పరీక్షలకు ప్రిపేరవుతున్నారా? ఈ టిప్స్ పాటించండి!

'అమ్మా.. చదివిన విషయాలు ఎగ్జామ్ హాల్‌లో ఎంతకీ గుర్తుకు రావడం లేదు' ఇది ఓ విద్యార్థిని భయంతో చెప్పే మాట.'మేడమ్.. క్లాసులో పాఠాలన్నీ బాగానే అర్థమవుతున్నాయి. కాకపోతే పరీక్షలప్పుడే వాటిని ఎందుకో మర్చిపోతున్నాను' ఇది మరో......

Published : 27 Apr 2022 19:33 IST

'అమ్మా.. చదివిన విషయాలు ఎగ్జామ్ హాల్‌లో ఎంతకీ గుర్తుకు రావడం లేదు' ఇది ఓ విద్యార్థిని భయంతో చెప్పే మాట.

'మేడమ్.. క్లాసులో పాఠాలన్నీ బాగానే అర్థమవుతున్నాయి. కాకపోతే పరీక్షలప్పుడే వాటిని ఎందుకో మర్చిపోతున్నాను' ఇది మరో స్టూడెంట్ ఆవేదన.

సాధారణంగా కొంతమంది విద్యార్థులు చదివే అంశాలను జ్ఞాపకం ఉంచుకొనే ప్రక్రియలో కాస్త ఇబ్బందికి గురవుతారన్న మాట వాస్తవమే. అయితే వివిధ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు చదివే విషయాలతో పాటు చదివే పద్ధతిపై కూడా దృష్టి పెడితేనే విజయతీరాలను చేరుకోగలరు. ఈ క్రమంలో వివిధ పుస్తకాలను ప్రణాళికాబద్ధంగా చదవడమెలా? చదివే అంశాలను వేగంగా, అర్థవంతంగా చదవడానికి ఎలాంటి పద్ధతులు అవలంబించాలి? లాంటి విషయాలను తెలుసుకుందాం..

పట్టిక తయారీ

మీరు ఒక అంశానికి సంబంధించిన విషయాలను చదువుతున్నప్పుడు అందులో మీకు మీరే కొన్ని ప్రత్యేకమైన విభాగాలను తయారు చేసుకోవాలి. ఉదాహరణకు చరిత్రను చదవాలంటే నాయకులు, దేశాలు, ముఖ్యమైన తేదీలు మొదలైన విషయాలన్నింటికీ ప్రత్యేకంగా పట్టికలు తయారు చేసి పెట్టుకోవాలి. అలాగే గణితం, భౌతిక శాస్త్రం లాంటి విషయాలకు వస్తే నిర్వచనాలు, ఫార్ములాలు, శాస్త్రవేత్తలకు సంబంధించిన వివరాలు విడిగా వేటికవే పట్టికల రూపంలో రాసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చదివే విషయాల మీద ఆసక్తితో పాటు అవగాహన కూడా పెరుగుతుంది.

మననం చేస్తున్నారా?

ఏ విషయాన్నైనా కేవలం ఒకసారి చదివి వదిలేస్తే ఏమీ గుర్తుండదు. అందుకే మీరు తయారు చేసుకున్న నోట్సులోని విషయాలను వీలు చిక్కినప్పుడల్లా మననం చేసుకోవాలి. అభ్యాసం చేయనిదే ఏ పనీ సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

స్పీడ్ రీడింగ్

పఠనంలో వేగాన్ని పెంపొందించే పద్ధతే 'స్పీడ్ రీడింగ్'. పాఠాలను ఆసక్తిగా చదివే విద్యార్థులు నిమిషానికి దాదాపుగా 600 - 800 పదాల వరకు అవలీలగా పూర్తి చేయగలరు. అయితే ఇలా చదవాలంటే పెదాల కన్నా కళ్లకే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. పూర్తి ఏకాగ్రతతో దృష్టి మొత్తం చదివే అంశాల పైనే నిలపాలి. ఈ పద్ధతి నిరంతర సాధనతో గానీ సాధ్యం కాదు.

పవర్ రీడింగ్

ఇది కూడా స్పీడ్ రీడింగ్‌లో ఒక పద్ధతి. ఈ విధానంలో చదివేటప్పుడు పుస్తకంలోని విషయాన్ని వేగంగా గ్రహించడానికి కూడా కొన్ని కిటుకులుంటాయి. చదువుతున్నప్పుడు అప్రధానమైన విషయాలకు ప్రాధాన్యం తగ్గించి, వ్యర్థ పదాలను విస్మరిస్తూ, ఉపయోగకరమైన విషయాలను మనసులో నిక్షిప్తం చేసుకుంటూ పఠనాన్ని కొనసాగించడమే పవర్ రీడింగ్. సాధ్యమైనంత వరకు ఏ పుస్తకాన్ని చదివినా విలువైన సమాచారాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకొనేలా తర్ఫీదునిచ్చేదే 'పవర్ రీడింగ్'. కాలహరణాన్ని నివారించి ఒక సబ్జెక్టులోని విషయాలను వీలైనంత వరకు తక్కువ సమయంలోనే విద్యార్థి సంగ్రహించాలంటే అది 'పవర్ రీడింగ్'తోనే సాధ్యం.

విశ్లేషణ ముఖ్యం

కొన్ని అంశాలు కేవలం చదవడం వల్లే అర్థమైపోతాయనుకుంటే పొరపాటే. లోతైన విశ్లేషణ కూడా అవసరమే. అయితే ఈ విశ్లేషణ అనేది విద్యార్థి తనకు తానుగా చదివే ప్రతీ అంశాన్ని సమీక్షించుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది.

మైండ్ మ్యాపింగ్

చదివే పద్ధతుల్లో సృజనాత్మకతకు పెద్దపీట వేసే విధానమే 'మైండ్ మ్యాపింగ్'. ఈ పద్ధతిలో ప్రత్యేకమైన గుర్తులు, బొమ్మలు, చిహ్నాల ద్వారా చదివే అంశాలను గుర్తుంచుకొనే ప్రయత్నం చేయవచ్చు.

మీకనువైన పద్ధతినే ఎంచుకోండి

చదివే విధానాన్ని మెరుగుపరచుకోవడానికి అనేక పద్ధతులు ఉండచ్చు. అయితే సాధ్యమైనంత వరకు సౌకర్యంగా, సౌలభ్యంగా ఉండే విధానాన్నే ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే, ఒకరి విజయానికి కారణమైన పద్ధతి మరొకరి విషయంలో ఫలించకపోవచ్చు.

ప్రణాళిక అవసరం

చదివే పద్ధతితో పాటు, చదవాల్సిన అంశాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోతే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఎప్పుడు, ఎలా, ఏ పాఠ్యాంశాన్ని చదవాలో ముందు మీకు మీరుగా ఒక ప్రణాళిక రచించుకోవాలి. దాని ప్రకారమే చదువు కొనసాగేలా చూసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్