అలా తన గ్రామ ప్రజలకు వ్యాక్సిన్‌ వేయించింది!

కరోనా వ్యాక్సిన్‌పై ఎంతగా అవగాహన పెంచుతున్నా.. ఇప్పటికీ కొన్ని గిరిజన గ్రామాలు ఈ టీకా గురించిన అపోహలు-భయాలతోనే సావాసం చేస్తున్నాయి. ఆ జాబితాలో మొన్నటిదాకా కేరళలోని పనియార్‌ కమ్యూనిటీ కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ తెగలో వంద శాతం టీకా కార్యక్రమం పూర్తయింది. నిజానికి దీని వెనుక అస్వతీ మురళి అనే గిరిజన అమ్మాయి కృషి ఎంతో ఉంది.

Updated : 23 Nov 2021 15:04 IST

(Photo: Twitter)

కరోనా వ్యాక్సిన్‌పై ఎంతగా అవగాహన పెంచుతున్నా.. ఇప్పటికీ కొన్ని గిరిజన గ్రామాలు ఈ టీకా గురించిన అపోహలు-భయాలతోనే సావాసం చేస్తున్నాయి. ఆ జాబితాలో మొన్నటిదాకా కేరళలోని పనియార్‌ కమ్యూనిటీ కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ తెగలో వంద శాతం టీకా కార్యక్రమం పూర్తయింది. నిజానికి దీని వెనుక అస్వతీ మురళి అనే గిరిజన అమ్మాయి కృషి ఎంతో ఉంది. వ్యాక్సిన్‌ అంటేనే భయపడిపోయే ఆ గిరిజన ప్రజల్లో తనదైన రీతిలో అవగాహన పెంచి వాళ్లు పూర్తిస్థాయిలో టీకా వేసుకునేలా ప్రోత్సహించిందామె. మరి, ఇదంతా తనకు ఎలా సాధ్యమైందంటే..?!

కేరళలోని వయనాడ్‌ జిల్లాలో మట్టోలీ అనే గ్రామం ఉంది. అక్కడ నివసించే గిరిజన తెగే పనియార్‌ కమ్యూనిటీ. అస్వతీ మురళి కూడా ఇదే తెగకు చెందిన అమ్మాయి. ప్రస్తుతం ఆమె అక్కడి ‘రేడియో మట్టోలీ (90.4 FM)’ అనే కమ్యూనిటీ రేడియో సర్వీస్‌లో రేడియో జాకీగా పనిచేస్తోంది. అయితే అన్ని గిరిజన గ్రామాల్లోలాగే ఈ తెగ వారిలోనూ కొవిడ్‌ టీకాకు సంబంధించిన భయాలు, అపోహలు ఉండేవి. దీంతో వాళ్లు వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో తానే రంగంలోకి దిగింది ఆర్జే అస్వతి.

అనువదిస్తూ అవగాహన..!

సాధారణంగా పనియార్‌ కమ్యూనిటీ ప్రజలు మాట్లాడే భాష పనియా. అయితే కరోనా టీకాకు సంబంధించిన సమాచారమంతా ఇంగ్లిష్‌, హిందీ, ఆయా రాష్ట్రాల అధికార భాషల్లోనే ఉండడంతో ఈ గ్రామ ప్రజలకు టీకా గురించి అవగాహన కొరవడింది. దీంతో లేనిపోని అపోహలతో వ్యాక్సిన్‌ వేసుకోవడానికి అక్కడి ప్రజలు నిరాకరించేవారు. ఈ సమయంలోనే తన కమ్యూనిటీ ప్రజల్లో అవగాహన పెంచాలనుకుందామె. ఇందులో భాగంగానే కొవిడ్‌ లక్షణాలు, జాగ్రత్తలు, వ్యాక్సిన్‌ ప్రాముఖ్యత గురించిన సమాచారమంతా పనియా భాషలోకి తర్జుమా చేసి రేడియోలో విడమరచి చెప్పేది అస్వతి.
‘ఎనిమిదో తరగతిలో ఉన్నప్పట్నుంచే నాకు రేడియో వినడం అలవాటు. ఇప్పటికీ టీవీ చూడడం కంటే రేడియో వినడానికే ఆసక్తి చూపిస్తా. పైగా మా తెగ ప్రజలకు కొవిడ్‌ గురించిన సమాచారం చేరవేయాలంటే ఉన్న ఏకైక ఆధారం కూడా రేడియోనే! కాబట్టి మా గ్రామంలో టీకా కార్యక్రమం చేపట్టినప్పుడల్లా.. ప్రజల్లో వ్యాక్సిన్‌పై ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం చేసేదాన్ని. ఈ క్రమంలో ప్రభుత్వం అందించిన సమాచారంతో పాటు డాక్టర్ల టాక్‌షోలు కూడా వినేదాన్ని. నిపుణులతో మాట్లాడేదాన్ని. ఇలా సేకరించిన సమాచారాన్ని ఓ పేపర్‌పై రాసుకొని.. దాన్ని తిరిగి పనియా భాషలోకి తర్జుమా చేసుకొని రేడియోలో వారికి వివరించేదాన్ని..’ అంటూ చెప్పుకొచ్చిందీ ఆర్జే.

‘వంద శాతం’ సక్సెసైంది!

అయితే టీకా గురించి పనియార్‌ ప్రజల్లో అవగాహన పెంచి వారిని వ్యాక్సిన్‌ వేసుకునేలా ఒప్పించడం అంత సులువు కాలేదంటోంది అస్వతి. ‘గ్రామ ప్రజల దాకా ఎందుకు? మా ఇంట్లో మా నాయనమ్మే టీకా దుష్ప్రభావాలకు భయపడి వ్యాక్సిన్‌ వేయించుకోనని మొండికేసింది. కానీ నచ్చజెప్పి దగ్గరుండి మరీ నేనే తనకు వ్యాక్సిన్‌ వేయించాను. ఆ తర్వాత మా గ్రామంలో వ్యాక్సిన్‌ భయం ఉన్న ప్రతి ఒక్కరికీ మా నాయనమ్మనే ఉదాహరణగా చూపించాను.. టీకా పట్ల వారిలో నమ్మకాన్ని పెంచాను. క్రమంగా ఒక్కొక్కరిలో మార్పు రావడం మొదలైంది. వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ముందుకొచ్చారు. అలా ప్రస్తుతం మా గ్రామంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సంపూర్ణమైంది. ఓ ఆర్జేగా మా గ్రామ ప్రజలకు ఏదో ఒక మంచి పని చేయాలని ముందు నుంచీ అనుకునేదాన్ని. అది ఈ విధంగా ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది..’ అంటోందీ ట్రైబల్‌ గర్ల్‌.

కేవలం ఇలాంటి మారుమూల గిరిజన గ్రామాలే కాదు.. పట్టణాలు, నగరాల్లోనూ నేటికీ కొంతమందిలో కొవిడ్‌ టీకా గురించిన అపోహలు నెలకొన్నాయి. ఇలాంటివి తొలగిపోవాలంటే అస్వతిలా మనం కూడా మనకు తెలిసిన మార్గాల్లో చుట్టూ ఉన్న వారిలో అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్