వుడెన్ ఫర్నిచర్.. సంరక్షణ ఇలా..!

ఇంటి అలంకరణలో భాగంగా చెక్కతో తయారుచేసిన గృహోపకరణాలను కూడా ఈమధ్య విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే వాటి మన్నిక, నాణ్యత దెబ్బతినకుండా ఉండాలంటే కాలానుగుణంగా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు....

Published : 18 Jun 2022 17:41 IST

ఇంటి అలంకరణలో భాగంగా చెక్కతో తయారుచేసిన గృహోపకరణాలను కూడా ఈమధ్య విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే వాటి మన్నిక, నాణ్యత దెబ్బతినకుండా ఉండాలంటే కాలానుగుణంగా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు ఇంటీరియర్ నిపుణులు. అప్పుడే అవి ఎప్పుడూ కొత్తవాటిలా మిలమిలా మెరుస్తూ ఉంటాయట! వచ్చేది వర్షాకాలం కాబట్టి వుడెన్ ఫర్నిచర్ సంరక్షణలో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనమూ తెలుసుకుందాం రండి..!

వర్షాకాలంలో వాతావరణంలో తేమ అధికశాతంలో ఉంటుంది. ఇది చెక్కతో తయారైన ఉపకరణాలు త్వరగా పాడైపోయేలా చేస్తుంది. కాబట్టి తేమ నుంచి వాటికి తగిన రక్షణ కల్పించడం తప్పనిసరి. ఈ క్రమంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు..

గోడకు ఆనించద్దు..!

సోఫా, దివాన్.. వంటి కొన్ని ఫర్నిచర్లను చాలామంది గోడకి ఆనించి వేస్తారు. ఇంట్లో కాస్త ఖాళీ స్థలం కనిపించేలా చేయడం కోసం ఈ చిట్కాని అనుసరించినా వర్షాకాలంలో మాత్రం ఇది మంచిది కాదు. వర్షానికి తడిసే గోడల్లో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. చెక్కతో తయారైన వస్తువులు గోడలకు ఆనించి ఉండడం వల్ల ఈ తేమ వాటిలో కూడా చేరి వాటి నాణ్యత, మన్నికని దెబ్బ తీసి త్వరగా పాడైపోయేలా చేయచ్చు. కాబట్టి వర్షాకాలంలో మాత్రం వుడెన్ ఫర్నిచర్‌ని గోడలకు కనీసం ఆరు అంగుళాల దూరంలో ఉండేలా చూసుకోవాలి.

నేరుగా జల్లులు పడకుండా..

చల్లని గాలి కోసం సౌకర్యవంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో చెక్కతో చేసిన కుర్చీలు, సోఫాలు.. వంటివి కిటికీలు, తలుపులకు దగ్గరలో పెడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఈ కాలంలో కురిసే వర్షపు చినుకులు నేరుగా వాటి మీద పడే అవకాశాలుంటాయి. ఫలితంగా అవి తడిసిపోయి త్వరగా పాడైపోతాయి. అలాగే వాటిలో తేమ శాతం మరీ ఎక్కువైనప్పుడు చూసుకోకపోతే బూజు లేదా నాచు.. వంటివి పడుతూ ఉంటాయి. ఫలితంగా రకరకాల బ్యాక్టీరియా, వైరస్‌లకు అవి నిలయాలుగా మారచ్చు. కాబట్టి నేరుగా జల్లులు పడే ప్రదేశాల్లో వీటిని అమర్చకూడదు.

తేమ నిలవకుండా..

నేరుగా కురిసే చినుకుల ద్వారానే కాకుండా గాల్లో ఉండే తేమ వల్ల కూడా చెక్కతో తయారైన ఉపకరణాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉండేందుకు వుడెన్ ఫర్నిచర్‌కు ఉపయోగించిన పాలిష్‌కి అనుగుణంగా లక్క లేదా వార్నిష్ కోట్ వేయించాలి. ఫలితంగా వాటిలో తేమ చేరకుండా ఎక్కువ కాలం నాణ్యతతో మన్నుతాయి. కనీసం రెండు సంవత్సరాలకోసారి ఇలా చేయడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది.. కాలక్రమేణా చెక్క మధ్యలో ఏర్పడే రంధ్రాలు కూడా ఎప్పటికప్పుడు కవర్ అయిపోయి నాణ్యత చెక్కుచెదరకుండా ఉంటాయి. అలాగే తరచూ వేసే వార్నిష్ లేదా లక్క కోటింగ్‌ల కారణంగా అవి కొత్తవిలా మెరుస్తాయి.

ఎప్పటికప్పుడు శుభ్రంగా..

వర్షాకాలంలో చెక్కతో తయారైన వస్తువులను కనీసం నెలకి ఒకసారైనా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మెత్తని పొడివస్త్రంతో వాటిపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించాలి. అయితే వుడెన్ ఫర్నిచర్‌ని తుడవడానికి తడి వస్త్రాన్ని ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ తడి ద్వారా తేమ చెక్క వస్తువుల్లో చేరే అవకాశాలుంటాయి. కాబట్టి పొడివస్త్రంతోనే ఫర్నిచర్ మూలలు, కింద, వెనుకభాగంలో కూడా జాగ్రత్తగా శుభ్రం చేయాలి.

పొడిగా ఉండేందుకు..

వుడెన్ ఫర్నిచర్‌లో తేమ చేరకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో; వాటిని పొడిగా ఉండేలా జాగ్రత్తపడడం కూడా అంతే అవసరం. ఈ క్రమంలో నాఫ్తలీన్ బాల్స్ లేదా కర్పూరం వంటివి వాటి మధ్య ఉంచడం వల్ల గాల్లో అధికంగా ఉన్న తేమని అవి గ్రహిస్తాయి. ఫలితంగా ఫర్నిచర్ పాడవకుండా ఉంటుంది. వీటికి బదులుగా ఇంట్లో లభ్యమయ్యే లవంగాలు, వేపాకులు.. వంటివి కూడా ఉపయోగించవచ్చు. ఇవి ఫర్నిచర్‌లో చెదలు, పురుగులు.. మొదలైనవి చేరకుండా కూడా సంరక్షిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్