తనను తాను నమ్ముకుంది.. ‘విశ్వా’న్ని గెలిచింది!

‘నమ్మకం అనేది కనిపించదు.. దాన్ని ఫీలవ్వాలి.. దాన్ని నమ్ముకున్న వాళ్లకు తిరుగనేదే ఉండదు..’ అంటోంది కొత్త విశ్వ సుందరి హర్నాజ్‌ సంధు. ‘బ్యూటీ విత్‌ బ్రెయిన్స్‌’కి నిలువెత్తు రూపంగా నిలుస్తోన్న ఆమె.. తన అందంతో, అంతకుమించిన తెలివైన సమాధానాలతో అందరినీ కట్టిపడేసింది. ఫలితంగా 21 ఏళ్ల తర్వాత దేశానికి ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని తెచ్చిపెట్టింది.

Updated : 14 Dec 2021 18:41 IST

‘నమ్మకం అనేది కనిపించదు.. దాన్ని ఫీలవ్వాలి.. దాన్ని నమ్ముకున్న వాళ్లకు తిరుగనేదే ఉండదు..’ అంటోంది కొత్త విశ్వ సుందరి హర్నాజ్‌ సంధు. ‘బ్యూటీ విత్‌ బ్రెయిన్స్‌’కి నిలువెత్తు రూపంగా నిలుస్తోన్న ఆమె.. తన అందంతో, అంతకుమించిన తెలివైన సమాధానాలతో అందరినీ కట్టిపడేసింది. ఫలితంగా 21 ఏళ్ల తర్వాత దేశానికి ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని తెచ్చిపెట్టింది. సుస్మితా సేన్‌, లారా దత్తా తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారతీయురాలిగా చరిత్రకెక్కింది. ఈ నేపథ్యంలో అడుగడుగునా ఆత్మవిశ్వాసం తొణికిసలాడే ఈ అందాల రాశి పలు సందర్భాల్లో పంచుకున్న కొన్ని స్ఫూర్తిదాయక మాటల్ని ఓసారి నెమరు వేసుకుందాం..!

ఫైనల్‌ రౌండ్‌లో భాగంగా.. ‘పరాగ్వే, ఇండియా కంటెస్టెంట్లు ముందుకు రండి..’ అనగానే విజయం ఎవరిని వరిస్తుందోనన్న టెన్షన్‌ వేదికపై ఉన్న పోటీదారుల్లో, అక్కడున్న ప్రేక్షకుల్లో నెలకొంది.. ఇద్దరు ఫైనలిస్టులు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని తుది ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని సెకన్ల వ్యవధిలో ‘ది న్యూ మిస్‌ యూనివర్స్‌ ఈజ్‌....... ఇండియా!’ అనడమే ఆలస్యం.. హర్నాజ్‌ ముఖం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగిపోయింది. ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైందా?’ అన్నంత భావోద్వేగం ఆమె మోములో కొట్టొచ్చినట్లు కనిపించింది. మరోవైపు.. ‘21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశానికి కిరీటం అందించా’నన్న ఆత్మవిశ్వాసంతోనే వేదికపై ఆమె విజయ దరహాసం చేసింది. దీంతో టీవీలకు అతుక్కుపోయిన కోట్లాది మంది భారతీయుల కళ్లు ఆనందంతో చెమర్చాయి.

నమ్ముకున్నా.. గెలిచా!

విశ్వ వేదికపై తన అందంతోనే కాదు.. అంతకుమించిన తెలివితేటలతోనూ న్యాయనిర్ణేతల్ని ఆకట్టుకుంది హర్నాజ్‌. ఈ క్రమంలోనే పలు రౌండ్లలో సంధించిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానమిచ్చింది.

తుది రౌండ్‌లో.. ‘అమ్మాయిలు వివిధ రకాల ఒత్తిళ్లను, అవరోధాలను ధైర్యంగా ఎదుర్కోవాలంటే మీరిచ్చే సలహాలేంటి?’ అన్న ప్రశ్నకు సమాధానంగా..

‘ఈ కాలపు అమ్మాయిలు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు. మనకు మనమే ప్రత్యేకం అన్న వాస్తవాన్ని గ్రహిస్తే ప్రతి ఒక్కరూ అందగత్తెలే అవుతారు. అందుకే మరొకరితో పోల్చుకోవడం మానుకొని.. చుట్టూ జరుగుతోన్న విషయాల గురించి చర్చించండి. ధైర్యంగా ముందుకొచ్చి.. మీలోని ప్రత్యేకతల గురించి మాట్లాడండి.. ఎందుకంటే మీ జీవితానికి మీరే లీడర్.. ఇలా నన్ను నేను నమ్ముకున్నాను కాబట్టే ఇక్కడి దాకా రాగలిగాను..’ అంటూ తన తెలివైన సమాధానంతో ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపింది హర్నాజ్.

మాటలు కాదు.. చేతలు కావాలి!

ఇక టాప్‌-5లో భాగంగా..

‘వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది దాన్ని ఒక జోక్ కింద కొట్టిపడేస్తారు.. అలాంటి వారిలో మీరు ఎలా అవగాహన కలిగిస్తారు?’ అన్న ప్రశ్నకు సమాధానంగా..

‘మన బాధ్యతారహిత చర్యల వల్ల ప్రస్తుతం పర్యావరణానికి ఎంతో ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మాటలు తగ్గించి.. చర్యలకు పూనుకోవాలి. ప్రకృతిని పరిరక్షించుకోవడం/నాశనం చేసుకోవడమనేది పూర్తిగా మన చేతల్లోనే ఉంది. పశ్చాత్తాప పడడం కంటే తప్పు జరగకుండా ముందే జాగ్రత్తపడడం మంచిది కదా!’ అంటూ అదిరిపోయే సమాధానమిచ్చిందీ అందాల రాశి. నిజంగా ఇలాంటి సమాధానం విన్నాక ఎవరైనా సరే.. కన్విన్స్‌ అవ్వాల్సిందే మరి!


నమ్మితేనే నిలబడగలం!

‘విశ్వమంతా నువ్వై ప్రకాశించు..’ అనే క్యాప్షన్‌ను ఇన్‌స్టా బయోగా పెట్టుకున్న హర్నాజ్‌.. తన పోస్టులతోనూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంటుంది. ‘నమ్మకమనేది కనిపించదు.. దాన్ని ఫీలవ్వాలి.. నిరంతరం నా మది నిండా ఉండే ఫీలింగ్‌ ఇది. దేవుడిని, నా కుటుంబాన్ని, నన్ను నేను ఎంతో నమ్ముతాను.. అందుకే మీ అందరి ముందు ‘ఒక్క’రిలా నిలబడగలిగాను..’ అంటూ తను గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించిన షార్ట్‌ వీడియోను పోస్ట్‌ చేసిందీ బ్యూటీ.


అమ్మలాగే.. నచ్చిందే చేశా!

‘సమాజపు ఒత్తిళ్లకు తలొగ్గి చాలామంది తమ దారిని మార్చుకుంటారు. కానీ నేను మాత్రం నాకు నచ్చిందే చేశా. అచ్చం అమ్మలాగే! తను కూడా తన మనసుకు నచ్చినట్లుగా వైద్య వృత్తిని చేపట్టింది. ఓ ప్రముఖ గైనకాలజిస్ట్‌గా ఎదిగింది. కుటుంబానికే మూలస్తంభంలా మారింది. అందుకే అమ్మనే స్ఫూర్తిగా తీసుకున్నా.. నిజానికి ఇలా మనసుకు నచ్చిన పని చేసినప్పుడే ఆనందం, విజయం.. రెండూ వరిస్తాయి..’ అంటూ నేటి యువతను ప్రోత్సహిస్తోందీ అందాల రాశి. అంతేకాదు.. తన తల్లితో కలిసి పలు ఆరోగ్య శిబిరాల్లో పాల్గొన్న హర్నాజ్‌.. ఈ క్రమంలో మహిళల ఆరోగ్యం, నెలసరి పరిశుభ్రత పైనా ఎంతోమందిలో అవగాహన పెంచింది.


ఆమెలా జీవితాన్ని గెలవాలని!

తొలిసారి దేశానికి మిస్ వరల్డ్ కిరీటం అందించిన ప్రియాంక చోప్రానే తనకు ఆదర్శమంటోంది హర్నాజ్‌. ‘అందాల పోటీల్లో పాల్గొనాలని, కిరీటం గెలవాలనేది నా చిన్ననాటి కల. ఈ విషయంలో స్ఫూర్తి ఎవరంటే ప్రియాంక చోప్రా అని చెప్తా. ఆమె అంకితభావం, పట్టుదలనే నేను పాఠాలుగా చేసుకున్నా. నాడు దేశానికి ప్రాతినిథ్యం వహించి.. విశ్వవేదికపై ఆమె గెలిచిన తీరు నాలో స్ఫూర్తి నింపింది. అందుకే అప్పుడే నిర్ణయించుకున్నా.. నేనూ తనలా జీవితాన్ని గెలవాలని!’ అని చెప్పింది హర్నాజ్.
హర్నాజ్‌ కంటే ముందు 1994లో సుస్మితా సేన్‌, 2000లో లారాదత్తా దేశానికి ‘మిస్‌ యూనివర్స్‌’ కిరీటాల్ని అందించారు.


బలహీనతలే బలంగా మార్చాయి!

ఒక్కోసారి మనకెదురయ్యే విమర్శలే మనల్ని ఉన్నతంగా నిలబెట్టేందుకు అస్త్రాలవుతాయంటోంది హర్నాజ్‌. ‘నేను చిన్నతనం నుంచే సన్నగా ఉండేదాన్ని. దీంతో అందరూ ‘ఇంత సన్నగా ఉన్నావేంటి?’ అంటూ ఆటపట్టించేవారు. ఆ మాటలు నా మనసుకు బాధ కలిగించినా.. నా ఆత్మవిశ్వాసం ముందు ఆ ఫీలింగ్‌ కనుమరుగయ్యేది. అలా వినీ వినీ నా మనసు బండబారిపోయింది. అప్పట్నుంచి ఇతరుల మాటలు, విమర్శలు పట్టించుకోవడమే మానేశాను. ఇలాంటి విషయాల్లో ప్రపంచాన్ని మెప్పించడం కంటే నన్ను నేను మెప్పించుకోవడం మేలని నిర్ణయించుకున్నా.. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే మనల్ని మనం అంగీకరించడం సాధ్యమవుతుంది..’ అంటూ చిన్నతనంలో తనకెదురైన పలు చేదు అనుభవాల గురించి ఓ సందర్భంలో పంచుకుందీ అందాల భామ.


చిన్న పిల్లలా ఏడ్చా!

కూతురు విజయం సాధిస్తే కన్నతల్లి కళ్లు ఆనందంతో చెమర్చడం సహజం. ప్రస్తుతం తానూ అలాంటి భావోద్వేగంతోనే ఉక్కిరి బిక్కిరవుతున్నానంటున్నారు హర్నాజ్‌ తల్లి రూబీ సంధూ. ‘నా సంతోషాన్ని పంచుకోవడానికి మాటల్లేవు. హర్నాజ్‌ టాప్‌-3 లోకి వెళ్లినప్పుడే ఎంతో ఉద్వేగానికి లోనయ్యా. ఇప్పుడు విజేతగా నిలిచిందంటే.. ఆ ఆనందం తట్టుకోలేక చిన్న పిల్లలా ఏడ్చేశా. నా బిడ్డకు ఈ విజయాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడికి రుణపడి ఉంటా..’ అంటూ పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతోందా తల్లి మనసు.


ఒక్క మాటలో..!

* హర్నాజ్‌ ముద్దుపేరు క్యాండీ. దీన్ని ఆమె అన్నయ్య హర్నూర్‌ పెట్టారట!

* ఐటీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన హర్నాజ్‌.. ప్రస్తుతం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ చేస్తోంది.

* ఈ అందాల రాశికి మిమిక్రీ కూడా తెలుసట. మనుషుల దగ్గర్నుంచి జంతువుల దాకా ఏ వాయిస్‌నైనా ఇమిటేట్‌ చేయగలదట!

* హర్నాజ్‌కు కవితల్లోనూ ప్రవేశముందట! ఈ క్రమంలో వీలు చిక్కినప్పుడల్లా తన మాతృభాష పంజాబీలో చిన్న చిన్న పద్యాలు రాస్తుందట!

* తన మాతృభాష పంజాబీతో పాటు హర్యాణ్వీ (హరియాణా మాతృభాష), హిందీ, ఇంగ్లిష్.. భాషలలో అనర్గళంగా మాట్లాడగలదీ విశ్వ సుందరి.

* చిన్నతనం నుంచే మోడలింగ్‌, నటనా రంగాలపై ఆసక్తి పెంచుకున్న హర్నాజ్.. ఇప్పటికే ‘Yaara Diyan Poo Bara’, ‘Bai Ji Kuttange’.. వంటి పంజాబీ సినిమాల్లోనూ నటించింది.

* గుర్రపు స్వారీ, చెస్‌ ఆడడాన్ని ప్రేమించే ఈ ముద్దుగుమ్మకు ఈత కొట్టడమన్నా భలే సరదానట!

* 17 ఏళ్ల వయసులోనే అందాల పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది హర్నాజ్‌. ఈ క్రమంలో ఇప్పటికే ‘ఫెమినా మిస్‌ ఇండియా పంజాబ్‌ - 2019’, ‘మిస్‌ దివా - 2021’.. కిరీటాలు గెలుచుకుంది.

* తన స్ఫూర్తి ప్రదాత ప్రియాంక చోప్రానే తనకు ఇష్టమైన నటి అని చెబుతోంది హర్నాజ్.

* ఈ ముద్దుగుమ్మ విజయాన్ని ప్రశంసిస్తూ 2000 మిస్‌ యూనివర్స్‌ కిరీట విజేత, బాలీవుడ్‌ బ్యూటీ లారా దత్తా.. ‘కంగ్రాట్స్‌ హర్నాజ్‌.. మిస్‌ యూనివర్స్‌ క్లబ్‌లోకి స్వాగతం! ఈ విజయం కోసమే 21 ఏళ్లుగా ఎదురుచూశాం. నీ విజయంతో ఎంతోమంది కలలు సాకారమయ్యాయి.. చాలా గర్వంగా ఉంది..’ అంటూ ట్వీట్‌ చేసింది.

21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హర్నాజ్ సాధించిన గెలుపు ప్రతి ఒక్కరినీ సంతోషంలో ఓలలాడిస్తోంది. ఆ విజయాన్ని మనసారా ఆస్వాదిస్తూ.. హర్నాజ్‌కు శుభాకాంక్షలు చెబుదాం..!

కంగ్రాట్స్‌ & ఆల్‌ ది బెస్ట్‌ బ్యూటీ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్