంబయిని విడిచిపెట్టి వెళ్లలేకపోయాం. ఈసారి కూడా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే నేను ప్రస్తుతం సూపర్‌ ప్రెగ్నెంట్‌ని’ అని అంటోందీ సూపర్‌ మామ్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్