Published : 11/08/2021 17:19 IST

ఆ నవ్వును చూడగానే ప్రపంచాన్ని మర్చిపోతున్నా!

కొన్నేళ్ల క్రితం వరకు విరాట్ కోహ్లీ అంటే దూకుడుకు మారు పేరు. అది ఆన్ ఫీల్డ్‌ అయినా...ఆఫ్‌ ఫీల్డ్‌ అయినా..! అందుకే ‘క్రికెట్‌ రారాజు’గా పేరు తెచ్చుకున్నప్పటికీ దుందుడుకు స్వభావం కారణంగా కొన్ని విమర్శలూ మూటగట్టుకున్నాడు. అయితే అనుష్కతో పెళ్లయ్యాక ఉన్నట్లుండి కూల్‌గా మారిపోయాడీ టీం ఇండియా కెప్టెన్‌. మైదానంతో పాటు బయట కూడా ఎంతో ప్రశాంతంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో తానిలా మారిపోవడానికి తన సతీమణే కారణమంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన విరాట్‌... తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించాడు. తన సక్సెస్‌లో అగ్రభాగం అనుష్కకే దక్కుతుందంటూ తన ముద్దుల భార్యపై ప్రశంసలు కురిపించాడు.

వారు నా జీవితాన్ని మార్చేశారు!

‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ లా అనిపించే ‘విరుష్క’ జోడీకి ఫ్యాన్స్‌లో ఓ ప్రత్యేక స్థానముంది. వీరిద్దరి దాంపత్య బంధానికి గుర్తుగా ఈ ఏడాది జనవరిలో ‘వామిక’ అనే పండంటి బిడ్డ వీరి జీవితంలోకి అడుగుపెట్టింది. ముందుగా అనుకున్నట్లుగానే ‘సోషల్‌ మీడియా’ ప్రభావం తమ కూతురిపై పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారీ లవ్లీకపుల్‌. క్రికెట్‌ షెడ్యూల్‌లో భాగంగా జూన్‌ నుంచి ఇంగ్లండ్‌లో ఉంటోన్న విరాట్‌... తీరిక దొరికినప్పుడల్లా తన భార్యతో కలిసి అందమైన ప్రదేశాలన్నీ చుట్టేస్తున్నాడు. ఈ క్రమంలోనే మరో క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ నిర్వహించిన ఓ ఛాట్ సెషన్‌లో పాల్గొన్న కోహ్లీ....సతీమణి అనుష్క, కూతురు వామిక తన జీవితాన్ని ఎలా మార్చారో చెప్పుకొచ్చాడు.

ఆమే కారణం!

‘ఒకవేళ నేను అనుష్కను కలవకపోయి ఉంటే నేను ఎక్కడ ఉండేవాడినో కూడా నాకు తెలియదు! నా జీవితం ఇంత అందంగా ఉండడానికి ఆమే కారణం. నేను ఎక్కడ ఎలా ఇంపాక్ట్‌ అవుతానో నాకన్నా తనకే బాగా తెలుసు. నేనేంటో, నా శక్తి సామర్థ్యాలేంటో తన ద్వారానే నాకు తెలిశాయి. వ్యక్తిగతంగా... వృత్తిగతంగా నేను సక్సెస్‌ అయ్యానంటే అందులో అనుష్క పాత్ర ఎంతో ఉంది. జీవిత భాగస్వామిగా అనుష్క నా జీవితంలోకి అడుగుపెట్టినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. నన్ను అన్ని విధాలా అర్థం చేసుకుని అండగా నిలుస్తోన్న ఆమె నా బెటరాఫ్‌ అని గర్వంగా చెప్పగలను.’

ఆ నవ్వు చూడగానే ప్రపంచాన్ని మర్చిపోతున్నా!

‘ఇక వామిక నా జీవితంలోకి రావడం మరో అద్భుత ఘట్టం. తనను చూడకుండా క్షణమైనా ఉండలేను. తండ్రిగా ప్రమోషన్‌ పొందాక నా ప్రాథమ్యాలు కూడా మారిపోయాయి. ఇప్పుడు నా చిట్టితల్లిని ప్రశాంతంగా నిద్రపుచ్చడమే నా మొదటి కర్తవ్యం. బ్రేక్‌ఫాస్ట్‌, కాఫీల కోసం బయటకు వెళ్లినా వెంటనే గదికి వచ్చేస్తున్నాను. నా కూతురుతో ఎక్కువ సమయం గడిపేలా నా షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నాను. అనుష్క లాగే వామిక కూడా నా ఆలోచనా తీరును పూర్తిగా మార్చేసింది. తన బోసి నవ్వుల్లో మనసుకు ప్రశాంతత చేకూర్చే ఏదో అద్భుతమైన శక్తి దాగి ఉంది. అందుకే తన నవ్వును చూడగానే నేను ఈ ప్రపంచాన్నే మర్చిపోతున్నాను. ఇది నేను పొందిన అత్యంత మధురానుభూతుల్లో ఒకటి.’

అలా రిలాక్స్‌ అవుతున్నాం!

‘తల్లిదండ్రులుగా నేను, అనుష్క వామిక బాధ్యతలను పంచుకుంటున్నాం. అదే సమయంలో కాస్త ఖాళీ దొరికినప్పుడల్లా లండన్‌ వీధుల్లో సరదాగా తిరుగుతూ రిలాక్స్‌ అవుతున్నాం. ఇండియాలో ఇలా తిరగడం సాధ్యం కాదు. అందుకే అక్కడ కోల్పోయిన ఆ చిన్న చిన్న ఆనందాలను ఇక్కడ ఆస్వాదిస్తున్నాం’ అని చెప్పుకొచ్చాడు విరాట్.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని