Ice tea recipes: వేసవిలో చల్లచల్లని టీలు.. మీకోసమే!

పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంలో 'టీ'ది కీలకపాత్ర అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా టీ అంటే తేయాకు పొడి, పాలతో చేసే వేడి వేడి పానీయమే మనందరికీ తెలుసు. కానీ అటు ఆరోగ్యంతో పాటు ఇటు వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించి చల్లదనాన్ని......

Updated : 24 Mar 2022 13:09 IST

పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంలో 'టీ'ది కీలకపాత్ర అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా టీ అంటే తేయాకు పొడి, పాలతో చేసే వేడి వేడి పానీయమే మనందరికీ తెలుసు. కానీ అటు ఆరోగ్యంతో పాటు ఇటు వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించి చల్లదనాన్ని అందించే 'ఐస్డ్ టీ'లకు ఇప్పుడు ఆదరణ ఎక్కువవుతోంది. ఈ క్రమంలో- నిమ్మ, పుచ్చకాయ, రాస్బెర్రీ.. వంటి పండ్లతో కొన్ని ఐస్డ్ టీలు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం రండి.

పుచ్చకాయ-తులసి టీ

కావాల్సినవి

* మరిగించిన నీరు - 10 కప్పులు

* టీ బ్యాగులు - 10

* చిన్నగా కట్ చేసిన పుచ్చకాయ ముక్కలు - ఒక కప్పు

* తులసి ఆకులు - అర కప్పు

* చక్కెర - రుచికి సరిపడా

తయారీ

ముందుగా మరిగించిన నీటిలో టీ బ్యాగుల్ని వేసి పది నిమిషాల పాటు ఉంచాలి. ఆపై వాటిని తొలగించి ఆ నీటిని గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక్కో కప్పు లేదా గ్లాసులో ఆ నీటిని పోసి అందులో పుచ్చకాయ ముక్కలు, తులసి ఆకులు, సరిపడా చక్కెర వేసి ఆఖరున ఐస్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే సరి.. పుచ్చకాయ-తులసి ఐస్డ్ టీ సిద్ధం. శరీరంలోని వేడిని దూరం చేసి చల్లదనాన్ని పంచుతుందీ ఛాయ్.


కీరా-పుదీనా టీ

కావాల్సినవి

* నీళ్లు - 4 కప్పులు

* గ్రీన్ టీ బ్యాగులు - 4

* పుదీనా ఆకులు - అరకప్పు

* చెక్కు తీసి చిన్నగా తరిగిన కీరా ముక్కలు - ఒక కప్పు

* తేనె - పావు కప్పు

* నిమ్మరసం - పావు కప్పు

తయారీ

నాలుగు గ్రీన్ టీ బ్యాగుల్ని నాలుగు కప్పుల నీళ్లలో వేసి అందులోనే కీరా దోస ముక్కలు, పుదీనా ఆకుల్ని వేసి పావుగంట పాటు సిమ్‌లో మరిగించుకోవాలి. ఆపై ఈ మిశ్రమం చల్లారాక వడకట్టుకొని దీనికి నిమ్మరసం, తేనె, ఐస్ ముక్కలు చేర్చుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎండలో నుంచి ఇంటికి వచ్చిన అతిథులకు ఈ టీని అందించచ్చు.


నిమ్మరసం-అల్లం టీ

కావాల్సినవి

* బ్లాక్ టీ బ్యాగులు - 5

* నీళ్లు - 5 కప్పులు

* నిమ్మకాయలు - 2 (స్త్లెసుల్లా కట్ చేసుకోవాలి)

* అల్లం తురుము - రెండు టీస్పూన్లు

* తేనె - పావు కప్పు

తయారీ

ముందుగా టీ బ్యాగుల్ని నీటిలో వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని గది ఉష్ణోగ్రత వద్ద చల్లార్చుకోవాలి. ఆలోపు గ్లాసుల్లో నిమ్మ స్త్లెసెస్, అల్లం తురుము వేసి రడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు చల్లారిన నీటిలోని టీ బ్యాగుల్ని తొలగించి ఆ నీటిని గ్లాసుల్లో పోసుకోవాలి. ఆఖరున తేనె, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఎండ వల్ల అలసిన మెదడును పునరుత్తేజితం చేస్తుంది.


రాస్బెర్రీ ఐస్డ్ టీ

కావాల్సినవి

* నీళ్లు - 5 కప్పులు

* టీ బ్యాగులు - 5

* రాస్బెర్రీలు - కప్పు

* తేనె లేదా చక్కెర - రుచికి సరిపడా

తయారీ

ముందుగా నీటిని మరిగించి దించి అందులో టీ బ్యాగుల్ని వేయాలి. పది నిమిషాల తర్వాత టీ బ్యాగుల్ని తొలగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో కొన్ని నీళ్లు, రాస్బెర్రీలు తీసుకొని కాసేపు మరిగించుకోవాలి. చల్లారాక దీన్ని వడకట్టుకొని ముందుగా పక్కన పెట్టుకున్న టీ మిశ్రమంలో కలుపుకోవాలి. చివరగా తేనె, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టీ ద్వారా 23 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 88 క్యాలరీల శక్తి మనకు అందుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్