Shruti Haasan: పీసీఓఎస్ ఉంది.. అయినా ఆందోళన పడడం లేదు..!
చాలామంది మహిళలు తమ వ్యక్తిగత ఆరోగ్య సమస్యల గురించి నలుగురిలో మాట్లాడడానికి సిగ్గుపడుతుంటారు. దీనివల్ల సమస్య ఎక్కువవడంతో పాటు ఇతర అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే అది ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా నిర్మొహమాటంగా.....
(Photos: Instagram)
చాలామంది మహిళలు తమ వ్యక్తిగత ఆరోగ్య సమస్యల గురించి నలుగురిలో మాట్లాడడానికి సిగ్గుపడుతుంటారు. దీనివల్ల సమస్య ఎక్కువవడంతో పాటు ఇతర అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే అది ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా నిర్మొహమాటంగా బయటికి చెప్పాలంటోంది టాలీవుడ్ బ్యూటీ శృతీ హాసన్. ఈ సలహా ఇవ్వడమే కాదు.. తానూ ఎన్నోసార్లు తనకున్న పలు అనారోగ్యాల గురించి నోరు విప్పింది కూడా! ఇప్పటికే వివిధ సందర్భాలలో తన పీసీఓఎస్ సమస్య గురించి బయటపెట్టిన శృతి.. ఇంకా ఈ సమస్యతో పోరాటం చేస్తున్నానంటూ ఇటీవలే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే చక్కటి జీవనశైలితో దీన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నానంటూ.. తాను పాటిస్తోన్న పలు చిట్కాల్ని కూడా పంచుకుందీ బ్యూటీ. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
అంగీకరిస్తేనే పోరాడగలం!
అది ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా.. మన శరీరంలోని మార్పుల్ని అంగీకరిస్తేనే దాంతో పోరాడగలం అంటోంది శృతి. జిమ్‌లో వర్కవుట్ చేస్తోన్న వీడియోను పోస్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. పీసీఓఎస్‌తో ప్రస్తుతం తాను చేస్తోన్న పోరాటం గురించి ఇలా పంచుకుంది. ‘పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ సమస్యలతో ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్నా. వీటి మూలంగానే నా శరీరంలో హార్మోన్ల అసమతుల్యత తలెత్తింది. జీవక్రియలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అయితే వీటిని అధిగమించాలంటే మన శరీరంలోని మార్పుల్ని అంగీకరించడం ముఖ్యం. ప్రస్తుతం నేను చేస్తోంది కూడా అదే! నా శరీరాన్ని నేను విమర్శించకుండా.. వీటి నుంచి బయటపడేందుకు నా ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకున్నా.. కంటి నిండా నిద్ర పోవడంతో పాటు, చక్కటి వర్కవుట్ రొటీన్‌ను పాటిస్తున్నా. ప్రస్తుతం నేను శారీరకంగా ఫిట్‌గా లేకపోవచ్చు.. కానీ నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇలా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే శరీరంలో హ్యాపీ హార్మోన్లు ప్రేరేపితమవుతాయి. ఫలితంగా ఎలాంటి అనారోగ్యాలనైనా అధిగమించచ్చు..’ అంది శృతి. ఇలా బాడీ పాజిటివిటీ గురించి తనదైన రీతిలో అందరిలో స్ఫూర్తి నింపిందీ చక్కనమ్మ.
టీనేజ్‌లో ఉన్నప్పుడే..
శృతి తనకున్న వ్యక్తిగత ఆరోగ్య సమస్యల గురించి బయటపెట్టడం ఇది తొలిసారేమీ కాదు. తాను టీనేజ్‌లో ఉన్నప్పుడే ఎండోమెట్రియోసిస్ (గర్భాశయం లోపల పెరిగే కణజాలం), డిస్‌మెనోరియా (నెలసరి సమయంలో అధిక రక్తస్రావం వల్ల విపరీతమైన నొప్పి రావడం).. వంటి ప్రత్యుత్పత్తి సమస్యల బారిన పడ్డానంటూ ఓ సందర్భంలో పంచుకుందామె.
‘అప్పటిదాకా చలాకీగా ఆడిపాడే నా జీవనశైలిని నా తొలి పిరియడ్ పూర్తిగా మార్చేసింది. అదే సమయంలో ఎండోమెట్రియోసిస్, డిస్‌మెనోరియా.. వంటి సమస్యల బారిన పడ్డాను. ఈ రెండూ గర్భాశయం, ప్రత్యుత్పత్తి అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపేవే! దాంతో భరించలేనంత నొప్పి వచ్చేది. ఈ అసౌకర్యంతోనే పదే పదే స్కూల్ మానేసేదాన్ని. వీటి నుంచి బయటపడేందుకు ఏళ్లుగా హార్మోన్ల మందులు, గర్భనిరోధక మాత్రలు వాడుతున్నా. వీటితో నొప్పైతే సగానికి సగం తగ్గించుకోగలిగాను.. కానీ గర్భనిరోధక మాత్రల వల్ల బరువు పెరగడం, మూడ్ స్వింగ్స్.. వంటి దుష్ప్రభావాల్ని ఎదుర్కొన్నా. ఇక నా 26 ఏళ్ల వయసులో వీటికి పీసీఓఎస్ కూడా తోడైంది. బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, యాంగ్జైటీ.. వంటి దుష్ప్రభావాల కారణంగా ఒక దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. కొంతమంది మహిళలకు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, హోమియోపతి, సహజ పద్ధతులు.. వంటివి పని చేస్తాయి. కానీ నా విషయంలో ఫలితం కనిపించలేదు.
ఈ వ్యాయామాలు మేలు చేశాయి!
పీసీఓఎస్‌తో సుమారు 10 కిలోలు పెరిగిన నేను.. నా శరీరాకృతి విషయంలో పలు విమర్శల్ని సైతం ఎదుర్కొన్నా. ఒక దశలో నా శరీరాన్ని నేనే అసహ్యించుకునే స్థితికి చేరుకున్నా. కానీ ఆ తర్వాత రియలైజ్ అయి.. నన్ను నేను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టా. ఈ క్రమంలో యోగా, స్క్వాట్స్.. వంటి వ్యాయామాలు నాకు మేలు చేశాయి. ఇక నెలసరి నొప్పుల్ని అధిగమించడానికి హిప్ మొబిలిటీ వ్యాయామాలు దోహదం చేశాయి. ఇప్పటికీ నిపుణుల సలహా మేరకు కొన్ని రకాల సప్లిమెంట్స్ వేసుకుంటున్నా. అలాగే మానసిక దృఢత్వాన్ని పెంచుకోవడానికి సంగీతం నాకు ఉపయోగపడింది. ఇలా ఏళ్లు గడిచే కొద్దీ నాలో పాజిటివిటీ పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు పిరియడ్ అంటే విసుగు చెందిన నేను.. ఇప్పుడు దీన్ని నా బలంగా, ప్రత్యుత్పత్తి చిహ్నంగా భావిస్తున్నా. ఇదంతా నా శరీరంలో జరిగే మార్పుల్ని గుర్తించి, అర్థం చేసుకొని, అంగీకరించడం వల్లే సాధ్యమైంది..’ అంటూ చెప్పుకొచ్చింది శృతి. ఇలా ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని తాము ప్రేమించుకోవడం వల్ల ఆరోగ్యపరంగా, మానసికంగా ఎన్నో సమస్యల్ని అధిగమించచ్చంటూ తన అనుభవాలతో స్ఫూర్తి నింపిందీ టాలీవుడ్ బ్యూటీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.