గట్టిగా మాట్లాడిందని జాబ్ తీసేస్తే.. పోరాడి కోటి దక్కించుకుంది!

భావ వ్యక్తీకరణ ప్రతి ఒక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది తమ భావాలను సున్నితంగా వ్యక్తపరిస్తే.. కొంతమంది గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంటారు. బ్రిటన్‌కు చెందిన డా.అనెట్‌ ప్లాట్‌ రెండో కోవకు చెందుతారు. లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆమెను గట్టిగా మాట్లాడుతోందని యూనివర్సిటీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది.

Published : 21 Jan 2022 20:11 IST

భావ వ్యక్తీకరణ ప్రతి ఒక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది తమ భావాలను సున్నితంగా వ్యక్తపరిస్తే.. కొంతమంది గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంటారు. బ్రిటన్‌కు చెందిన డా.అనెట్‌ ప్లాట్‌ రెండో కోవకు చెందుతారు. లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆమెను గట్టిగా మాట్లాడుతోందని యూనివర్సిటీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. అయినా పట్టు వదలని ఆమె ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాల్‌ చేసి యాజమాన్యం నుంచి కోటి రూపాయలు దక్కించుకున్నారు. మరి, ఆ కథేంటో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే...

డా.అనెట్‌ ప్లాట్‌ స్వస్థలం జర్మనీ. ఆమె చిన్నతనంలోనే వారి కుటుంబం బ్రిటన్‌కు వలస వచ్చింది. దాంతో ఆమె చదువంతా బ్రిటన్‌లోనే సాగింది. ఆమె 1990లో ఎక్సెటెర్‌ యూనివర్సిటీలో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా తన కెరీర్‌ని మొదలు పెట్టారు. దాంతో ఆ విభాగంలో చేరిన మొదటి మహిళా అధ్యాపకురాలిగా గుర్తింపు పొందారు. దాదాపు మూడు దశాబ్దాలుగా అదే యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. అయితే ప్లాట్‌కి గట్టిగా మాట్లాడ్డం అలవాటు. అది యాజమాన్యానికి నచ్చకపోవడంతో వారి ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. దానివల్ల తన ఉద్యోగాన్ని కోల్పోయింది. అయితే ఇందులో తన తప్పేమీ లేదని, యాజమాన్యమే ఉద్దేశపూర్వకంగా తొలగించిందని చెబుతూ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాల్‌ చేసింది.

యూనివర్సిటీ వాదన...

‘డాక్టర్‌ ప్లాట్‌ మనస్తత్వం మొదటి నుంచి భిన్నంగా ఉండేది. ఆమెని ఎంతమంది అభినందిస్తారో.. ఆమె వ్యవహారశైలిని అంతేమంది తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. ఆమె తన వ్యవహారశైలితో ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులను బాధించింది. అందుకే ఆమెను విధుల్లోంచి తొలగించాం. ఈ నిర్ణయంలో ఎలాంటి వివక్ష, ప్రాంతీయ, లింగ బేధాలు; దురుద్దేశాలు లేవు’ అంటూ యూనివర్సిటీ యాజమాన్యం కోర్టుకి తెలిపింది.

ప్లాట్‌ వాదన..

‘నా గొంతు సహజంగానే పెద్దగా ఉంటుంది. మాట్లాడేప్పుడు గట్టిగా మాట్లాడుతున్నానే ఫీలింగ్‌ కూడా నాకు రాదు. మా కుటుంబంలో అందరూ ఇలా గట్టిగానే మాట్లాడతారు. నేను జన్మించిన ప్రాంతంలో ఇలా గట్టిగా మాట్లాడే అలవాటు సర్వసాధారణంగా ఉంటుంది. నేను న్యూయార్క్‌, జర్మనీ వంటి నగరాల్లో కూడా కొన్ని సంవత్సరాల పాటు పనిచేశాను. నా అలవాటు పట్ల ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు.

కానీ, ఎక్సెటెర్‌ యాజమాన్యం వల్ల నాలో స్వతహాగా ఉన్న ఈ అలవాటుని మార్చుకోలేక తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. ఒక మహిళ గట్టిగా మాట్లాడకూడదనే భావన కొంతమంది సీనియర్లు, మానవ వనరుల విభాగం వారికి ఉంది. మహిళల పట్ల వారికున్న వివక్షాపూరిత వైఖరి వల్లే నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. కొన్ని సంవత్సరాల నుంచి యూనివర్సిటీ వారు నన్ను తొలగించడానికి రకరకాల అడ్డదారులు తొక్కారు. అందరూ పురుషులే ఉన్న ఆ విభాగంలో లింగ వివక్ష చూపించారు. కానీ, నాకు టీచింగ్‌ అంటే చాలా ఇష్టం. నేను Experimental physicsలో రిసెర్చ్‌ చేస్తున్నాను. ఇక్కడి ల్యాబ్‌ని కొన్ని సంవత్సరాలుగా పునాదుల నుంచి అభివృద్ధి చేశాను. యూనివర్సిటీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది’ అని చెప్పుకొచ్చింది. అలాగే ఇంతకుముందు తనకు ఎలాంటి మానసిక సమస్యలూ లేవని.. యూనివర్సిటీ వారు పెట్టిన మానసిక క్షోభ వల్ల ఇప్పుడు రోజూ మందులు వాడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపింది.

కోర్టు ఏం చెప్పింది..?

‘ప్లాట్‌ ఈ యూనివర్సిటీలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తోంది. ఆమె జీవితం, పరిచయాలన్నీ యూనివర్సిటీతో ముడిపడి ఉన్నాయి. యూనివర్సిటీలో పనిచేసిన లెక్చరర్లకు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా కొన్ని ప్రత్యేక సదుపాయాలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం ద్వారా ఆమె ఆ సౌకర్యాలు పొందే అవకాశం కోల్పోతుంది. దీనివల్ల ఆమె ఎంత మానసిక ఒత్తిడికి గురయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యంగా లేదు. దీనికి నష్టపరిహారంగా ఆమెకు లక్ష పౌండ్లను (మన కరెన్సీలో దాదాపు కోటి రూపాయలు) చెల్లించాలి’ అని కోర్టు తన తీర్పుని వెల్లడించింది.

కొసమెరుపు ఏంటంటే ఇంత జరిగినా- ‘ఈ తీర్పులో చాలా తప్పులున్నాయి. దీనిని పై కోర్టులో సవాల్‌ చేస్తాం’ అంటూ యూనివర్సిటీ యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది..

మరి ఉద్యోగ జీవితంలో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి వివక్షను ఎదుర్కొన్నారా? అలాంటి సందర్భాల్లో న్యాయం కోసం ఎలా పోరాడారు.. మొదలైన అంశాలను మాతో పంచుకోండి.  మీ అనుభవాలు, సూచనలు మరెంతోమంది ఉద్యోగినులకు ఉపయోగకరంగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని