అతను ఎలాంటి వాడు? ముందే తెలుసుకోండి..!

అమ్మాయికి పెళ్లి కుదిరిందని తెలిస్తే చాలు.. 'చక్కందాల చుక్క.. కుదిరిందే పెళ్లెంచక్కా..' అంటూ బంధువులంతా ఆమెను సరదాగా ఆటపట్టిస్తూ ఉంటారు. మూడుముళ్ల బంధంతో, ఏడడుగుల ప్రయాణంతో మొదలయ్యే వైవాహిక జీవితం కడవరకూ సంతోషంగా సాగిపోవడానికి మనం ఎంపిక చేసుకునే భాగస్వామి సహకారం కూడా తప్పనిసరని గుర్తుంచుకోవాలి.

Published : 09 Aug 2021 20:02 IST

అమ్మాయికి పెళ్లి కుదిరిందని తెలిస్తే చాలు.. 'చక్కందాల చుక్క.. కుదిరిందే పెళ్లెంచక్కా..' అంటూ బంధువులంతా ఆమెను సరదాగా ఆటపట్టిస్తూ ఉంటారు. మూడుముళ్ల బంధంతో, ఏడడుగుల ప్రయాణంతో మొదలయ్యే వైవాహిక జీవితం కడవరకూ సంతోషంగా సాగిపోవడానికి మనం ఎంపిక చేసుకునే భాగస్వామి సహకారం కూడా తప్పనిసరని గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలో భాగస్వామిలో ఉండకూడని కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం రండి..

ప్రతి అమ్మాయి తనకి కాబోయే వరుడు అందగాడు, గుణవంతుడు, రూపవంతుడు.. అయి ఉండాలని ఆశపడటం సహజం. అలాగే అబ్బాయిలు కూడా అందమైన, తెలివైన వ్యక్తి భాగస్వామిగా రావాలని కోరుకుంటారు. అయితే వైవాహిక జీవితం జీవితాంతం సంతోషంగా సాగిపోవాలంటే భాగస్వామిలో కొన్ని లక్షణాలు ఎంతమాత్రం ఉండకూడదు.

అహంకారం..

కొంతమంది వ్యక్తులు అన్ని విషయాలూ తమకే తెలుసని భావిస్తుంటారు. అటువంటి వ్యక్తులు అవతలివారు కూడా తమ కనుసన్నల్లోనే మెలగాలని భావిస్తారు. ఈ విషయంలో జీవిత భాగస్వామికి కూడా మినహాయింపు ఉండదు. ఇలాంటివారు జీవితంలో ప్రతిదీ తమకు నచ్చినట్లే జరగాలని ఆశిస్తారు. భాగస్వామి సలహాలు, అభిప్రాయాలు, వారి లక్ష్యాలు.. వంటి విషయాల పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుంటారు. ఇటువంటి గుణం ఉన్న వ్యక్తి మీకు తారసపడితే ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించుకొని వారితో వివరంగా మాట్లాడి, అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే వివాహం గురించి ఆలోచించడం మంచిది.

ఆధిపత్య ధోరణి..

'అన్నీ నాకే తెలుసు' అనుకునే వ్యక్తి అహంకారభావంతో ఆధిపత్య ధోరణి ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. కానీ మరికొందరు మాత్రం ఏమీ తెలియకపోయినా భాగస్వాములిద్దరిలోనూ ప్రతి విషయంలోనూ తమదే పైచేయిగా నిలవాలని భావిస్తారు. ఈ తరహా వ్యక్తులకు మొండితనం, పట్టుదల.. వంటివి ఎక్కువ. చేసేది తప్పని తెలిసినా చేసి తీరాలని పంతం పట్టే రకం వీరు. ఇలాంటి తరహా వ్యక్తులను భాగస్వామిగా ఎంపిక చేసుకోకపోవడమే ఉత్తమం.

నియంత్రణ లేదా??

సంతోషం, దుఃఖం, కోపం, బాధ.. వంటి భావాలను నియంత్రించుకోవడం ప్రతి వ్యక్తికీ ఎంతో ముఖ్యం. ఒకవేళ మీకు ఎదురైన వ్యక్తిలో తమ భావోద్వేగాల పట్ల నియంత్రణ గుణం లేకపోతే మీ వైవాహిక జీవితం చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెళ్త్లెన తర్వాత మీ వ్యక్తిగత లేదా వివాహ జీవితంలో ఏవైనా చిక్కులు లేదా సమస్యలు ఎదురైతే వాటి పట్ల వారు స్పందించే విధానం సరిగ్గా ఉండకపోవచ్చు. అలాగే నియంత్రణ లేకపోవడం వల్ల చిన్న చిన్న తగాదాలు కూడా పెద్దవిగా చేసుకొని.. చివరకు బంధాన్ని తెంచేవరకు తీసుకెళ్లచ్చు. కాబట్టి భావోద్వేగాల పట్ల నియంత్రణ కలిగి ఉండటం తప్పనిసరి.

నిర్లక్ష్య ధోరణి..

పెళ్త్లెన తర్వాత వ్యక్తిగత, ఆర్థిక, వైవాహిక జీవితం ఎలా ఉండనుందో ముందుగానే చర్చించుకోవడం ఈ రోజుల్లో సహజంగా మారిపోయింది. అలా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు చర్చించుకునేటప్పుడు అవతల వ్యక్తి డబ్బు, కెరీర్ పట్ల నిర్లక్ష్య ధోరణితో మాట్లాడితే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈ ధోరణి వల్ల పెళ్త్లెన తర్వాత వారి భాగస్వామిగా మీరు కూడా ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు లేకపోలేవు.

ఇవి కూడా...

చేయాల్సిన పనిని వాయిదా వేయడం, నిర్దిష్ట నిర్ణయాలు తీసుకోకపోవడం, మంచి- చెడు విశ్లేషించలేకపోవడం, ప్రతి పనికీ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల మీద ఆధారపడటం.. వంటి లక్షణాలు మీకు కాబోయే భాగస్వామిలో గమనిస్తే అటువంటి వ్యక్తులను వివాహం చేసుకోకపోవడమే మంచిది. ఇలాంటి వైఖరుల వల్ల వైవాహిక జీవితంలో సంతోషం ఉండదు సరికదా.. వారిని భాగస్వామిగా ఎంపిక చేసుకుంటే మీరు కూడా భవిష్యత్తులో చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెళ్లికి ముందే ఒకటికి రెండుసార్లు భాగస్వామి గుణగణాలను పరిశీలించడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్