Published : 08/11/2021 19:15 IST

కష్టాలకు ఎదురొడ్డి.. నాన్న కల నెరవేర్చింది!

(Photo: Twitter)

జీవితంలో మనం పడ్డ కష్టాలే మనకు లక్ష్యం మీద కసి పెంచుతాయి. మనల్ని విజయతీరాలకు చేర్చుతాయి. తమిళనాడులోని ఓ మారుమూల గిరిజన ప్రాంతంలో పుట్టిపెరిగిన సంఘవి మునియప్పన్‌ జీవితం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కటిక పేదరికంలో పుట్టిన ఆమె.. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఇలాంటి ఎన్నో కష్టాలను చవిచూసింది. అయినా వాటికి తల వంచి అక్కడే ఆగిపోవాలనుకోలేదు. తండ్రి ప్రోత్సాహంతో ఏకంగా డాక్టర్‌ చదవాలని నిర్ణయించుకుంది. అయితే మధ్యలోనే తండ్రి అకాల మరణం ఆమెను కుంగదీసినా.. ఆ బాధను దిగమింగుతూ లక్ష్యం వైపు అడుగేసింది. ఫలితంగా ఇటీవలే విడుదలైన నీట్‌ ఫలితాల్లో మంచి మార్కులతో ఎంబీబీఎస్‌ సీటుకు అర్హత సాధించింది. అంతేకాదు.. తన కమ్యూనిటీ నుంచి ఉన్నత చదువులు చదివి, నీట్‌ సీటు సంపాదించిన తొలి గిరిజన అమ్మాయిగానూ నిలిచింది సంఘవి.

తమిళనాడులోని మలసర్ కమ్యూనిటీకి చెందిన సంఘవి మునియప్పన్ M Nanjappanur అనే గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగింది. ఆ ప్రాంతంలో నివసించే వ్యవసాయ కూలీలు మునియప్పన్‌, వసంతమణి అనే దంపతులకు ఒక్కగానొక్క కూతురామె. ఒక చిన్న పూరి గుడిసెలోనే వాళ్లు నివాసం ఉంటున్నారు. ఇక వర్షాకాలంలో వారి అవస్థలు వర్ణనాతీతం! రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నా తన ఒక్కగానొక్క కూతురిని డాక్టర్‌ చదివించాలని నిర్ణయించుకున్నాడు సంఘవి తండ్రి.

తొలిసారి చేజారినా..!

ఆయన ఆశయానికి తన తపన కూడా తోడవడంతో.. తన కుటుంబ పరిస్థితుల్ని పక్కన పెట్టి చదువు పైనే పూర్తి శ్రద్ధ పెట్టింది సంఘవి. రెండేళ్ల క్రితం వరకు తమ ప్రాంతానికి విద్యుత్‌ సదుపాయం లేకపోవడంతో దీపాల వెలుగులోనే ఒక్కో తరగతి పూర్తి చేసింది. అలా అక్కడికి దగ్గర్లోని పిచనూర్‌ ప్రభుత్వ కళాశాలలో పన్నెండో తరగతి పూర్తి చేసి.. 2017-18లో నీట్‌ పరీక్షలు రాసింది. అయితే తొలి ప్రయత్నంలో అర్హత సాధించకపోయినా కష్టపడి చదివి రెండోసారి విజయం సాధించిందీ గిరిజన అమ్మాయి.
‘డాక్టరై నా కమ్యూనిటీ ప్రజలకు సేవ చేయాలనేదే నా జీవితాశయం. అయితే తొలిసారి నీట్‌ పరీక్షల్లో అర్హత సాధించకపోయేసరికి నిరాశ పడ్డా.. నిస్సహాయత నన్ను ఆవహించింది. అలాగని నా లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. పోనీ ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరడానికి నా ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. కానీ కొంతమంది దాతలు సహకరించడంతో కొన్ని నెలల పాటు కోచింగ్‌ తీసుకోగలిగా. పట్టుదలతో చదివా.. 202 మార్కులతో ఎంబీబీఎస్‌ సీటుకు అర్హత సాధించా..’ అంటోంది సంఘవి.

నాన్న మరణం కుంగదీసినా..!

గతేడాది నీట్‌ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న క్రమంలోనే అకస్మాత్తుగా తన తండ్రిని కోల్పోయింది సంఘవి. దీంతో వాళ్ల కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అయితే తన తల్లికి కంటి చూపు పాక్షికంగా ఉండడంతో పనికి వెళ్లలేని పరిస్థితి! ఇలాంటి దీన స్థితి నుంచి తన కుటుంబాన్ని బయటపడేయాలన్న ఆలోచనొక్కటే తన మనసులో నింపుకొన్న సంఘవి.. ఈ క్రమంలో తన తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగి మరీ పరీక్షలకు సన్నద్ధమైంది. అనుకున్నట్లుగానే రెండోసారి పరీక్షల్లో విజయం సాధించి తన తపనను, తన తండ్రి కలను ఒకేసారి నెరవేర్చుకుంది. దీంతో తన కమ్యూనిటీ నుంచి పైచదువులు చదివి, నీట్‌ పరీక్షల్లో అర్హత సాధించిన తొలి గిరిజన యువతిగా నిలిచిందామె.

అంతేకాదు.. తొలిసారి నీట్‌ పరీక్షల్లో ఫెయిలయ్యాక ఓ పాలిటెక్నిక్‌ కళాశాలలో చేరింది సంఘవి. అయితే కమ్యూనిటీ సర్టిఫికెట్‌ లేకపోవడంతో వారం తిరక్కుండానే కాలేజీ మానేయాల్సి వచ్చింది. అయినా పోరాటం చేసి గతేడాది కమ్యూనిటీ సర్టిఫికెట్‌ కూడా సంపాదించింది. దీంతో తన ప్రాంతం నుంచి ఉన్నత చదువులు చదివి కమ్యూనిటీ సర్టిఫికెట్‌ పొందిన తొలి వ్యక్తిగానూ నిలిచింది.

ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు కోసం ఉవ్విళ్లూరుతోన్న సంఘవి.. తన వైద్య విద్యకయ్యే ఖర్చును భరించే దాత కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు తన విజయాన్ని తన ప్రాంత ప్రజలే కాదు.. అక్కడి మంత్రులు, కలెక్టర్‌ కూడా ఆమె ఇంటికెళ్లి ప్రశంసించారు.

తనను చూసి స్ఫూర్తి పొంది.. తన ప్రాంతానికి చెందిన ప్రజలు ఇకనైనా తమ పిల్లలకు విద్యాఫలాలు అందిస్తే అంతకన్నా ఆనందం మరొకటి లేదంటోన్న ఈ ట్రైబల్‌ గర్ల్‌ విజయం నేటి యువతకు ఆదర్శప్రాయం!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని