టీ మరకలు పోవట్లేదా?

టీ తాగుతున్నప్పుడు ఒక్కోసారి అది ఒలికి దుస్తుల మీద పడడం, ఆ ప్రదేశంలో మరకలవడం సర్వసాధారణం. ఇలా ఏర్పడిన మరకల్ని వదిలించుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు.

Published : 08 Feb 2024 12:57 IST

టీ తాగుతున్నప్పుడు ఒక్కోసారి అది ఒలికి దుస్తుల మీద పడడం, ఆ ప్రదేశంలో మరకలవడం సర్వసాధారణం. ఇలా ఏర్పడిన మరకల్ని వదిలించుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. మరక పడిన చోట సబ్బుతో బాగా రుద్దడం, మరిగే నీరు మరక పైన పోయడం.. వంటివి చేస్తుంటారు. ఫలితంగా మరక సంగతి పక్కన పెడితే ఆ ప్రదేశంలో దుస్తుల రంగు వెలిసిపోయినట్లుగా తయారవుతుంది. ఈ క్రమంలో దుస్తులపై పడిన టీ మరకల్ని తొలగించుకోవడానికి ఉపయోగించే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం రండి..

స్ప్రే చేయాలి

టీ మరకల్ని తొలగించడంలో వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కొన్ని కప్పుల నీటిలో చెంచా వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి మరక పడిన చోట స్ప్రే చేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా రుద్దాలి. తద్వారా క్రమంగా మరక తొలగిపోవడం గమనించవచ్చు.

బేకింగ్ సోడాతో..

దుస్తులపై పడిన టీ మరకల్ని తొలగించుకునేందుకు ఉపయోగించే మరో పదార్థమే బేకింగ్ సోడా. టీ మరకలు పడిన ప్రదేశంలో చెంచా బేకింగ్ సోడా వేసి నెమ్మదిగా రుద్దాలి. కాసేపటి తర్వాత దుస్తుల్ని శుభ్రం చేస్తే సరిపోతుంది.

నేరుగా పోయాలి

సాధారణంగా కాటన్ దుస్తులపై టీ మరకలు పడితే ఓ పట్టాన వదలవు. అలాంటప్పుడు ఎక్కడైతే టీ మరక పడిందో ఆ ప్రదేశంలో కాస్త వేడిగా ఉన్న నీటిని నేరుగా పోయాలి. మరీ వేడిగా ఉన్న నీటిని ఉపయోగించకూడదు. వేడి ఎంత ఎక్కువ అయితే దుస్తుల నాణ్యత అంత దెబ్బతినే అవకాశాలున్నాయి.

మరకలు మాయం

దుస్తుల రంగు వెలిసిపోకుండా టీ మరకలు సులభంగా తొలగిపోవాలంటే మనం బ్రష్ చేసుకోవడానికి ఉపయోగించే టూత్‌పేస్ట్ వాడచ్చు. ఇందుకోసం మరక పడిన చోట టూత్‌పేస్ట్ పూసి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో ఆ వస్త్రాన్ని ఉతికేస్తే సరిపోతుంది. మరక మాయమవుతుంది.

ఇవి కూడా!

⚛ దుస్తులపై టీ పడిన వెంటనే వెళ్లి నీటితో శుభ్రం చేసుకుంటే మరక సులభంగా వదిలిపోతుంది. ఒకవేళ అలా కుదరకపోతే చల్లటి నీటిలో ఆ వస్త్రాన్ని అరగంట పాటు నానబెట్టాలి.

⚛ చాలామంది టీ మరకల్ని తొలగించుకోవడానికి నిమ్మరసాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఇందులోని బ్లీచింగ్ గుణాల వల్ల రంగు బట్టలు వెలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిట్కాని తెలుపు రంగు దుస్తులకు మాత్రమే ఉపయోగించడం ఉత్తమం.

⚛ టీ మరక పడిన చోట కాస్త లిక్విడ్ డిటర్జెంట్ వేసి చేతి మునివేళ్లతో నెమ్మదిగా రుద్ది కాసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత శుభ్రం చేస్తే మరక వదిలిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్