Kitchen: వంటింట్లోనే.. తాజాగా!

కూరల్లో తాజా కొత్తిమీర, పుదీనా పడితే రుచే మారిపోతుంది కదా! వాటిని వంటింట్లోనే పెంచేసుకోండి. మొక్కలు పెంచిన అనుభూతితోపాటు కిచెన్‌ కూడా పరిమళాలతో నిండిపోతుంది. పెద్ద శ్రమా అవసరం లేదు.

Published : 13 May 2023 00:15 IST

కూరల్లో తాజా కొత్తిమీర, పుదీనా పడితే రుచే మారిపోతుంది కదా! వాటిని వంటింట్లోనే పెంచేసుకోండి. మొక్కలు పెంచిన అనుభూతితోపాటు కిచెన్‌ కూడా పరిమళాలతో నిండిపోతుంది. పెద్ద శ్రమా అవసరం లేదు.

* కొత్తగా పెంచుతున్నారా? విత్తనాలు విత్తి మొక్కలు మొలిపిద్దామనే ప్రయత్నం వద్దు. తీరా అవి రాకపోతే నిరాశ. మార్కెట్‌లో కొనేప్పుడే మంచి సువాసన ఇచ్చేవి వేర్లతో సహా ఉన్నవి ఎంచుకోండి. వాటిని కాడల వరకూ కత్తిరించి, వేర్లు నీళ్లలో మునిగేలా ఏదైనా పాత్రలో ఏర్పాటు చేస్తే సరి.

* ఎక్కడ పెంచుతున్నామన్న దానిపైనా మొక్క పెరుగుదల ఆధారపడి ఉంటుంది. కాబట్టి, నీళ్లలో ఉంచిన మొక్కలకు కొత్తవేర్లు రావడం మొదలయ్యాక మట్టికుండీలోకి మార్చండి. వీటికి కనీసం 4-5 గం. సూర్యరశ్మి అవసరం. అలాగే ఎక్కువ గాలినీ తట్టుకోలేవు కాబట్టి, గాలి పెద్దగా వీచని ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ ఉంచండి. ఆరోగ్యంగా పెరుగుతాయి. అతి నీటినీ తట్టుకోలేవు. ఉదయం కొద్ది మొత్తంలో నీరందిస్తే చాలు.

* చిన్న మొక్కలే కదాని చిన్న కుండీల్లో పెంచాలనుకోవద్దు. గుబురుగా పెరుగుతాయి కాబట్టి, స్థలం సరిపోదు. దీంతో సరిగా ఎదగలేవు. ఎప్పటికప్పుడు ఆకులను కత్తిరించి వాడుకోండి. త్వరగా పెరగడమే కాదు.. సువాసనలూ వెదజల్లుతాయి. కత్తిరించడం కూడా ఉదయాన్నే చేస్తే మేలట. తాజాగా ఉండటమే కాదు ఎక్కువ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ని కలిగి ఉంటాయి. ఆహారానికి అదనపు పోషకాలతోపాటు రుచినీ అందిస్తాయి.

* మొక్కల ఆరోగ్యం కోసమని ఎరువులు అందించడం మామూలే. అయితే నైట్రోజన్‌ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. చాలావరకూ సేంద్రియ ఎరువులకు ప్రాముఖ్యం ఇస్తేనే మంచిది. వాటినీ ఉదయం లేదా సాయంత్రం చల్లగా ఉన్న సమయంలోనే అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్