Updated : 14/09/2021 18:38 IST

వీటిని మళ్లీ పెంచుకోవచ్చు..

కూరగాయల్ని, పండ్లని కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన కాడల్ని, ముచ్చికలని పడేయడం సాధారణంగా అందరూ చేసే పనే. అయితే కొన్ని రకాల కూరగాయలను పడేయకుండా తిరిగి మనం మట్టిలో పాతితే వాటి ఫలాల్ని తిరిగి పొందచ్చు. లేదంటే చిన్న చిన్న కుండీల్లో పాతి కిచెన్ గార్డెన్‌లా కూడా పెంచుకోవచ్చు. ఇంతకీ కట్‌చేసిన తర్వాత నాటితే, తిరిగి పెరిగే కూరగాయలు, పండ్ల మొక్కలు ఏంటి? వాటిని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం రండి...

క్యారట్

క్యారట్‌ను కోసేటప్పుడు పైన ఉండే ముచ్చిక లాంటి భాగాన్ని వేరు చేసి పడేస్తాం. ఇలా చేయడం కంటే దాన్ని ఒక చిన్న కుండీలో పాతిపెట్టడం ద్వారా క్యారట్ మొక్కలు పెంచుకోవచ్చు. క్యారట్ పైభాగాన్ని కాస్త కండ ఉండేలా కట్ చేసుకోవాలి. దీన్ని నీళ్లు పోసిన ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాలి. అయితే నీరు మరీ ఎక్కువ కాకుండా అడుగు భాగం మాత్రమే తడిసేలా ఉంటే సరిపోతుంది. ఈ డబ్బాను ఎండ తగిలేలా ఉంచితే క్యారట్ ముక్కపై చిన్న చిన్న ఆకులు వస్తాయి. అవి కాస్త పెరిగిన తర్వాత దాన్ని నేరుగా మట్టిలో పాతిపెడితే క్యారట్ మొక్క పెరుగుతుంది. రెండు, మూడు నెలల్లో క్యారట్లు పెరిగి, మళ్లీ కూరకు సిద్ధంగా ఉంటాయి.


కొత్తిమీర

ఎంత బాగా వండినా అందులో కాస్త కొత్తిమీర వేయకపోతే అది అంత రుచిగా అనిపించదు. అందుకే దాదాపు అన్ని రకాల వంటల్లోనూ కొత్తిమీరను ఉపయోగిస్తుంటాం. అయితే కొందరు కొత్తిమీర కాడల్ని వేరు చేసి వేర్లు, కాడలు ఉండే కింది భాగాన్ని పడేస్తుంటారు. అలాంటి వారు చిన్న కుండీలో మట్టి పోసి వాటిని పాతి పెడితే అవి తిరిగి పెరుగుతాయి.


ఉల్లికాడలు

ఇటీవలి కాలంలో వంటకాల్లో ఉల్లికాడలను ఉపయోగించడం పరిపాటిగా మారిపోయింది. వీటిని తరిగేటప్పుడు చాలామంది కింద వేర్లున్న భాగాన్ని పడేస్తుంటారు. అలా కాకుండా ఎండ తగిలే చోట దాన్ని నాటి,రోజూ కొన్ని నీళ్లు పోస్తే తిరిగి ఉల్లికాడలు పెరుగుతాయి. ఫలితంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా ఉన్న కాడలను కూరల్లో ఉపయోగించవచ్చు. కాస్త పాడయ్యాయి లేదా మురిగిపోతున్నాయి అనేవిధంగా ఉన్న ఉల్లిపాయలను భూమిలో పాతినా కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి.


అల్లం

వంటల్లో ఎక్కువగా ఉపయోగించే వాటిలో అల్లం కూడా ఒకటి. ఒక చిన్న అల్లం ముక్కను మట్టి నింపిన కుండీలో ఉంచాలి. కుండీ ఎప్పుడూ తేమగా ఉండేలా చూడాలి. అలా అని నీరు మరీ ఎక్కువగా పోయకూడదు. కొంత కాలం పోయిన తర్వాత దాని నుంచి చిగుళ్లు వచ్చి మొక్క పెరగడం ప్రారంభిస్తుంది. తర్వాత మట్టి లోపల అల్లం పెరుగుతుంది. ఎప్పుడైనా అవసరం అయినపుడు అల్లం పూర్తిగా తీసేయకుండా కావల్సినంత తీసుకొని తిరిగి మట్టితో కప్పాలి.


పైనాపిల్

పైనాపిల్‌ని ముక్కలుగా కోసేటప్పుడు ఆకులను తీయడానికి కొంత భాగం వేరుచేస్తాం. దాన్ని కూడా భూమిలో పాతి ఉంచితే పైనాపిల్‌ని మనమే పండించుకోవచ్చు. వేరుచేసిన పైనాపిల్ భాగాన్ని ఆకులు పైకి వచ్చేలా మట్టిలో పాతి ఉంచితే సరిపోతుంది. కొన్నాళ్లకు మొక్క పెరుగుతుంది.


గోంగూర కాడలు..

గోంగూర ఆకులు కోసిన తర్వాత వాటి కాడలను పడేస్తూ ఉంటాం. అలా కాకుండా వాటిని తిరిగి నేలలో పాతినట్లయితే రెండు మూడు రోజుల్లో అవి చిగుర్లు తొడుగుతాయి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గోంగూర ఆకులను కోసి ఉపయోగించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని