Belly fat: ఏ పొట్ట అయినా సరే.. ఇలా తగ్గించుకోవచ్చు!

ఒత్తిడితో సతమతమైనా, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత తలెత్తినా, డెలివరీ తర్వాత.. ఇలా వివిధ సందర్భాలలో పొట్ట పెరిగిపోవడం మనకు తెలిసిందే! పొట్ట చుట్టూ ఉండే అవయవాల్లో కొవ్వులు పేరుకుపోవడమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు.

Updated : 29 Oct 2023 09:46 IST

ఒత్తిడితో సతమతమైనా, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత తలెత్తినా, డెలివరీ తర్వాత.. ఇలా వివిధ సందర్భాలలో పొట్ట పెరిగిపోవడం మనకు తెలిసిందే! పొట్ట చుట్టూ ఉండే అవయవాల్లో కొవ్వులు పేరుకుపోవడమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. నిజానికి ఇలా పెరిగిపోయిన పొట్టంటే ఎవరికీ నచ్చదు.. వెంటనే దీన్ని తగ్గించుకొని తిరిగి నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంటారు.  అయితే ఒకరకంగా ఈ ఆలోచన మంచిదే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన చెడు కొవ్వు ఎప్పటికైనా ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని ఎంత త్వరగా తగ్గించుకుంటే అంత మంచిదంటున్నారు. అంతేకాదు.. ఏ పొట్టను ఎలా తగ్గించుకోవాలో వివరిస్తూ కొన్ని చిట్కాలు సైతం సూచిస్తున్నారు.

ప్రసవానంతర పొట్టా?!

డెలివరీ అయ్యాక కూడా పొట్ట ఎత్తుగా కనిపించడం సహజమే! అయినా దీన్ని అంగీకరించడానికి చాలామంది మహిళలు ఇష్టపడరు. ఈ క్రమంలో వెనువెంటనే పొట్ట తగ్గించుకొని తిరిగి నాజూగ్గా మారాలని ఆరాటపడుతుంటారు. ఒత్తిడికీ గురవుతుంటారు. దీనివల్ల ఆరోగ్యానికి నష్టం తప్ప మరే ప్రయోజనం ఉండదు. అందుకే ఒత్తిడికి లోనవకుండా, చక్కటి జీవనశైలిని పాటిస్తే కొన్ని రోజుల్లోనే మార్పు గమనించచ్చంటున్నారు నిపుణులు.

ఈ క్రమంలో ప్రసవం అయ్యాక ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాత గైనకాలజిస్ట్‌ సలహా మేరకు చిన్న చిన్న వ్యాయామాలు మొదలుపెట్టచ్చు. ఈ క్రమంలో నడక, పాపాయిని ఎత్తుకొని కాసేపు అటూ ఇటూ నడవడం, యోగా, ధ్యానం.. ఇలా కుట్లపై ఒత్తిడి పడని వ్యాయామాల్ని సాధన చేయచ్చు. అలాగే కీగల్‌ వ్యాయామాలు కూడా వదులైన చర్మం బిగుతుగా మారడానికి దోహదం చేస్తాయి. ఇక ఆహారం విషయానికొస్తే.. నట్స్‌, డ్రైఫ్రూట్స్‌, ఆలివ్‌ నూనె, అవకాడో.. వంటి మంచి కొవ్వుల్ని తీసుకోవాలి. నిపుణుల సలహా మేరకు పోస్ట్‌ పార్టమ్‌ స్లిమ్మింగ్‌ బెల్ట్‌, చీర చుట్టుకోవడం.. వంటివి ప్రయత్నించచ్చు.

కూర్చొని తింటే లావైపోరూ!

కొంతమందికి శరీర పైభాగం స్లిమ్‌గా ఉంటుంది.. అదే పొట్ట దగ్గరికొచ్చేసరికి కాస్త లావుగా కనిపిస్తుంది.. దీంతో పొట్ట కింది భాగాలు కూడా లావెక్కినట్లే కనిపిస్తాయి. ఇందుకు రెండు కారణాలుండచ్చంటున్నారు నిపుణులు. మొదటిది - ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్‌ఫుడ్‌-ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు అలవాటు పడడం.. వంటి వాటి వల్ల పొట్ట చుట్టూ కొవ్వులు పేరుకుపోతాయి.

ఇక రెండోది - జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్‌ సమస్యల వల్ల ఎప్పుడు చూసినా పొట్ట ఉబ్బరంగా కనిపిస్తుంటుంది.

మరి, ఇలాంటి పొట్టను తగ్గించుకోవాలంటే.. పీచు అధికంగా ఉండే బీన్స్‌, బ్రకలీ, బెర్రీ పండ్లు, అవకాడో, యాపిల్‌, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్‌.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇందులోని ఫైబర్.. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇక నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కాయగూరలు తీసుకున్నా ఫలితం ఉంటుంది. వీటితో పాటు పొట్టపై ఒత్తిడి పడే కోర్‌ వ్యాయామాలు, బరువులెత్తడం, మెట్లెక్కడం.. వంటివి సాధన చేయచ్చు. తద్వారా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరగడంతో పాటు అక్కడి కండరాలు కూడా దృఢమవుతాయి.

హార్మోన్లే బద్ధ శత్రువులు!

మన ఆహారపుటలవాట్లు, జీవనశైలి మార్పులు శరీరంలో హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అలాగే మనసులో కలిగే ఆందోళనలు-ఒత్తిడి వల్ల ఒత్తిడి హార్మోన్‌ కార్టిసాల్‌ స్థాయులు కూడా పెరిగిపోతాయి. పొట్ట ఎత్తుగా కనిపించడానికి ఇవే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. మరి, ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు జీవనశైలి మార్పులు అవసరం అంటున్నారు.

ఇందుకోసం.. యోగా, ధ్యానం.. వంటివి సహకరిస్తాయి. ఇవి సాధన చేయడం వల్ల రాత్రుళ్లు నిద్ర కూడా చక్కగా పడుతుంది.. ఫలితంగా శరీరం పునరుత్తేజితం అవుతుంది. అలాగే అనారోగ్యకరమైన కొవ్వులు నిండి ఉండే జంక్‌ ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, నూనె సంబంధిత పదార్థాలను దూరం పెట్టి.. ఆరోగ్యకరమైన కొవ్వులు నిండి ఉన్న చేపలు, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌.. వంటివి తీసుకోవాలి. అత్యవసరమైతే హార్మోన్ల సమతుల్యత సాధించడానికి డాక్టర్‌ పర్యవేక్షణలో మందులు కూడా వాడచ్చు.

ఇక వీటితో పాటు బరువు ఎక్కువగా ఉన్న వారు, స్థూలకాయుల్లో కూడా పొట్ట లావుగానే ఉంటుంది. కాబట్టి పొట్ట పెరిగిపోవడానికి కారణమేదైనా సరే.. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు పాటించడం, తీసుకునే ఆహారంలో చక్కెర తగ్గించడం, వ్యాయామాలు చేయడం.. వంటివి రోజువారీ అలవాట్లుగా మార్చుకుంటే సమస్య నుంచి త్వరగా విముక్తి పొందచ్చు.. ఆరోగ్యంగానూ ఉండచ్చు..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్