Mahesh Babu - Sitara: ఆ ఫొటోలు అక్కడ చూసి ఒక్కసారిగా ఏడ్చేశా..!
అవడానికి స్టార్ డాటరే అయినా.. తనకున్న ప్రత్యేకతలు, నైపుణ్యాలతో చిన్న వయసులోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాలపట్టి సితార. ఇప్పటికే కూచిపూడి డ్యాన్సర్‌గా, సోషల్ మీడియా స్టార్‌గా....
(Photos: Instagram)
అవడానికి స్టార్ డాటరే అయినా.. తనకున్న ప్రత్యేకతలు, నైపుణ్యాలతో చిన్న వయసులోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాలపట్టి సితార. ఇప్పటికే కూచిపూడి డ్యాన్సర్‌గా, సోషల్ మీడియా స్టార్‌గా ప్రపంచమంతా పాపులారిటీ సంపాదించిన ఈ లిటిల్ ప్రిన్సెస్.. ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇటీవలే ఓ ప్రముఖ జ్యుయలరీ యాడ్‌లో నటించిన సితార ఫొటోల్ని.. ఆ సంస్థ తాజాగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ‘టైమ్స్ స్క్వేర్’పై ప్రదర్శించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి స్టార్ కిడ్‌గా పేరు సంపాదించుకుందీ క్యూట్ గర్ల్. ‘ఇంత సంతోషం ఇంతకు ముందెప్పుడూ పొందలేదం’టూ ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సీతూ పాప.
తన క్యూట్‌నెస్, స్వీట్ స్మైల్‌తో కట్టిపడేస్తుంటుంది స్టార్ కిడ్ సితార. కూచిపూడి డ్యాన్సర్‌గా సుపరిచితురాలైన ఆమె.. తన డ్యాన్స్ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఇతర సినిమా పాటలకూ కవర్ సాంగ్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మరోవైపు కంటెంట్ క్రియేటర్‌గానూ రాణిస్తోందీ స్టార్ డాటర్. ఇలా తనలోని ప్రత్యేకమైన నైపుణ్యాలతో 12 ఏళ్లకే ప్రముఖ తారలకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది సీతూ పాప.
గర్వంగా ఉంది తల్లీ!
అయితే ఇటీవలే ఓ ప్రముఖ ఆభరణాల సంస్థ ప్రకటనలో నటించింది సితార. దీనికి సంబంధించిన ఫొటోల్ని ఆ సంస్థ తాజాగా న్యూయార్క్‌లోని ‘టైమ్స్ స్క్వేర్’పై ప్రదర్శించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి స్టార్ కిడ్‌గా పేరు సంపాదించుకుందీ క్యూటీ. ఈ ఫొటోల్లో తన క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తోన్న ఈ లిటిల్ బ్యూటీ అందాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ‘ఈ ఫొటోలు చూసి ఒక్కసారిగా బిగ్గరగా అరిచేశా.. భావోద్వేగంతో ఏడ్చేశా.. ఇంత ఆనందం ఇంతకు ముందెప్పుడూ పొందలేదు..’ అంటూ తన ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందీ లిటిల్ ప్రిన్సెస్.
ఇక మరోవైపు తన ముద్దుల కూతురి ఘనతను చూసి మహేశ్ ఉప్పొంగిపోతున్నాడు. ‘టైమ్స్ స్క్వేర్‌నే వెలిగిస్తున్నావు.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది తల్లీ.. కీప్ ఇట్ అప్!’ అంటూ పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడీ స్టార్ డాడ్. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది స్పందిస్తూ.. ‘సితార.. తన తండ్రినే మించిపోతోంద’ని ప్రశంసలు కురిపిస్తున్నారు.
నాకు నచ్చింది చేయమంటారు!
ఇలా ఇప్పుడే కాదు.. తన డ్యాన్స్, యూట్యూబ్ వీడియోలతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది సితార. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాలో 12 లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు. అయితే ఈ సక్సెస్‌కు కారణం తన తల్లిదండ్రులే అంటూ ఓ సందర్భంలో పంచుకుందీ స్టార్ కిడ్.
‘చదువు, కెరీర్ విషయాల్లో అమ్మానాన్న నా ఇష్టాలకు, ఆసక్తులకు ప్రాధాన్యమిస్తారు. నాకు నచ్చిన అంశాల్లో ప్రోత్సహిస్తారు.. తగిన సలహాలిస్తారు. వాళ్లు ఎంత బిజీగా ఉన్నా నాతో, అన్నయ్యతో గడపడానికి కచ్చితంగా సమయం కేటాయిస్తారు. ఇక నాకు నాన్నతో సమయం గడపడమంటే మహా ఇష్టం. ఇద్దరం కలిసి సినిమాలు చూడ్డానికి, మా పెట్ డాగ్స్‌తో ఆడుకోవడానికి ఆసక్తి చూపుతాం. ఇక అందరం కలిసి వెకేషన్స్‌కి వెళ్లినప్పుడు మాత్రం పండగే!’ అంటూ చెప్పుకొచ్చింది సీతూ పాప.
అదే బెస్ట్ కాంప్లిమెంట్!
తన డ్యాన్స్ వీడియోలతో, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకునే సితార.. తన తండ్రి సలహా మేరకే ఈ నృత్యంలోకి ప్రవేశించానంటోంది.
‘గత ఆరేళ్ల నుంచి కూచిపూడి డ్యాన్స్, నటనలో శిక్షణ తీసుకుంటున్నా. నిజానికి ఈ డ్యాన్స్ నేర్చుకోమని నాన్నే నాకు సలహా ఇచ్చారు. తను కూడా చిన్నప్పుడు కూచిపూడి నేర్చుకున్నారట! ఇక అమ్మకు కథక్‌లో ప్రావీణ్యం ఉంది. అయితే ఓసారి నేను క్లాసికల్ డ్యాన్స్ చేసిన వీడియోను మా డ్యాన్స్ టీచర్ అమ్మకు చూపించగానే తను ఒక్కసారిగా ఏడ్చేసింది. నిజానికి తనకు ఎంత సంతోషం కలిగినా అంత ఎమోషనల్ అవ్వదు. కానీ నా డ్యాన్స్ చూసి తను అంత ఆనందపడడం చూసి నా కళ్లూ చెమర్చాయి. తను నాకిచ్చిన అత్యుత్తమ ప్రశంస అది!’ అంటూ తన నృత్య అనుభవాల్ని గుర్తు చేసుకుందీ క్యూట్ డాటర్.
ఇక స్టైలింగ్ విషయంలో తన తల్లి, తానూ ఒకేలా ఆలోచిస్తామని చెబుతోన్న సితార.. ఖాళీ సమయాల్లో ఫ్రెండ్స్‌తో గడపడానికి, పెయింటింగ్ వేయడానికి మక్కువ చూపుతుందట! నాన్‌వెజ్‌ని ఇష్టపడే తనకు వారానికోసారి నూడుల్స్ ఉండాల్సిందేనంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.