మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

ఈ రోజుల్లో చాలామంది ఏదో ఒక సమస్యతో ఒత్తిడికి లోనవుతున్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాకపోగా ఇతర అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే పెద్దవాళ్లు మాత్రమే ఒత్తిడికి లోనవుతారనుకుంటే అది పొరపాటే. చదువుకునే చిన్నారులు సైతం ఒత్తిడికి లోనవుతున్నారని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

Published : 11 Dec 2023 12:14 IST

ఈ రోజుల్లో చాలామంది ఏదో ఒక సమస్యతో ఒత్తిడికి లోనవుతున్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాకపోగా ఇతర అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే పెద్దవాళ్లు మాత్రమే ఒత్తిడికి లోనవుతారనుకుంటే అది పొరపాటే. చదువుకునే చిన్నారులు సైతం ఒత్తిడికి లోనవుతున్నారని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో తల్లిదండ్రులుగా మీరే దానికి సరైన పరిష్కార మార్గం చూపించగలుగుతారు. అయితే, మాకు ఆ విషయం ఎలా తెలుస్తుంది? అనుకుంటున్నారా? పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో? చిన్నారులను ఒత్తిడి నుంచి ఎలా బయటపడేయాలో తెలుసుకుందాం రండి...

అనారోగ్యంగా ఉన్నారా..?

కొంతమంది పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఇవి సాధారణంగా కూడా వస్తాయి కదా! అనే సందేహం రావచ్చు. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని పిల్లల్లో తరచుగా ఈ సమస్య వస్తుంటే దానిని ఒత్తిడి కిందే పరిగణించాలి. టీచర్లు ఇచ్చిన హోమ్‌ వర్క్‌ చేయలేకపోవడం, పరీక్షలకు సరిగా సన్నద్ధం కాకపోవడం వంటి వాటి వల్ల కూడా వారు ఒత్తిడి చెందవచ్చు. ఇలాంటివి తల్లిదండ్రులకు చెబితే ఎక్కడ తిడతారోననే భయం కూడా వారిలో ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వారిని మీరే దగ్గరకు తీసుకొని అసలు సమస్యేంటో నెమ్మదిగా అడిగే ప్రయత్నం చేయాలి. అలాగే వారికి ధైర్యం చెబుతూ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి.

ఫోన్లో ఆటలా..?

సాధారణంగా పిల్లలు ఎక్కువగా ఫోన్లలో ఆటలు ఆడడానికే ప్రయత్నిస్తుంటారు. కొన్ని ఆటల వల్ల పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ కొన్ని ఆటలు మాత్రం పిల్లల్లో ఒత్తిడిని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఒత్తిడికి గురవుతున్నామన్న విషయం కూడా వారికి తెలియదట. అలా అని వారిని అసలు ఫోన్లకే దూరం చేయడం కూడా మంచిది కాదు. ఒకవేళ వారికి ఫోన్ ఇచ్చినా దానికంటూ కొంత సమయం కేటాయించండి. అలాగే వారు ఆడే ఆటలు, చూసే వీడియోలపై కూడా ఓ కన్నేసి ఉంచడం ఎంతైనా అవసరం.

ఎలా తింటున్నారు?

మనం ఆహారం తీసుకునే విధానంలో ఒత్తిడికి లోనవుతున్నామో లేదో తెలిసిపోతుందట. ఇది కేవలం పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా వర్తిస్తుంది. మీ పిల్లలు అంతకుముందు కంటే ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కానీ, తక్కువగా తీసుకోవడం కానీ జరుగుతుంటే దానిని ఒత్తిడి కిందే పరిగణించాలి. వారు ఏదైనా విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇలా చేస్తుండచ్చు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తుంటే వారి సమస్యను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయండి.

ఏకాగ్రత తగ్గుతోందా?

ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం ఏ పనీ సరిగ్గా చేయలేం. ముఖ్యంగా చదువు విషయంలో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే ఒత్తిడి అనేది ఎప్పుడూ బయటి అంశాల పైనే ఆధారపడి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులను సరిగా నిర్వర్తించనప్పుడు కూడా ఒత్తిడికి లోనవుతుంటాం. అలాగే పిల్లలు కూడా చదువు విషయంలో వారు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతే కొన్నిసార్లు ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో వారికి అండగా ఉంటూ తగిన సహకారం అందించాలి. తద్వారా వారిని ఒత్తిడి నుంచి బయటపడేయచ్చు.

ఇవి కూడా..

కొంతమంది వారికి వచ్చిన సమస్యను పెద్దదిగా చూసుకొని తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. దాంతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండడం లేదా మధ్యలోనే వెళ్లిపోవడం వంటివి చేస్తుంటారు. పిల్లలు కూడా ఇలా చేసే అవకాశం ఉంది.

కొంతమంది పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు రాత్రుళ్లు పక్క తడుపుతుంటారు. చిన్న పిల్లల్లో అయితే ఇది పెద్ద సమస్య కాదు.. కానీ స్కూలుకి వెళ్లే వయసున్న వారు కూడా ఇలా చేస్తుంటే వాళ్లు ఒత్తిడి చెందుతున్నారని భావించాల్సిందే.

కొంతమంది పిల్లలకు పీడకలలు వస్తుంటాయి. అయితే అవి ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ తరచుగా వస్తుంటే అది ఒత్తిడి సమస్యేనని భావించాలి.

మీ పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారికి కావాల్సిన సహాయం చేసి చూడండి. ఒకవేళ అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే నిపుణులను సంప్రదించే ప్రయత్నం చేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్