G20 Summit: వ్యాపారాన్ని వదిలి.. సమాజ సేవకై కదిలి..!

ఆర్థికంగా ఉన్నత కుటుంబంలో పుట్టారామె.. అత్తమామలూ పేరుమోసిన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం ఆలోచిస్తారు? కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనో లేదంటే కుటుంబ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించాలనో అనుకుంటారు.

Published : 11 Sep 2023 12:35 IST

(Photos: Instagram)

ఆర్థికంగా ఉన్నత కుటుంబంలో పుట్టారామె.. అత్తమామలూ పేరుమోసిన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం ఆలోచిస్తారు? కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనో లేదంటే కుటుంబ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించాలనో అనుకుంటారు. షైఫాలికా పండా కూడా ఇలాగే ఆలోచించి ఉంటే.. తనో విజయవంతమైన వ్యాపారవేత్తగానే మిగిలిపోయేవారు.. కానీ తను ప్రజల సంక్షేమం గురించి ఆలోచించారు. వెనకబడిన వర్గాలకు చెందిన మహిళల అభ్యున్నతిపై దృష్టి పెట్టారు. అందుకే ఓ సామాజిక వేత్తగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల నోళ్లలో నానుతున్నారు. మరోవైపు ‘జీ20 ఎంపవర్‌ మెంటర్‌షిప్‌ వర్కింగ్‌ గ్రూప్’ కన్వీనర్‌గా కొనసాగుతోన్న ఆమె.. ఔత్సాహిక వ్యాపారవేత్తలు, స్థూల-సూక్ష్మ వ్యాపారాలు ప్రారంభించిన మహిళల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. జీ20 సదస్సు నేపథ్యంలో.. ఈ సదస్సుకు సంబంధించిన పలు లక్ష్యాల గురించి ఇటీవలే పంచుకున్నారామె. ఈ నేపథ్యంలో షైఫాలిక గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

షైఫాలికది దిల్లీ. ‘ఇండియన్‌ మెటల్స్‌ అండ్‌ ఫెర్రో ఎలాయిస్‌ లిమిటెడ్‌’ సంస్థ వ్యవస్థాపకులైన బన్సీధర్‌ పండా, ఇలా కోడలు ఆమె. చిన్నతనం నుంచీ వ్యాపారరంగంలోకి రావాలని కలలు కన్న ఆమె.. 2007లో ఓ సంస్థను ప్రారంభించారు. దాని అభివృద్ధికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ని కూడా డిజైన్‌ చేసుకున్నారు. కానీ ఒకానొక సంఘటనతో తన మనసు మార్చుకున్నారు షైఫాలిక.

అలా సేవ వైపు అడుగు!

అనుభవమే ఆలోచనకు బీజం వేస్తుందంటారు. తన జీవితం కూడా ఇలాగే మలుపు తిరిగిందంటున్నారు షైఫాలిక.

‘ఓరోజు ఒడిశాలోని ఓ గ్రామంలో ఉన్న మా దగ్గరి బంధువొకరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. స్థానికంగా ఆస్పత్రికి తీసుకెళ్దామంటే.. అక్కడ వైద్య సదుపాయాలు లేవు. దాంతో హుటాహుటిన దిల్లీ తీసుకురావాల్సి వచ్చింది. మరి, డబ్బున్న వాళ్ల పరిస్థితే ఇలా ఉంటే.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజల పరిస్థితేంటి? అన్న ఆలోచన నా మదిలో మెదిలింది. అప్పటిదాకా నా మనసులో వ్యాపారం తప్ప మరో ఆలోచన లేదు. కానీ ఈ సంఘటన తర్వాత నేను ప్రపంచాన్ని చూసే దృష్టి కోణం మారింది. వ్యాపారం చేస్తే నేనొక్కదాన్నే ఎదగగలుగుతా.. అదే గ్రామీణ ప్రాంతాల్లో సకల సదుపాయాలు కల్పించి.. విద్య, వైద్యం వంటి అంశాల్లో అక్కడి వారిలో కనీస అవగాహన కల్పిస్తే.. నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్లూ ఎదగగలుగుతారనిపించింది. ఈ ఆలోచనే 2011లో ‘బన్సీధర్‌ అండ్‌ ఇలా పండా ఫౌండేషన్‌ (BIPF) పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించేలా చేసింది..’ అంటున్నారు షైఫాలిక. తన అత్తగారి స్ఫూర్తితో, అత్తమామల పేరు మీద ప్రారంభించిన ఈ ఎన్జీవో ద్వారా ఇప్పటివరకు ఒడిశాలోని ఐదు జిల్లాలను అభివృద్ధి చేశారు. అక్కడి మహిళల అభ్యున్నతికీ పాటుపడుతున్నారామె.

250 గ్రామాల్లో మార్పు!

తన ఎన్జీవో ద్వారా ఒడిశాలోని మారుమూల గ్రామాల అభివృద్ధికి నడుం బిగించిన షైఫాలిక.. ఆరోగ్యం, విద్య, తాగు నీరు-పరిశుభ్రత, జీవనోపాధి.. తదితర అంశాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. దేశవ్యాప్తంగా ఉన్న పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. ‘ఇల్లాలి చదువు ఇంటికే కాదు.. దేశానికే వెలుగు’ అన్న సూత్రాన్ని నమ్ముతారు షైఫాలిక. అందుకే గ్రామ స్థాయిలోని మహిళలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూనే.. స్వయం శక్తితో ఎదిగేందుకు కావాల్సిన చేయూతను అందిస్తున్నారు. అంతేకాదు.. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, వివిధ రకాల కళల్లో ప్రావీణ్యం కనబరిచే పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు కూడా అందిస్తున్నారామె.

‘ఆరోగ్యం, విద్య, నైపుణ్యాల్ని పెంపొందించుకోవడం, జీవనోపాధి.. ఇవన్నీ ప్రతి ఒక్కరి కనీస హక్కులు. అవగాహన, సదుపాయాల్లేక చాలామంది గ్రామీణ ప్రజలు వీటికి దూరమవుతున్నారు. అందుకే నా ఎన్జీవో ద్వారా ఇవన్నీ వారికి దగ్గర చేస్తున్నా. గ్రామాల్లో ఉండే మహిళల్లో 90 శాతం మంది నిరక్షరాస్యులే! వారికి నాణ్యమైన విద్య అందిస్తే.. స్వయం ఉపాధి మార్గాల్ని వారే వెతుక్కుంటారు.. మరికొంతమందికి స్ఫూర్తినిస్తారు.. జీవనోపాధి అవకాశాల్ని అందిస్తారు. తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది.. అందుకే ఇలాంటి మహిళలకూ ఆయా అంశాల్లో చేయూతను అందిస్తున్నాం.. అలాగే వారికి ఆన్‌లైన్‌ ఉపయోగంపై పట్టు పెంచేందుకూ కృషి చేస్తున్నాం.. ఈ డిజిటల్‌ లిటరసీ విధానాన్ని వాళ్లు అందిపుచ్చుకుంటే వాళ్ల జీవితాల్లో ఎన్నో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి..’ అంటున్నారు షైఫాలిక. ఇలా తన సంస్థ ద్వారా ఇప్పటివరకు ఒడిశాలోని ఐదు జిల్లాల్లో.. సుమారు 250 గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేశారామె.

జీ20లో ప్రధాన అంశమదే!

ప్రస్తుతం ఓవైపు స్వచ్ఛంద సంస్థ పనులతో బిజీగా ఉన్నప్పటికీ.. తన కుటుంబ వ్యాపారమైన IMFA సంస్థలోని ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ (CSR)’ విభాగానికి చీఫ్‌ ఆఫీసర్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు షైఫాలిక. మరోవైపు ‘జీ20 మెంటర్‌షిప్‌ వర్కింగ్‌ గ్రూప్’ కన్వీనర్‌గా కొనసాగుతోన్న ఆమె.. ఔత్సాహిక వ్యాపారవేత్తలు, స్థూల-సూక్ష్మ వ్యాపారాలు ప్రారంభించిన మహిళల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి, పురుషులతో సమాన అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పలు అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జీ20 సదస్సు నేపథ్యంలో.. ఇటీవలే ఈ సదస్సుకు సంబంధించిన పలు అంశాలు/లక్ష్యాల గురించి ఇలా పంచుకున్నారు.

‘నా దృష్టిలో మహిళలు రెండు రకాలు. ఒకటి - అవకాశాలు ఉన్న వారు, రెండోది - అవకాశాలు లేని వారు. అవకాశాలున్న వారు ఎలాగైనా ఎదగగలుగుతారు. కానీ అవకాశాలు లేని వారికి చేయూత, ప్రోత్సాహం, అన్ని విధాలుగా వారికి శిక్షణ అందించడం అవసరం. జీ20 సదస్సులో ఇదే ప్రధాన అంశం కానుంది. జీ20 దేశాల్లో అవకాశాలు అందని, ప్రోత్సాహం లేని ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తల సమస్యల్ని గుర్తించి.. వారికి విద్య, జీవన నైపుణ్యాలు నేర్పించడం పైనే చర్చిస్తున్నారు. అలాగే వారికి ఆయా అంశాలపై మెంటర్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌ కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఆయా దేశాల నుంచి వచ్చిన మెంటర్స్‌ ప్రసంగాలు, వ్యాపారవేత్తల సక్సెస్‌ స్టోరీస్‌.. ఔత్సాహిక మహిళలకు స్ఫూర్తినిస్తాయి..’ అంటున్నారు షైఫాలిక.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్