శ్రావణం.. జాగ్రత్తగా ఉంటేనే శుభప్రదం!

పచ్చ తోరణాలు, నిత్య పూజలు, అతివల సంప్రదాయ కట్టూబొట్టు, పండగలు, పర్వదినాలు, పెళ్లిళ్లు, పేరంటాలు.. వంటివన్నింటికీ ఆలవాలం 'శ్రావణ మాసం'. ఈ నెలలో మహిళలకు ప్రతిరోజూ పండగే. ఇక మహిళలెంతో భక్తిశ్రద్ధలతో, నిష్ఠగా చేసే 'వరలక్ష్మీ వ్రతం', 'మంగళగౌరీ వ్రతం'.. మరింత ప్రత్యేకం. అయితే ఈ కంప్యూటర్ యుగంలో మహిళలు ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. శ్రావణంలో ఆచరించే పూజా పునస్కారాలకు మాత్రం ఎలాంటి లోటూ లేకుండా కొనసాగిస్తున్నారు.

Published : 09 Aug 2021 15:52 IST

పచ్చ తోరణాలు, నిత్య పూజలు, అతివల సంప్రదాయ కట్టూబొట్టు, పండగలు, పర్వదినాలు, పెళ్లిళ్లు, పేరంటాలు.. వంటివన్నింటికీ ఆలవాలం 'శ్రావణ మాసం'. ఈ నెలలో మహిళలకు ప్రతిరోజూ పండగే. ఇక మహిళలెంతో భక్తిశ్రద్ధలతో, నిష్ఠగా చేసే 'వరలక్ష్మీ వ్రతం', 'మంగళగౌరీ వ్రతం'.. మరింత ప్రత్యేకం. అయితే ఈ డిజిటల్‌ యుగంలో మహిళలు ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. శ్రావణంలో ఆచరించే పూజా పునస్కారాలకు మాత్రం ఎలాంటి లోటూ లేకుండా కొనసాగిస్తున్నారు. మరి, ఇంతటి వైశిష్ట్యం కలిగిన ఈ మాసం ప్రాముఖ్యం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి...

పవిత్రమాసం

భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు పెట్టింది పేరు. అందులోనూ హిందూ క్యాలండర్ ప్రకారం వచ్చే ఐదో మాసమైన శ్రావణం అంటే తెలుగువారికి.. అందులోనూ మహిళలకైతే మరింత ప్రియం. అందుకే మహిళలంతా ఈ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఇటు ఇంట్లోనూ, అటు దేవాలయాల్లోనూ నిత్య పూజలు నిర్వహిస్తుంటారు. అంతేకాదు.. నిష్ఠగా భావించి ఉపవాస దీక్ష చేస్తారు. వారి కుటుంబం అష్త్టెశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని అతివలు ఈ మాసంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణంలో లక్ష్మీదేవిని మనసారా పూజిస్తే సకల సిరి సంపదలు చేకూరతాయని వారి నమ్మకం.

ప్రతిరోజూ ప్రత్యేకమే!

మహిళలు అత్యంత పవిత్రంగా, ప్రత్యేకంగా భావించే శ్రావణమాసంలో ప్రతిరోజుకూ ఓ ప్రత్యేకత ఉంది. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే శ్రవణా నక్షత్రంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. మాఘమాసంలో ఆదివారాలు, కార్తీకమాసంలో సోమవారాలు, మార్గశిర మాసంలో గురువారాలకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో.. అదేవిధంగా శ్రావణమాసంలో అమ్మవారికి ప్రియమైన మంగళ, శుక్రవారాలతో పాటు మిగిలిన రోజులని కూడా పవిత్రంగానే భావిస్తుంటారు తెలుగు పడుచులు.

పూజలు-వ్రతాలు

శ్రావణమాసంలో మహిళలు నిత్యపూజలతో పాటు మంగళవారం 'మంగళగౌరీ వ్రతం', శుక్రవారం 'వరలక్ష్మీ వ్రతం'.. వంటివి ఆచరిస్తుంటారు. 'మంగళగౌరీ వ్రతం'లో భాగంగా మంగళవారం నాడు పసుపు ముద్దను తయారుచేసి, కుంకుమ, పూలు అద్ది అక్షతలతో పూజలు చేస్తారు. ఇక శ్రావణం మొదలైన రెండో శుక్రవారం నాడు 'వరలక్ష్మీ వ్రతం' నిర్వహిస్తారు. ముఖ్యంగా కొత్త పెళ్లికూతుళ్లతో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా చేయిస్తారు. ముత్త్తెదువుల్ని ఇంటికి పిలిచి పూజలు చేసి, వాయనాలిచ్చి వారి ఆశీస్సులు పొందుతారు. శ్రావణంలో మహిళలు అత్యంత పవిత్రంగా భావించే మరో పర్వదినం 'నాగ పంచమి'. ఈ శ్రావణం మొదలైన ఐదో రోజున వచ్చే ఈ పండగ రోజున స్త్రీలంతా పాలు, పూలు, నైవేద్యాలతో నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

పండగలెన్నో!

శ్రావణమాసంలో మహిళలకు ప్రీతిపాత్రమైన పర్వదినాలే కాదు.. ఎన్నో పండగలు కూడా జరుపుకొంటాం. శ్రావణంలో వచ్చే పౌర్ణమి రోజును 'రాఖీ పౌర్ణమి'గా పిలుస్తారు. అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనురాగ బంధానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకొంటారు. ఈ రోజున స్త్రీలు తమ సోదరులకు రాఖీ కట్టి, ఎల్లవేళలా తమకు అండగా ఉండాలని కోరుకుంటారు. సోదరులకు తీపి తినిపించి, వారు ప్రేమతో ఇచ్చే కానుకలను పుచ్చుకుంటూ.. వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఇక ఈ మాసంలో వచ్చే మరో పండగ 'శ్రీకృష్ణ జన్మాష్టమి'. శ్రావణం చివరిలో వచ్చే ఈ పండగను చిన్నా, పెద్దా తేడా లేకుండా దేశవ్యాప్తంగా కోలాహలంగా నిర్వహిస్తారు. సాయంత్రం వేళల్లో ఉట్టికొట్టి సంబరాలు చేసుకుంటారు.

అయితే ఇంకా కరోనా పూర్తిగా పోలేదు. ఈ క్రమంలో- నోములు, వ్రతాలు చేసుకునేటప్పుడు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు. ఎప్పటిలా అందరినీ పిలిచి పేరంటాలు చేసి, వాయనాలు ఇవ్వలేకపోయినా- ఎవరింట్లో వాళ్ళుండి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మ వారిని మనసారా కొలుచుకోవడం మాత్రం మానకూడదు... ఏమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్