తల్లి కావాలనుకుంటున్నారా? ముందు ఇవి తెలుసుకోండి!

ప్రతి మహిళ జీవితంలో అమ్మతనం అనేది ఓ వెలకట్టలేని అనుభూతి. అందుకే ఆ మధురమైన క్షణం కోసం మహిళలు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. అయితే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకునే క్రమంలో వారి మనసులో ఎన్నో సందేహాలు, అపోహలు తలెత్తుతాయి. వాటన్నింటినీ నిర్లక్ష్యం చేయకుండా.. నివృత్తి చేసుకొని ముందుకు సాగినప్పుడే త్వరగా గర్భం ధరించచ్చని, నవమాసాలూ ప్రెగ్నెన్సీని ఆస్వాదించచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో గైనకాలజిస్ట్‌ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated : 30 Jul 2021 15:11 IST

సువర్ణకు ఇటీవలే పెళ్లైంది. ప్రస్తుతం పిల్లల కోసం ప్లాన్‌ చేసుకుంటోన్న ఆమె మనసులో ఎన్నో సందేహాలు! ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ముందు నుంచే విటమిన్‌ సప్లిమెంట్స్‌ వేసుకోవచ్చా? ఇలాంటి ఎన్నో విషయాల్లో ఆమెకు స్పష్టత లేదు.
ఇటీవలే కొవిడ్‌ టీకా రెండో డోసు తీసుకుంది ప్రణయ. వ్యాక్సిన్‌ తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోవచ్చా? లేదంటే ఇంకొన్నాళ్లు ఆగాలా? అన్న సందిగ్ధంలో పడిపోయిందామె.
ప్రతి మహిళ జీవితంలో అమ్మతనం అనేది ఓ వెలకట్టలేని అనుభూతి. అందుకే ఆ మధురమైన క్షణం కోసం మహిళలు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. అయితే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకునే క్రమంలో వారి మనసులో ఎన్నో సందేహాలు, అపోహలు తలెత్తుతాయి. వాటన్నింటినీ నిర్లక్ష్యం చేయకుండా.. నివృత్తి చేసుకొని ముందుకు సాగినప్పుడే త్వరగా గర్భం ధరించచ్చని, నవమాసాలూ ప్రెగ్నెన్సీని ఆస్వాదించచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో గైనకాలజిస్ట్‌ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ తల్లి కావాలనుకునే వారు ముందుగా తెలుసుకోవాల్సిన ఆ అంశాలేంటో మనమూ చూద్దాం రండి..

జీవనశైలి మార్చుకోవాల్సిందే!

ఆహారపుటలవాట్లు, ప్రత్యుత్పత్తి సమస్యలు, మానసిక ఆందోళనలు.. ఇవే ఈ రోజుల్లో చాలామంది మహిళలకు అమ్మతనాన్ని దూరం చేస్తున్నాయి. ఇన్ని అనారోగ్యాల మధ్య ఒకవేళ గర్భం ధరించినా గర్భస్రావం అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే తల్లి కావాలనుకునే మహిళలు ముందుగా వీటి గురించి కనీస అవగాహన ఏర్పరచుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పీసీఓఎస్‌, థైరాయిడ్‌, స్థూలకాయం, బీపీ.. వంటి దీర్ఘకాలిక సమస్యలేవైనా మీలో ఉన్నాయేమో ముందుగా చెక్‌ చేయించుకొని వాటికి తగిన చికిత్స తీసుకోవాలి. ఇక ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగా, ధ్యానం, ఇతర వ్యాయామాలను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. అలాగే తీసుకునే ఆహారం విషయంలోనూ కొన్ని మార్పులు అవసరం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్‌, జింక్‌.. వంటి పోషకాలు అధికంగా ఉండే నిమ్మజాతి పండ్లు, టొమాటో, లివర్‌, గుమ్మడి గింజలు, పప్పుధాన్యాలు, దానిమ్మ, డ్రైఫ్రూట్స్‌, గుడ్లు.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి అండాల ఆరోగ్యాన్ని, సామర్థ్యాన్ని పెంచి త్వరగా గర్భం ధరించేందుకు దోహదం చేస్తాయి.

వయసు తెలుసుకోండి!

కెరీర్‌, ఇతర బాధ్యతల రీత్యా కొంతమంది కొన్నేళ్ల పాటు ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తూ వస్తుంటారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ గర్భం ధరించే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతాయంటున్నారు నిపుణులు. 35, ఆ పైబడిన మహిళల్లో సహజసిద్ధంగా తల్లయ్యే అవకాశాలు సుమారు 50 శాతం మేర తగ్గుతాయట! కాబట్టి వయసులో ఉన్నప్పుడే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకోవడం మంచిదంటున్నారు. అయితే లేటు వయసులో పిల్లల కోసం ప్లాన్‌ చేసుకోవాలనుకునే వారు మొదట ఆరు నెలల పాటు సహజసిద్ధంగా గర్భం కోసం ప్రయత్నించచ్చని.. ఒకవేళ ఈ క్రమంలో గర్భం ధరించకపోయినా, అబార్షన్‌ అయినా.. వెంటనే నిపుణుల్ని సంప్రదించి అసలు కారణమేంటో కనుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో సహజంగా తల్లి కాలేని వారికి ఐవీఎఫ్‌.. వంటి గర్భధారణ పద్ధతుల్ని డాక్టర్లు సూచిస్తారు.

ఆ మందులు వాడచ్చా?

నానాటికీ పెరుగుతోన్న ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా స్థూలకాయం, బీపీ, పీసీఓఎస్‌, థైరాయిడ్‌.. వంటి దీర్ఘకాలిక సమస్యలు ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిల్ని వేధిస్తున్నాయి. అయితే వీటి కోసం మందులు వాడే క్రమంలో గర్భధారణ మంచిదేనా అన్న సందేహం కూడా కొంతమంది మహిళల్లో ఉంటుంది. నిజానికి కొన్ని రకాల మందులు, స్టెరాయిడ్స్‌, యాంటీ డిప్రెసెంట్స్‌.. వంటివి గర్భం ధరించే అవకాశాల్ని కొంత వరకు తగ్గిస్తాయంటున్నారు నిపుణులు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా ఇవి కడుపులో పెరుగుతోన్న బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదమూ ఉంటుందట! కాబట్టి బిడ్డ కోసం ప్లాన్‌ చేసుకుంటోన్న మహిళలు.. తమలో ఉన్న అనారోగ్యాలు, వాడుతోన్న మందుల గురించి ముందే గైనకాలజిస్ట్‌కి చెప్పాలి. తద్వారా వాళ్లు ఆ మందులకు ప్రత్యామ్నాయంగా బిడ్డకు హాని కలిగించని ఇతర మందుల్ని సూచించే అవకాశాలుంటాయి. ఇక వీటితో పాటు ఎన్ని రోజుల ముందు నుంచి ఫోలేట్‌, ఐరన్‌, జింక్‌.. వంటి విటమిన్‌ సప్లిమెంట్స్‌ వేసుకోవాలి? అవి ఎంత మోతాదులో వాడచ్చు? వంటి విషయాలు కూడా అడిగి తెలుసుకోవడం ముఖ్యం.

ఎందుకు గర్భం రావట్లేదు?!

ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకునే క్రమంలో సహజంగా గర్భం ధరించే అవకాశాలున్నాయా? లేదా? అన్నది ముందుగా పరిశీలిస్తారు డాక్టర్లు. ఇందుకోసం జంటలకు ఆరు నెలలు సమయమిస్తారు. అయినా ప్రెగ్నెన్సీ సక్సెస్‌ కావట్లేదంటే మాత్రం వారిలో రుతుచక్రం, కాంట్రాసెప్టివ్‌ మాత్రలేమైనా వాడుతున్నారా? ఇంతకుముందు గర్భస్రావాలేమైనా అయ్యాయా? వంటి గత వైద్య చరిత్రంతా పరిశీలిస్తారు. వీటితో పాటు అండాల ఉత్పత్తి-సామర్థ్యం, ఫాలోపియన్‌ ట్యూబుల్లో బ్లాకులేమైనా ఉన్నాయా? లైంగిక సంక్రమణ వ్యాధులున్నాయా? హిస్టరోస్కోపీ ద్వారా గర్భాశయ పొర.. వంటివి చెక్‌ చేస్తారు. అలాగే వంశపారంపర్యంగా వచ్చే సమస్యల గురించి తెలుసుకోవడానికి కొంతమందికి జన్యు పరీక్షలు కూడా నిర్వహించాల్సి రావచ్చు.

టీకా తర్వాత ఎన్నాళ్లు ఆగాలి?

బిడ్డ కోసం ప్లాన్‌ చేసుకునే మహిళల్లో కొవిడ్‌ టీకా గురించి చాలా సందేహాలే ఉన్నాయని చెప్పచ్చు. ఈ సమయంలో టీకా తీసుకోవచ్చా? వ్యాక్సిన్‌ వేసుకున్నాక వెంటనే గర్భం ధరించచ్చా? లేదంటే కొన్ని నెలల పాటు ఆగాలా? అనుకోకుండా గర్భం వస్తే టీకా వల్ల కడుపులోని బిడ్డకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో? అని ఇలా వివిధ రకాల సందేహాలతో చాలామంది గర్భాన్ని వాయిదా వేస్తున్నారు. అయితే ఆ అవసరం లేదంటున్నారు నిపుణులు. రెండు డోసులు అయ్యే దాకా ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ని వాయిదా వేయక్కర్లేదని, ఒకవేళ ఈలోపే గర్భం వస్తే ఆ తర్వాత కూడా డోసులు పూర్తి చేసుకోవచ్చని చెబుతున్నారు. ఎలాగో గర్భిణులకు కూడా టీకా ఇవ్వచ్చని ఆరోగ్య శాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది కాబట్టి టీకాకు, ప్రెగ్నెన్సీకి ముడి పెట్టి గర్భధారణను వాయిదా వేయద్దని సలహా ఇస్తున్నారు.

వీటితో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న మహిళలకు గర్భధారణకు ముందే ఎంఎంఆర్‌, చికెన్‌పాక్స్, సీజనల్‌ ఫ్లూ.. వంటి వ్యాక్సిన్లు వేయించుకోమని వైద్యులు సూచిస్తారు. ఇవనే కాదు.. ఆరోగ్యం విషయంలో, గర్భధారణ విషయంలో.. ఇతర సందేహాలు ఏమున్నా ముందే నివృత్తి చేసుకుంటే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్