పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడండిలా!

కరోనా రాకతో ప్రపంచమంతా టెక్నాలజీ మయం అయిపోయింది. పెద్దవాళ్లు ఇంటి నుంచి పనిచేయడం అలవాటు చేసుకుంటే... పిల్లలేమో స్మార్ట్‌ఫోన్లలోనే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ నిరంతరాయంగా కంప్యూటర్ / మొబైల్‌కు కళ్లప్పగించేస్తే కంటి ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం. ఈ విషయంలో పెద్దలకు కాస్త అవగాహన ఉన్నప్పటికీ పిల్లలు మాత్రం ఇష్టానుసారంగా గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లలోనే మునిగితేలుతున్నారు.

Published : 13 Aug 2021 15:29 IST

కరోనా రాకతో ప్రపంచమంతా టెక్నాలజీ మయం అయిపోయింది. పెద్దవాళ్లు ఇంటి నుంచి పనిచేయడం అలవాటు చేసుకుంటే... పిల్లలేమో స్మార్ట్‌ఫోన్లలోనే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ నిరంతరాయంగా కంప్యూటర్ / మొబైల్‌కు కళ్లప్పగించేస్తే కంటి ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం. ఈ విషయంలో పెద్దలకు కాస్త అవగాహన ఉన్నప్పటికీ పిల్లలు మాత్రం ఇష్టానుసారంగా గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లలోనే మునిగితేలుతున్నారు. ఆన్‌లైన్‌ క్లాసులతో పాటు ౨౪ గంటలూ వీడియో గేమ్స్ అవీ అంటూ చేజేతులా కళ్లను నాశనం చేసుకుంటున్నారు.

పెరుగుతున్న కంటి సమస్యలు!

లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా గత ఏడాదిన్నర కాలంలో పిల్లల్లో కంటి సమస్యలు బాగా పెరిగాయని పలు నివేదికలు, అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీర్ఘకాలిక సమయం పాటు ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను ఉపయోగించడం వల్ల పిల్లల్లో కళ్లజోడు వినియోగం పెరిగిందని....కళ్లపై విపరీతమైన ఒత్తిడి కారణంగా దురద, మంట, ఎరుపెక్కడం, పొడి బారడం తదితర సమస్యలతో కంటి క్లినిక్‌లకు వెళ్లే పిల్లల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని ఈ అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో పిల్లల కంటి ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అరగంటకోసారి విరామం!

ఒకసారి స్మార్ట్‌ఫోన్‌ /ట్యాబ్‌/ ల్యాప్‌టాప్‌ పట్టుకుంటే సాధారణంగా అంత తొందరగా వదిలిపెట్టరు పిల్లలు. ఆన్‌లైన్ క్లాసులంటూనే కార్టూన్లు, వీడియోగేమ్స్ అంటూ రెప్పవాల్చకుండా మరీ వాటిల్లోనే మునిగితేలుతుంటారు. అయితే ఇలా అధిక సమయం పాటు కనురెప్పలు వాల్చకుండా ఉండడం వల్ల కళ్లు పొడిబారుతాయి. దురద, మంట తదితర సమస్యలు కూడా మొదలవుతాయి. ఆ సమయంలో చేతులతో కళ్లను నలుపుకోవడం వల్ల... క్రమంగా కంటి ఇన్ఫెక్షన్లకి దారి తీస్తుంది. లాక్‌డౌన్‌ కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువైంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కువ సేపు ఫోన్లు, కంప్యూటర్లు ఎక్కువగా ఉపయోగించకుండా చూడాలి. ఒకవేళ అలా ఎక్కువ సేపు వినియోగించాల్సి వస్తే ప్రతి అరగంటకొకసారి రెండు నిమిషాల పాటు విరామం తీసుకునేలా చేయాలి.

టైం- టేబుల్‌ అవసరమే!

ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల వినియోగానికి సంబంధించి పిల్లలకు టైం- టేబుల్‌ ఏర్పాటుచేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌ తరగతులు, అసైన్‌మెంట్లను పూర్తి చేసేందుకు తగిన సమయ పట్టికను తయారు చేసి పెట్టడం మంచిది. సాధారణంగా ఒక ఆన్‌లైన్‌ క్లాసు పూర్తవ్వడానికి 45 నిమిషాల నుంచి గంట పడుతుంది. ఆ తర్వాత 5-10 నిమిషాల పాటు విరామం ఉంటుంది. ఈ సమయంలో పిల్లల దగ్గరకు వెళ్లి వారితో ఆప్యాయంగా మాట్లాడండి... వారికేమైనా సమస్యలుంటే తెలుసుకోండి... ఏదైనా తినాలనిపిస్తే దగ్గరుండి అందించండి. దీంతో పిల్లలకు చదువుపై మరింత ఆసక్తి కలుగుతుంది.

ఈ జాగ్రత్తలు కూడా!

ఫ్యాన్ ద్వారా వచ్చే గాలి నేరుగా పిల్లల కళ్లపై పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.

⤠ మొబైల్‌ / కంప్యూటర్‌ స్ర్కీన్‌ని కంటికి సమానంగా లేదా దిగువన ఉంచుకోవాలి.

⤠ స్ర్కీన్‌ చూస్తున్నప్పుడు మధ్యమధ్యలో రెప్పలు వేయడం మర్చిపోవద్దు. దీని వల్ల కళ్లు పొడిబారకుండా నివారించవచ్చు.

⤠ పిల్లల కంటి చూపు ఇప్పటికే బలహీనంగా ఉంటే స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌ వాడుతున్నప్పుడు కళ్లజోడు ఉపయోగించడం ఉత్తమం.

⤠ కళ్లకు, మొబైల్‌ స్ర్కీన్‌కు కనీసం రెండు అడుగుల దూరం ఉండాలి.

⤠ ఆన్‌లైన్‌ తరగతులు పూర్తయ్యాక పిల్లలతో పుస్తకాలు చదివించడమో, ఆటలు ఆడించడమో చేయాలి. దీనివల్ల పిల్లలు మరింత యాక్టివ్‌గా ఉంటారు.

⤠ చదువుకునే గదిలో వెలుతురు ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా మొబైల్‌ / కంప్యూటర్‌ స్ర్కీన్ల నుంచి వచ్చే కాంతి కూడా నార్మల్‌గా ఉండేలా చూసుకోవాలి.

⤠ మొబైల్‌ / కంప్యూటర్‌లలో ఫాంట్‌ పరిమాణాన్ని పెద్దదిగా, స్పష్టంగా ఉంచండి.

⤠ కళ్లు రుద్దుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. పిల్లలకు ఈ అలవాటు ఉంటే వెంటనే మాన్పించండి.

⤠ తక్కువ నీరు తాగడం వల్ల కళ్లు పొడిబారిపోతాయి. కాబట్టి పుష్కలంగా నీరు తాగమని పిల్లలకు చెప్పండి.

⤠ నిద్రలేమి కూడా వివిధ కంటి సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి పిల్లలు తగినంత సమయం నిద్రపోయేలా జాగ్రత్తలు తీసుకోండి.

⤠ కళ్ల మంట, దురదగా అనిపిస్తే చల్లని నీటితో మృదువుగా కడగాలి.

⤠ కంటి ఆరోగ్యాన్ని కాపాడే ఆకు కూరలు, నట్స్‌ అండ్‌ సీడ్స్‌, చిక్కుళ్లను బాగా తినిపించాలి. 

⤠ పిల్లలు ఎక్కువగా కళ్లు నలపడం, కళ్లు ఎర్రగా మారడం, కళ్ల నుంచి తరచూ నీరు కారడం వంటి లక్షణాలు కనిపించినట్లయితే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్