Published : 09/03/2022 17:38 IST

ఈ పసివాళ్లేం పాపం చేశారు.. వాళ్లకెందుకీ శిక్ష?!

నడి వీధుల్లో అభం శుభం తెలియని చిన్నారుల ఆర్తనాదాలు.. ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆతృతతో చంకలో చంటి బిడ్డలనెత్తుకొని సరిహద్దులు దాటుతోన్న తల్లులు.. ఎటు నుంచి ఏ బాంబు దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ బంకర్లలో తలదాచుకున్న కుటుంబాలు.. ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతోన్న భీకర యుద్ధంలో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలెన్నో! ‘పచ్చటి కాపురాల్ని చీల్చి, గూళ్లను చిదిమేసి, కుటుంబాల్లో ఒకరిని ఒకరికి కాకుండా చేస్తోన్న ఈ యుద్ధం రష్యా సైనిక చర్య కాదు.. ఉక్రెయిన్‌ పౌరులపై జరుపుతోన్న నరమేధం’ అంటూ విరుచుకుపడ్డారు ఆ దేశ తొలి మహిళ వొలెనా జెలెన్‌స్కా. రష్యా దాడుల్ని ప్రతిఘటిస్తూ.. తమ దేశ పౌరుల దుస్థితిని కళ్లకు కడుతూ.. ఈ ప్రపంచానికి తాజాగా ఆమె ఓ బహిరంగ లేఖ రాశారు. ఎంతోమంది మనసుల్ని మెలిపెడుతోన్న ఆ లేఖ సారాంశమే ఇది!

వొలెనా జెలెన్‌స్కా.. ఉక్రెయిన్‌ ప్రథమ మహిళగానే కాదు.. ఆ దేశ ప్రజల మనిషిగా మన్ననలందుకున్నారామె. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ.. తమ ప్రజలకు అండగా ఉంటోన్న ఆమె.. తమ దేశ పౌరుల దుస్థితిని చూసి బరువెక్కిన హృదయంతో ఓ సుదీర్ఘ లేఖ రాశారు. ఈ హృదయ విదారక ఘటనల గురించి తెలుసుకొని శత్రుదేశం ఇకనైనా పట్టు వీడాలని ఆమె కోరారు. ఇంతకీ, ఆ లేఖలో ఏముందంటే..!

ఇది సైనిక చర్య కాదు.. నరమేధం!

‘రెండు వారాలకు పూర్వం మా దేశం శాంతిభద్రతలకు ఆలవాలంగా ఉండేది. ఇక్కడి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని కుటుంబాలు సుఖ జీవితం గడిపేవారు. అయితే ఫిబ్రవరి 24న నిద్ర లేచేసరికే రష్యా తన సేనలతో మాపై దండెత్తి వచ్చిందన్న విషయం తెలిసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. అప్పటికే రష్యా యుద్ధ ట్యాంకులు మా దేశ సరిహద్దులు దాటి లోనికి ప్రవేశించాయి. మా గగనతలం శత్రు సేనల యుద్ధ విమానాలతో నిండిపోయింది.. క్షిపణి లాంఛర్లు నగరాల్ని చుట్టుముట్టాయి. దీన్ని ప్రత్యేక సైనిక చర్య అని ప్రచారం చేస్తున్నప్పటికీ.. నిజానికి ఇది ఉక్రెయిన్‌ పౌరులపై జరుపుతోన్న సామూహిక నరమేధం..! ఇక్కడ అతిభయంకరమైన విషయమేంటంటే.. ఈ యుద్ధంలో అభం శుభం తెలియని చిన్నారులు బలవుతున్నారు. ఒఖ్తిర్కా వీధిలో తీవ్రంగా గాయపడిన ఎనిమిదేళ్ల అలైస్‌ను కాపాడుకోవడానికి ఆమె తాతయ్య చేసిన ప్రయత్నం విఫలమైంది. కీవ్‌లో జరిగిన షెల్లింగ్‌ దాడిలో పొలీనా తన తల్లిదండ్రులతో పాటే ప్రాణాలు కోల్పోయింది. వరుస బాంబు దాడుల ప్రభావంతో శిథిలాల కింద కూరుకుపోయి తీవ్రంగా గాయపడిన పద్నాలుగేళ్ల అర్సెనీ సమయానికి వైద్యం అందక అసువులు బాశాడు. ‘ఇది పౌరులపై జరుగుతోన్న దాడి కాదు’ అని రష్యా చెబుతున్నప్పుడల్లా.. నేను ముందు ఈ పిల్లల గురించే ప్రస్తావిస్తాను.

తల్లీపిల్లల దీనావస్థలివి!

ఇవే కాదు.. ఎంతోమంది మహిళలు, పిల్లలు బేస్‌మెంట్స్‌, బంకర్లలో తలదాచుకుంటున్నారు. నిరాశ్రయులై కీవ్‌, ఖార్కివ్‌ మెట్రో స్టేషన్లలో తమ పిల్లలు, పెంపుడు జంతువులతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరికొన్ని నగరాలపై విచక్షణా రహితంగా బాంబు దాడులు జరపడంతో అక్కడి ప్రజలు రోజుల తరబడి బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనే మరికొందరు పసి బిడ్డలు జన్మించాల్సి వస్తోంది. ఇక మధుమేహం, ఆస్తమా, క్యాన్సర్‌.. వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి జరగాల్సిన రోజువారీ చికిత్సలు ఆగిపోయాయి.

మరోవైపు మా వీధులన్నీ శరణార్థులతో పోటెత్తుతున్నాయి. విసిగి వేసారి, నీరసించిన ఎంతోమంది మహిళలు తమ చిన్నారుల్ని తీసుకొని తమ కుటుంబాల్ని వీడలేక వీడిపోతున్నారు. ఇక పురుషులు తమ భార్యాబిడ్డల్ని శోకతప్త హృదయంతో సరిహద్దుల్లో వదిలి.. తిరిగి తమ బాధ్యతగా యుద్ధంలో పాల్గొంటున్నారు.. తద్వారా తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. ఇంత జరిగినా మా పౌరులు శత్రు సేనల్ని అక్కున చేర్చుకుంటున్నారు. తమ వద్ద ఉన్న ఆహార పానీయాలు అందిస్తూ వారి కడుపు నింపుతున్నారు. ఇలా శత్రువైనా సరే ఆపదలో ఆదుకోవాలన్న స్ఫూర్తిని రగిలిస్తున్నారు మా ప్రజలు.

వాళ్లకు రుణపడి ఉంటాం!

ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఫార్మసీలు, స్టోర్లు, ప్రజా రవాణా, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోన్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మా దేశ ప్రజల్ని తమ దేశంలోకి ఆహ్వానిస్తూ.. అన్ని వసతి సదుపాయాలు కల్పిస్తోన్న పొరుగు దేశాల అధికారులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఆఖరుగా.. ప్రపంచంలో ఉన్న ప్రజల్ని, దేశాధినేతల్ని నేను కోరుకునేది ఒక్కటే.. మీడియా, సోషల్‌ మీడియా ద్వారా మా దేశ ప్రజల దుస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మేము అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ శాంతియుత వాతావరణాన్నే కోరుకుంటున్నాం. ఈ యుద్ధం ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. ఇప్పటిలాగే ఇక ముందూ మీ మద్దతు మాకు లభించాలని కోరుకుంటున్నా..’ అంటూ తన భావోద్వేగాన్ని అక్షరీకరించారీ ఫస్ట్‌ లేడీ. ఇలా వొలెనా రాసిన లేఖ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని కదిలిస్తోంది. ‘మీరు ధైర్యంగా ఉండండి.. మీకు, మీ దేశ ప్రజలకు మేమున్నాం..’ అంటూ చాలామంది ఉక్రెయిన్‌కు మద్దతుగా కామెంట్లు షేర్ చేస్తున్నారు.


అర్ధాంగిగా.. అమ్మగా.. మొదటి మహిళగా..!

* ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ సతీమణిగా, ఆ దేశ ప్రథమ మహిళగానే కాదు.. అసలైన అర్ధాంగిగా, ఇద్దరు పిల్లల తల్లిగానూ తన బాధ్యతలన్నీ సమర్థంగా నిర్వర్తిస్తారామె. అందుకే ఉక్రెయిన్‌ ప్రజలు ఆమెను ‘ఉక్కు మహిళ’గా గౌరవిస్తారు.

* 1978లో ఉక్రెయిన్‌లోని క్రివీ రీలో జన్మించారు జెలెన్‌స్కా. అక్కడి నేషనల్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ చదివే క్రమంలో జెలెన్‌స్కీతో ప్రేమలో పడిందామె. ఆ తర్వాత ఎనిమిదేళ్ల పాటు డేటింగ్‌ చేసిన ఈ జంట.. 2003లో వివాహం చేసుకుంది. వీరికి అలెక్సాండ్రా జెలెన్‌స్కాయా అనే కూతురు, కెరిల్‌ జెలెన్‌స్కీ అనే కొడుకు ఉన్నారు.

* నటుడిగా ఉన్న తన భర్త ఒకప్పుడు రాజకీయాల్లోకి వస్తానంటే అయిష్టం వ్యక్తం చేసిన ఆమె.. ఇప్పుడు అర్ధాంగిగా ఆయన అడుగులో అడుగేస్తున్నానని చెబుతున్నారు. ‘నాకు ప్రైవేట్‌ లైఫ్‌స్టైల్‌ అంటే ఇష్టం. అందుకే అధ్యక్షుడిగా ఆయన తెరపై ఉంటే.. నేను మాత్రం తెర వెనుక ఆయన నీడలో ఉండడానికే మక్కువ చూపేదాన్ని..’ అంటారు జెలెన్‌స్కా. అయితే ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో తన మాటలతో ప్రజల్లో ధైర్యం నూరిపోస్తున్నారామె.

* వృత్తిరీత్యా కామెడీ రచయిత్రి అయిన జెలెన్‌స్కా.. ఆ దేశ ప్రథమ మహిళగా హోదా అందుకున్నాకా దీన్ని వీడలేదు. ప్రస్తుతం తన భర్త నెలకొల్పిన ‘క్వార్టల్‌ 95 స్టూడియో’ అనే ప్రొడక్షన్‌ కంపెనీలో స్క్రీన్‌ రైటర్‌గా కొనసాగుతున్నారామె.

* అంతులేని సేవానిరతి ఈ మొదటి మహిళ సొంతం. అక్కడి స్కూల్‌ పిల్లలకు పోషకాహారం అందించడానికి పలు కార్యక్రమాలు చేపట్టిన ఆమె.. లింగ అసమానత, గృహ హింస.. వంటి సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అంతేకాదు.. పాఠశాల ఆహార వ్యవస్థను ఆధునికీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారామె.

* జెలెన్‌స్కాకు ఫ్యాషన్‌ ఐకాన్‌గానూ పేరుంది. ఈ క్రమంలోనే తన అంతర్జాతీయ ట్రిప్స్‌ కోసం అక్కడి డిజైనర్లు రూపొందించిన విభిన్న సంప్రదాయ దుస్తులు ధరించి మెరిసిపోతుంటారామె. అంతేకాదు.. అంతర్జాతీయంగా వోగ్‌ వంటి పత్రికల కవర్‌ పేజీల పైనా ఫ్యాషనబుల్‌గా దర్శనమిస్తుంటారు.

* ఎక్కువగా ప్రైవసీని ఇష్టపడే జెలెన్‌స్కా.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన కుటుంబ సభ్యులతో గడిపిన క్షణాలు, తాను కొత్తగా ప్రారంభించిన కార్యక్రమాల గురించి తరచూ ఈ వేదికగా పంచుకుంటారామె. ప్రస్తుత యుద్ధ నేపథ్యంలో తరచూ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తూ అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. జెలెన్‌స్కాకు ప్రస్తుతం ఇన్‌స్టాలో 2.4 మిలియన్ల ఫాలోవర్లున్నారు.

* ఓవైపు తన వృత్తిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అర్ధాంగిగా, అమ్మగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తున్నారామె. ‘ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నాలో ధైర్యం చావదు.. కంట నీరు రాదు. నేనెప్పుడూ నా పిల్లల పక్కనే ఉంటా.. నా భర్త వెన్నంటే నడుస్తా.. నా ప్రజలకు అండగా నిలుస్తా..’ అంటున్నారీ ఫస్ట్‌ లేడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని