Published : 13/09/2021 16:11 IST

అత్తారింటి వేధింపులను ఎదిరించా... జీవితంలో గెలిచా..!

విజయవాడకి చెందిన ఒక అమ్మాయికి పద్దెనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఆ తర్వాత కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన ఆమెకి అక్కడ గృహహింస, అదనపు వరకట్న వేధింపులు ఆహ్వానం పలికాయి.. క్రమంగా అత్తింటి వారి ఆగడాలు పెచ్చుమీరడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బతుకుతెరువు కోసం తనకి వచ్చిన కుట్లు, అల్లికలతో చిన్న షాపు మొదలుపెట్టింది. ప్రస్తుతం తానే సొంతంగా ఒక వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి చేరింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం జరిగింది.. ఈ స్థాయికి ఎలా చేరింది.. మొదలైన వివరాలన్నీ తెలియాలంటే ఇది చదవాల్సిందే..

హాయ్..

నా పేరు మల్లిక. మాది విజయవాడ. అమ్మానాన్నకి మేం ముగ్గురం సంతానం. ముగ్గురం ఆడపిల్లలమే కావడం, మధ్యతరగతి నేపథ్యం.. వంటి కారణాల వల్ల మా తల్లిదండ్రులు నాకు పద్దెనిమిదో ఏటే పెళ్లి చేసేశారు. అతనిది వరంగల్. సివిల్ ఇంజినీర్. మంచి సంబంధం అంటూ పెద్దగా విచారించకుండానే పెద్దలు మా పెళ్లి చేసేశారు. అప్పటికి నేను కేవలం ఇంటర్ మాత్రమే పూర్తి చేశా.

పెళ్లయ్యాక కోటి ఆశలతో, కొత్త ఆలోచనలతో అత్తారింట అడుగుపెట్టిన నాకు అవన్నీ ఆవిరి కావడానికి పెద్దగా సమయం పట్టలేదు. డబ్బే సర్వస్వం అని భావించే అత్తామామలు, వారికి వత్తాసు పలికే భర్త.. వీరికి తోడు అప్పుడప్పుడూ వచ్చి నెత్తిన పిడుగులు వేసే ఆడపడుచు.. వీరందరినీ అర్థం చేసుకోవడానికి నాకు నెల రోజుల సమయం పట్టింది. అప్పటికే వాళ్లంతా నన్ను ఆ ఇంటికి పని మనిషిగా మార్చేశారు. అలా ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి అంతా పడుకొనే వరకు క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒక పని చెబుతూనే ఉండేవారు. 'నా వాళ్లే కదా!' అనే ఉద్దేశంతో నేను కూడా ఏమీ అనకుండా మౌనంగా పనులన్నీ చేసుకుపోయేదాన్ని.

పెళ్త్లె ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే వాళ్లు అదనపు కట్నం తేవాలంటూ సూటిపోటి మాటలు అనడం ప్రారంభించారు. మా కుటుంబ పరిస్థితుల గురించి వారికి చెబితే 'అదంతా మాకు తెలియదు.. కట్నం తెస్తే ఇక్కడ ఉండు.. లేదంటే విడాకులిచ్చి, మీ ఇంటికి దయచేయి..' అనేవారు. కొన్ని రోజుల తర్వాత ఈ సూటిపోటి మాటలకు నేను లొంగడం లేదని, కొట్టడం, వాతలు పెట్టడం.. వంటివి చేయడం ప్రారంభించారు. అప్పటివరకు మౌనంగా ఈ బాధలన్నీ భరించిన నేను ఈసారి నా తల్లిదండ్రులను ఆశ్రయించా. వారు నా బాధను అర్థం చేసుకున్నా మా అత్తింటివారికి సర్దిచెప్పగలరే తప్ప వారు అడిగినంత ఇచ్చే పరిస్థితిలో లేరు. దాంతో ఏదైతే అది అదవుతుందని ఆత్మవిశ్వాసం కూడదీసుకొని గృహహింస కేసు పెట్టా. దాంతో ఇటు అత్తారిల్లు, అటు పుట్టింటి వాళ్ల కోపానికి గురయ్యా.

అయినా ధైర్యం చేసి ఇంటి నుంచి బయటకు వచ్చేశా. మళ్లీ విజయవాడ చేరుకున్న నేను ఒక హాస్టల్లో ఉంటూనే స్నేహితుల సహాయంతో ఒక చిన్న షాపు అద్దెకు తీసుకొని కుట్లు, అల్లికలు.. వంటి చేతి పనులు చేసేదాన్ని. కానీ ప్రస్తుత కాలంలో వృత్తి, వ్యాపారాల్లో కొనసాగడానికి ఈ నైపుణ్యాలు చాలవనిపించింది. అందుకే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ కార్యక్రమంలో నేను కూడా చేరా. ఆ కోర్సు పూర్తి చేసిన తర్వాత నాకున్న సృజనాత్మకతని జోడించి మంచి డిజైన్స్‌ని రూపొందించి మా స్నేహితులకు అందించేదాన్ని. వారికి కూడా అవి బాగా నచ్చడంతో నన్ను సొంతంగా ఒక బొతిక్ పెట్టమని చెప్పేవారు.

దాదాపు రెండున్నరేళ్ల పాటు చిన్న షాపులో వ్యాపారం చేసిన నేను వాళ్ల సూచన ప్రకారం రద్దీ ఎక్కువగా ఉండే సెంటర్లో ఒక బొతిక్ పెట్టా. మొదట్లో చిన్న చిన్న ఆటుపోట్లు ఎదుర్కొన్నా క్రమంగా స్థిరపడగలిగా. ప్రస్తుతం మా వ్యాపారం లాభాల బాటలో సాగుతోంది. అంతేకాదు.. మొదట్లో నేను చేసిన పనికి కోప్పడిన మా అమ్మానాన్న కూడా ఆ తర్వాత నన్ను అర్థం చేసుకొని నాకు అండగా నిలిచారు. నేను కూడా వారికి ఆసరాగా ఉంటూ వారి బాగోగులు చూసుకుంటున్నాను. మా చెల్లెళ్లకు కూడా మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశా. ప్రస్తుతం అమ్మానాన్నతో నా జీవితం సంతోషంగా సాగిపోతోంది.

మరి, ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే.. మన దేశంలో గృహహింస, వేధింపులు.. వంటి సమస్యలు ఎన్ని ఉన్నా వివిధ కారణాల రీత్యా వాటిని మౌనంగా భరించే ఇల్లాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి సంఘటనల్లో మన మౌనమే ఎదుటివారికి ఆయుధంగా మారుతుందని స్త్రీలంతా గ్రహించాలి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేసి వాటిని ఎదిరించాలి. లేదంటే ఈ పరిస్థితుల్లో ఎప్పటికీ మార్పు రాదు. క్లిష్ట సందర్భాల్లో సైతం మనదైన ఆత్మవిశ్వాసంతో ముందుకి వెళ్తూ, జీవనం సాగిస్తే జీవితంలో నిలదొక్కుకోవచ్చని చెప్పడానికి నేనే ఒక ఉదాహరణ. కాబట్టి ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో తన జీవితం తాను నిలబెట్టుకునే దిశగా ముందడుగు వేయాలి.

ఇట్లు,

మల్లిక


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని