అమ్మాయిలు చదువుకు దూరం కాకూడదని!

చాలామంది తల్లిదండ్రులు తమ అబ్బాయిలను కార్పొరేట్‌ స్కూళ్లు, ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తే అమ్మాయిలను మాత్రం ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారు. కొందరైతే ‘అమ్మాయిలకు చదువెందుకు?’ అని అది కూడా చేయరు.

Published : 22 Sep 2021 18:12 IST

(Photo: Instagram)

చాలామంది తల్లిదండ్రులు తమ అబ్బాయిలను కార్పొరేట్‌ స్కూళ్లు, ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తే అమ్మాయిలను మాత్రం ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారు. కొందరైతే ‘అమ్మాయిలకు చదువెందుకు?’ అని అది కూడా చేయరు. ఈ క్రమంలో చిన్నప్పటి నుంచి ఇలాంటి అసమానతలను చూస్తూ పెరిగిన నిషితా రాజ్‌పుత్‌ భవిష్యత్‌లోనైనా వీటికి తెరదించాలంటోంది. అందుకే ఆడపిల్లల చదువు కోసం విస్తృతంగా విరాళాలు సేకరిస్తోంది!

రూ.3.80 కోట్ల విరాళాలు

‘నువ్వు నీళ్లను దానం చేస్తే ఓ 5-6 గంటల వరకు తాగచ్చు. అదే ఆహారం అందిస్తే 2-3 రోజుల వరకు తినవచ్చు. ఇక దుస్తులు వితరణ చేస్తే ఓ 2-3 ఏళ్ల వరకు వినియోగించుకోవచ్చు. అదే విద్యను అందిస్తే రాబోయే ఏడు తరాల జీవితాలను మార్చవచ్చు. అందుకే అన్ని దానాల్లో కెల్లా విద్యాదానం గొప్పది’ అని అంటుంది వడోదరకు చెందిన 29 ఏళ్ల నిషితా రాజ్‌పుత్‌. ఈ క్రమంలోనే గత 11 ఏళ్ల కాలంలో ఏకంగా 3.80 కోట్ల రూపాయలను విరాళాలుగా సేకరించింది. భవిష్యత్‌లో అమ్మాయిల చదువుకు ఏ ఆటంకం కలగకుండా ఈ మొత్తాన్నంతా ఓ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసింది.

పెళ్లి డబ్బులు కూడా అందుకే!

మరి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు అందుతున్నప్పుడు నిషిత వెనక స్వచ్ఛంద సంస్థలు/ఫౌండేషన్లు ఏమైనా ఉన్నాయేమోనని చాలామంది అనుకోవచ్చు. కానీ ఆమెకు ఎలాంటి ఎన్‌జీవో/ ఫౌండేషన్లతోనూ సంబంధం లేదు. కేవలం తండ్రి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తోంది. ఇక ఇటీవల దాంపత్య బంధంలోకి అడుగుపెట్టింది నిషిత. పెళ్లిలో ఎలాంటి హంగులు, ఆర్భాటాలకు చోటివ్వకుండా సింపుల్‌గా తన పెళ్లి తతంగాన్ని పూర్తి చేసింది. ఈ డబ్బులతో ఒక్కొక్కరి పేరు మీద రూ.5 వేల చొప్పున మొత్తం 21 మంది పేరున ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేసింది.

వారు చదువుకు దూరం కాకూడదు!

‘చిన్నప్పుడు అమ్మానాన్నలు నా పుట్టిన రోజు వేడుకలను అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో నిర్వహించేవారు. ఇక చదువనేది అందరి ప్రాథమిక హక్కు. కానీ చాలామంది అమ్మాయిలు పేదరికం, లింగ వివక్ష కారణంగా విద్యకు దూరమవ్వడం నన్ను బాధించింది. అందుకే నేను కూడా ‘బేటీ బచావో బేటీ పడావో అభియాన్‌’లో భాగమయ్యాను. చిన్నప్పుడు నా పుట్టిన రోజుతో పాటు ప్రత్యేక సందర్భాలొచ్చినప్పుడల్లా బాలికల విద్య కోసం విరాళాలు సేకరించాను.’

పారదర్శకత ఉండాలని!

‘నేను సోషల్‌ వర్క్‌లో డిగ్రీ పట్టా అందుకున్నాను. ఆ తర్వాత బరోడాలోని MSU (ది మహారాజ సయాజీ రావ్‌ యూనివర్సిటీ) నుంచి లేబర్‌ స్టడీస్‌లో డిప్లొమా పూర్తి చేశాను. ఇక అమ్మాయిల కోసం ప్రస్తుతం జరుగుతున్న క్యాంపెయిన్‌ 11 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. మొదట 151 మంది బాలికల చదువు కోసం విరాళాలు సేకరిద్దామనుకున్నాను. ఇంటింటికీ వెళ్లి నా ఉద్దేశాన్ని వివరించాను. మొదట చాలా తక్కువమంది స్పందించారు. అయితే క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ పోయింది. ఇప్పుడు దేశ, విదేశాల నుంచి కూడా విరాళాలు అందిస్తున్నారు. నేను విరాళాల సేకరణ, వినియోగంలో పారదర్శకత ఉండాలని కోరుకుంటాను. అందుకే దాతలు విరాళమిచ్చిన తర్వాత వారి డబ్బుతో చదువుకుంటోన్న అమ్మాయి పేరు, వారి తల్లిదండ్రులు, కుటుంబ పరిస్థితుల వివరాలను సమగ్రంగా దాతలకు అందిస్తాను. అంతేకాదు.. అమ్మాయికి సంబంధించిన పరీక్ష, అకడమిక్‌ ఫలితాలను కూడా పంపుతాను. ఇలా పారదర్శకత పాటించడం వల్ల మరికొందరు దాతలు ముందుకు వస్తారని నా అభిప్రాయం. కొంతమంది దాతలు డబ్బులు కాకుండా స్కూల్‌ బ్యాగులు, నోట్‌ బుక్స్‌, వాటర్‌ బాటిల్స్, దుస్తులు తదితర విద్యా సామగ్రిని అందిస్తున్నారు. నేను ఎలాంటి స్వచ్ఛంద సంస్థ/ఫౌండేషన్లు నిర్వహించడం లేదు. పాఠశాలలు, దాతల మధ్య నేను జస్ట్‌ ఒక వారధిలా పనిచేస్తున్నాను.. అంతే’ అంటోందీ యంగ్‌ లేడీ.

గత 11 ఏళ్ల కాలంలో మొత్తం 3.80 కోట్ల రూపాయలను విరాళాలుగా సేకరించింది నిషిత. వీటిని 34, 500 మంది విద్యార్థినుల స్కూల్‌ ఫీజ్‌ పేరుతో బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేసింది. ఇక కరోనా కాలంలో పది, ఇంటర్ విద్యార్థినుల ఆన్‌లైన్‌ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్లు కూడా పంపిణీ చేసింది. అదేవిధంగా వృద్ధులు, అనాథల కడుపు నింపేందుకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్