Star Daughters: వీళ్ల ట్యాలెంట్.. అదరహో!

పిల్లల్ని వాళ్లకు నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపించారు హీరో మంచు విష్ణు కూతుళ్లు అరియానా-వివియానా. తమ క్యూట్‌నెస్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేసే ఈ కవలలు.. ఇప్పుడు తమ గాత్రంతోనూ అదుర్స్‌ అనిపించుకుంటున్నారు. విష్ణు హీరోగా నటిస్తోన్న ‘జిన్నా’ అనే చిత్రంలో ఓ పాట పాడి తమ సింగింగ్‌ ట్యాలెంట్‌ను......

Updated : 25 Jul 2022 21:51 IST

(Photos: Instagram)

పిల్లల్ని వాళ్లకు నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపించారు హీరో మంచు విష్ణు కూతుళ్లు అరియానా-వివియానా. తమ క్యూట్‌నెస్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేసే ఈ కవలలు.. ఇప్పుడు తమ గాత్రంతోనూ అదుర్స్‌ అనిపించుకుంటున్నారు. విష్ణు హీరోగా నటిస్తోన్న ‘జిన్నా’ అనే చిత్రంలో ఓ పాట పాడి తమ సింగింగ్‌ ట్యాలెంట్‌ను నిరూపించుకున్నారీ క్యూట్‌ సిస్టర్స్‌. తాజాగా విడుదలైన ఈ పాట.. యూట్యూబ్‌లో లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. అందరూ వీళ్ల గాత్ర నైపుణ్యానికి ఫిదా అయిపోతున్నారనడంలో సందేహం లేదు. ఇలా వీళ్లే కాదు.. గతంలోనూ కొందరు స్టార్‌ డాటర్స్‌ తమ అరుదైన ట్యాలెంట్‌తో ఆకట్టుకున్నారు. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

కవలల ‘స్నేహ’గీతం!

మంచు విష్ణు-విరానిక దంపతుల కూతుళ్లే అరియానా-వివియానా. కవలలైన వీరిద్దరూ తమ అందం, క్యూట్‌నెస్‌తో సోషల్‌ మీడియా స్టార్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 11 ఏళ్ల వయసున్న ఈ కవలలు ప్రతి సందర్భంలోనూ విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తులు ధరించి.. తీయించుకునే ఫొటోషూట్స్‌ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అంతేకాదు.. ఈ అక్కచెల్లెళ్లిద్దరికీ ప్రత్యేకంగా ఓ ఇన్‌స్టా పేజీ కూడా ఉంది. అందులోనే వీళ్ల ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తుంటారీ స్టార్‌ సిస్టర్స్‌. ఇలా అందమే కాదు.. అంతకుమించిన మధురమైన గాత్రం కూడా తమ సొంతం అని తాజాగా నిరూపించుకున్నారు అరి-వివి. హీరో విష్ణు నటిస్తోన్న ‘జిన్నా’ సినిమా కోసం ఓ స్నేహ గీతం ఆలపించారీ అక్కచెల్లెళ్లు. ‘ఇదే స్నేహం.. యే హై దోస్తీ’ అంటూ సాగే ఈ పాటకు సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. విడుదలైన ఒక్క రోజులోనే ఈ పాట 40 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించి యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇలా ‘తమ తొలి పాటతోనే ఈ చిన్నారులిద్దరూ అదరగొట్టారం’టున్నారు ఫ్యాన్స్.
మరోవైపు తమ కూతుళ్ల ప్రతిభ, పాటకు వస్తోన్న ఆదరాభిమానాలకు పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు విష్ణు దంపతులు. ‘నా కూతుళ్ల ప్రతిభ చూసి ఓ తండ్రిగా ఉప్పొంగిపోతున్నా. వాళ్లు నటనలోకి రావాలని కలలు కంటున్నా.. అయితే అలాగని వారిని ఒత్తిడి చేయను.. ఏ కెరీర్‌ని ఎంచుకుంటారనేది పూర్తిగా వాళ్ల ఇష్టం..’ అంటున్నాడీ మంచు హీరో.


అల్లు అర్హ.. చెస్ ట్రైనర్!

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ అల్లు అర్జున్‌-స్నేహల ముద్దుల కూతురైన అల్లు అర్హ తన చిరునవ్వు, క్యూట్‌నెస్‌తో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. ఐదేళ్ల ఈ చిన్నారికి సంబంధించిన ఏ ఫొటో, వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినా.. అది వైరలవ్వాల్సిందే! తన తండ్రి సినిమాల్లోని కొన్ని సీన్స్‌కి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ, డైలాగ్స్‌ చెప్తూ, పాటలు పాడుతూ, డ్యాన్స్‌ చేస్తూ.. ఆకట్టుకుంటుంది అర్హ. ఇలా చిన్న వయసులోనే స్టార్‌ స్టేటస్‌ని సొంతం చేసుకున్న అర్హ మంచి చెస్‌ ప్లేయర్‌ కూడా! ‘నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్’ వారే పరీక్షించి మరీ ఈ విషయం నిరూపించారు. గతేడాది నవంబర్‌లో ఈ పరీక్షలో పాసైన అర్హకు.. ‘ప్రపంచంలోనే యంగెస్ట్‌ చెస్‌ ట్రైనర్‌’గా మెడల్‌ వేసి.. ప్రశంసాపత్రాన్ని కూడా అందించారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను బన్నీ దంపతులు తమ సోషల్‌ మీడియా పేజీల్లో పోస్ట్‌ చేసి ఎంతో మురిసిపోయారు.

ఇక మరోవైపు.. బాలనటిగానూ తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమైందీ స్టార్‌ డాటర్‌. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’తో వెండితెరకు పరిచయం కానున్న ఈ క్యూటీకి ‘అర్హ.. పెద్ద స్టార్‌ అవుతుంద’ని సామ్‌ కితాబు కూడా ఇచ్చేసింది.


సీతూ పాప.. ‘సోషల్‌’ స్టార్!

చిన్న వయసు నుంచే తనలోని బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకుంటోంది ప్రిన్స్‌ వారసురాలు సితార. మహేశ్‌ బాబు-నమ్రతా శిరోద్కర్‌ గారాల పట్టి అయిన సీతూ పాప.. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తోంది. ఇందులో తమ విభిన్న నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారీ క్యూట్‌ కిడ్స్‌. ఇక మరోవైపు తన తండ్రి నటించిన సినిమాల్లోని సన్నివేశాలు, డైలాగ్స్‌, పాటలు, డ్యాన్స్‌లకు స్టెప్పులేస్తూ.. ఆ వీడియోలు, ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ఇలా ఈ క్యూట్‌ కిడ్‌ పోస్టులు నెట్టింట్లో తెగ వైరలవుతుంటాయి. ఇక ప్రస్తుతం కూచిపూడి నేర్చుకుంటోందీ లిటిల్‌ ప్రిన్సెస్‌. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా తను చేసిన డ్యాన్స్ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది వైరలైన సంగతి తెలిసిందే! మహేశ్‌ కూడా తన కూతురి నృత్యం చూసి ఉప్పొంగిపోయాడు. వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి మురిసిపోయాడు.


విద్య.. ‘నోబుల్’ రికార్డు!

నటి మంచు లక్ష్మి గారాల పట్టి విద్యా నిర్వాణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన క్యూట్‌ స్మైల్‌తో సోషల్‌ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ లవ్లీ కిడ్.. తన తల్లితో కలిసి ప్రతి పనిలోనూ పాలుపంచుకుంటుంటుంది. మొక్కలు నాటడం దగ్గర్నుంచి.. వ్యాయామం చేయడం దాకా.. అన్నింట్లోనూ ఉత్సాహం చూపుతుంటుంది. ఇలా తన చలాకీతనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విద్య.. చాలా స్మార్ట్‌ కూడా! ఈ విషయం ‘నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు’ వారు పరీక్షించి మరీ తేల్చారు. ఈ క్రమంలో 2019లో ‘యంగెస్ట్‌ చెస్‌ ట్రైనర్‌’గా మెడల్‌, ప్రశంసా పత్రం అందుకుందీ స్టార్‌ డాటర్‌. ఇలా తన కూతురు ప్రతిభను చూసి ఎంతగానో మురిసిపోయింది మంచు లక్ష్మి.

‘చెస్ కేవలం ఓ ఆట మాత్రమే కాదు.. జీవితానికి ఉపయోగపడే నైపుణ్యాలను నేర్పిస్తుందీ క్రీడ. అందుకే చిన్న వయసు నుంచే నిర్వాణకు ఇందులో శిక్షణ ఇప్పిస్తున్నా. కోచింగ్‌లో చేర్పించిన కొద్ది రోజుల్లోనే నా కూతురి ట్యాలెంట్‌ గురించి కోచ్‌ చెప్పిన మాటలు విని అమితానందం కలిగింది. నా చిట్టితల్లి ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నందుకు ఓ తల్లిగా గర్వపడుతున్నా..’ అందీ అందాల అమ్మ.


వీళ్లూ తక్కువేం కాదు..!

* ఇక పవన్‌ కల్యాణ్‌-రేణూ దేశాయ్‌ కూతురు ఆద్య.. మొన్నామధ్య గిటార్‌ వాయిస్తూ పాట పాడిన వీడియో వైరలైన సంగతి తెలిసిందే! ఇలా ఆమె గాత్ర నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. అంతేకాదు.. ఆద్యకు పుస్తకాలు చదవడమన్నా ఎంతో ఇష్టం.

* తన తల్లి అందాన్ని పుణికిపుచ్చుకుంది బచ్చన్‌ వారసురాలు ఆరాధ్య బచ్చన్‌. తల్లి ఐశ్వర్యతో కలిసి ఫ్యాషన్‌ వేదికలు, కేన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొని సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుంటుందీ క్యూట్‌ కిడ్‌. మరోవైపు తన గాత్రంతో క్రిస్మస్‌ జింగిల్స్‌, ఇతర పాటలు పాడుతూ ఆకట్టుకుంటుంది.

* స్టార్‌ వారసురాలిగా ఇప్పటికే వెండితెరపై అడుగుపెట్టింది సుస్మితా సేన్‌ కూతురు రెనీ. రెండేళ్ల క్రితం విడుదలైన ‘సుట్టాబాజీ’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక ఈ సినిమా గతేడాది బాంద్రా చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్